- వ్యక్తిపూజకు పరాకాష్ట
- అసాధారణీకరణ, ఘనకార్యశూరత్వం
- అమెరికా పర్యటించి వచ్చిన మోదీకి ప్రపంచ విజేతగా కైవారాలు
- గురువు, ముని, రాజనీతిజ్ఞుడు, మెసయ్యా అంటూ భజన
అమెరికాలో మూడు రోజులపాటు 65 గంటలసేపు సాగిన నిర్విరామ పర్యటన, 20 సమావేశాల అనంతరం భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ విరామం తీసుకోలేదు. విమానం దిగిన కొన్ని గంటలలోనే, రాత్రిపూటే సెంట్రల్ విస్తా ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి హుటాహుటిన వెళ్ళారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని 71వ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన మూడు వారాల ‘సేవా, సమర్పణ్ అభియాన్’ లో రెండు వారాలు గడిచిపోయాయి. మన ప్రధాని దేశ సేవలో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జరుగుతున్న వేడుక ఇది.
సర్వసాధారణంగా జరిగే అంశాలను అసాధారణ విశేషాలుగా చూపించడం, తన గురించి, తన పార్టీ గురించి, తను నడుపుతున్న ప్రభుత్వం గురించి ప్రచారం చేసుకోవడం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. కొన్ని విషయాలు వెల్లడించడం, మరికొన్ని విషయాలు మరుగున ఉంచడం అనే విన్యాసం చేయడానికి బీజేపీ, ఎన్ డీఏ ప్రభుత్వం కలసి ఎట్లా ప్రయత్నిస్తున్నాయో, ఈ వ్యవహారానికి మోదీ ఎట్లా సహకరిస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని చేసిన ప్రతి పనినీ ఘనకార్యంగా చూపించే ప్రయత్నాన్ని ఈ ప్రయత్నంలో గమనించవచ్చు.
నడ్డా మోదీస్తోత్రం
అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మరికొందరు రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ఘనస్వాగతం చెప్పారు. మోదీకి స్వాగతం చెప్పేందుకు అక్కడ గుమికూడిన కార్యకర్తలను అలరించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆహార్యం (దుస్తులు) ధరించిన కళాకారులు వినోదం పంచిపెడుతున్నారు. మరో విశేషం ఏమంటే అంతదూరం, అంతసేపు ప్రయాణం చేసి వచ్చిన ప్రధాని విసుగు లేకుండా పదకొండు నిమిషాలు వేదికమీద నిలబడి ఉంటే నడ్డా స్తోత్రపాఠాలు వల్లించడం. అక్కడ చేరిన జనంలో స్పందన లేదు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అత్యద్భుతంగా ప్రసంగించినందుకూ, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసినందుకూ ప్రదానికి బీజేపీ అధ్యక్షుడు కృతజ్ఞతలు చెప్పారు. ఆ ప్రసంగం ఒక నిజమైన రాజనీతిజ్ఞుడు చేసిన ప్రసంగంలాగా నడ్డాకి కనిపించింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రపంచదేశాలకు ప్రధాని తన ప్రసంగం ద్వారా తెలియజేశారని నడ్డా ప్రశంసించారు. చాలా ముఖ్యమైన విశ్వవేదికపైన భారత సైద్ధాంతిక ఆధిక్యాన్ని మోదీ నిరూపించారని కూడా నడ్డా అన్నారు. అమెరికా మోదీకి 157 కళారూపాలను ఇవ్వడాన్నిభారత గత వైభవాన్ని మోదీ హయాంలో పునరుద్దరించడంగా అభివర్ణించారు. అమెరికా పర్యటన, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగం సర్వసాధారణమైనవి. మోదీనే ఇదివరకు మూడు సార్లు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. మోదీతో పాటు మరి 83 దేశాల అధినేతలు ఐక్యరాజ్య సమితి వేదికపైన ప్రసంగించారు. అంతకు ముందు అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు చేయని హడావుడి, ప్రశంసల వర్షం, ఘనసన్మానం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికల కోసం కావచ్చు.
బీజేపీ నేతల అత్యుత్సాహం
ప్రధాని 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడంలో కూడా కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ విపరీతమైన ఉత్సాహం ప్రదర్శించాయి. అరవై సంవత్సరాలు నిండినప్పుడు షష్టిపూర్తి ఘనంగా చేసుకోవడం భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఆనవాయితీ. 65, 70, 75 సంవత్సరాలను కూడా మైలురాళ్ళుగా భావించి సంబరాలు చేసుకోవచ్చు. 80 సంవత్సరాలైతే సహస్రచంద్రోదయం అంటూ కొడుకులూ, కూతుర్లూ, మనుమలూ,మనమరాళ్ళూ, స్నేహితులూ, బంధువులూ హడావిడి చేస్తారు. కానీ 71వ జన్మదినాన్ని ఒక అసాధారన సందర్భంగా ప్రభుత్వం, అధికార పార్టీ, ప్రధాని వేడుక చేసుకోవడం వింతలతో వింత. ఆ రోజున నరేంద్రమోదీకి అరుదైన బహుమానం ఇవ్వాలని కేంద్ర మంత్రులూ, పార్టీ నాయకులూ అనుకున్నారు. అందుకే 2.5 కోట్ల మంది ప్రజలు కోవిద్ టీకాలు వేయించుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. దానిని భారత దేశ శక్తిగా కేంద్రమంత్రులూ, బీజేపీ నాయకులూ, కార్యకర్తలూ, మద్దతుదారులూ అభివర్ణించారు. జన్మదిన వేడుకకు కొన్ని రోజుల ముందు, కొన్ని రోజుల తర్వాత టీకాలు వేసుకున్నవారి సంఖ్య చాలా చాలా తక్కువ ఉన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రెండో తరంగం కోవిద్ దాడి చేసినప్పుడు విలవిలాలాడిన ఘట్టాన్ని విస్మరించి గొప్ప ఆత్మవిశ్వాసంతో మోదీ ఐక్యరాజ్యసమితి లో కోవిద్ మహమ్మారిని అరికట్టడానికి డీఎన్ఏ టీకాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ప్రపంచ దేశాలను టీకాలు తయారు చేసుకోవడానికి ఇండియాకు రావలసిందిగా ఆహ్వానించారు. ప్రధాని పుట్టిన రోజును అసాధారణమైన, ఘనకార్యం సాధించిన మహాదినంగా పరిగణించడమే ముఖ్యం. మనం టీకాలను ఉద్యమసదృశంగా చేయించుకోబోతున్నామని దేశ ప్రజలు ఊహించుకోవాలని నిర్వాహకుల ఆకాంక్ష. ప్రధాని సైతం ఈ ఉత్సవోత్సాహంలో పడిపోయారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఇటువంటి ఘనకార్యం సాధించలేదని మోదీ అన్నారు. తన పుట్టిన రోజుకు ముందూ, తర్వాత టీకాలు అతి తక్కువ మందికి వేసారనే వాస్తవాన్ని ఆయన గుర్తించదలచుకోలేదు. ఇది ప్రధాని నరేంద్రమోదీకి భారత్ ఇచ్చిన బహుమతిగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఒక ట్వీట్ లో అభివర్ణించారు.
సేవా, సమర్పణ్ అభియాన్
మోదీ జన్మదినోత్సవాలలో భాగంగా జరుపుకుంటున్న మూడు వారాల ‘సేవా, సమర్పణ్ అభియాన్’ లో అయిదు కోట్ల పోస్టు కార్డులను ప్రధానికి పంపుతారు. ఆయన చేసిన గొప్ప పనులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ కార్డులపైన ప్రజలు రాస్తారు. రేషన్ ఇవ్వాలని నిర్ణయించినందుకు గాను ప్రధానికి అభినందనలు తెలుపుతూ ప్రకటన అచ్చువేసిన 14 కోట్ల సంచీలను ప్రజలకు పంచిపెడతారు. టీకాలూ, రేషన్ పొందిన ప్రజలు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తమ సందేశాన్ని విడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేయాలి. మోదీకి వచ్చిన మెమెంటోలను వేలం వేస్తారు. వేలంపాటలో పాల్గొనడానికి ప్రజలను సమీకరిస్తారు. మోదీ జీవితంపైనా, సేవలపైనా సదస్సులు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సదస్సులలో ప్రసంగించడానికి సమాజంలో పేరుప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులను ఆహ్వానిస్తారు. మోదీ జీవితంపైనా, విజయాలపైనాఅన్ని భారతీయ భాషలలో ప్రముఖ రచయితలు వ్యాసాలు రాసి వార్తాపత్రికలలోనూ, మ్యాగజైన్లలోనూ ప్రచురిస్తారు. మోదీ 71వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 71 నదులను పరిశుభ్రం చేస్తారు. రక్తదాన శిబిరాలూ, రక్తపరీక్షా కేంద్రాలూ, వయోవృద్ధులకు ఉచిత భోజనం ఏర్పాట్లు ఈ మూడు వారాల పొడవునా ఏర్పాటు చేస్తారు. ప్రధాని జన్మదినోత్సవాన్ని ఒక ఘనకార్యంగా జరుపుకోవడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు ఇవి. మోదీ బొమ్మ ముద్రించిన సంచులు ప్రతి ఇంటికీ చేరాలనీ, ముఖ్యంగా మహిళల చేతికి అందాలనీ, పేదల పాలిటి పెన్నిధిగా వారు ప్రధానిని పరిగణించాలనీ ఈ కార్యక్రమాలను రూపొందించిన ప్రత్యేక సంఘంలో సభ్యుడైన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఒకరు ఉద్ఘాటించారు. సంచుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత సంఘాన్ని నియమించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి మోదీజీ ఏమి చేశారో చెప్పడంపైన తమ దృష్టి అంతా ఉంటుందనీ, సేవ, త్యాగాల విలువ తెలియజేయడం కోసం ప్రయత్నిస్తామనీ ఈ సంఘం నాయకుడు వ్యాఖ్యానించారు. ఇందులో లక్ష్యం స్పష్టం – మోదీని అసాధారణమైన మహానేతగా చూపించడం, ఆయన చేసే పనులను ఘనకార్యాలుగా ప్రదర్శించడం.
అసాధారణమైన రాజకీయ జీవితం
నరేంద్రమోదీ రాజకీయజీవితం కూడా అసాధారణమైనదని చిత్రిస్తారు. మోదీ సైతం ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో బారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పరిపుష్ఠంగా ఉన్నదో తననే ఉదాహరణగా చూపుతూ, టీ అమ్మడంలో తండ్రికి సహాయపడిన బాలుడు మీ ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానిగా నిలబడి మాట్లాడుతున్నాడని చెప్పారు. ప్రధానిగా మోదీ తీసుకున్న నిర్ణయాలు అపూర్వమైనవనీ, ఆయనకు ముందు ప్రధానులుగా పనిచేసినవారు ఎవ్వరూ అటువంటి నిర్ణయాలు తీసుకొనే సాహసం చేయలేదనీ నడ్డా ప్రస్తుతించారు. మోదీ కారణంగానే అన్ని రాజకీయ పార్టీలు తమ పద్ధతులు మార్చుకొని దేశాభివృద్ధికీ. ప్రజల సంక్షేమానికీ కృషి చేస్తూ ఉన్నాయని నడ్డా అభిభాషించారు. జాతీయ రాజకీయాలలోకి మోదీ ప్రవేశించడానికి ముందు రాజకీయ పార్టీలు దేశాభివృద్ధికీ, ప్రజాసంక్షేమానికీ పాటుపడలేదని భావించవలసి వస్తుంది. నడ్డాజీ అంతటితో ఆగలేదు. ’’మోదీ ఒక మునిలాగా జీవించారు. భారత్ ను విశ్వగురు చేయడం ఒక్కటే ఆయన లక్ష్యం’’ అని నడ్డా అడ్డంగా పొగిడారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి మార్పులలో విద్యామంత్రి పదవి నుంచి వైదొలిగిన మాజీ మంత్రి ఒకరు మోదీని తన గురువుగా చెప్పుకున్నారు. ఒక గురు, ఒక ముని, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక మెసయ్యాల కలయికే మోదీ అని అభివర్ణించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన ప్రధాని మోదీ ఒక్కరే అని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారు. మోదీకంటే ముందు బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన మొరార్జీదేశాయ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన విశ్వనాథ ప్రతాప్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండిన దేవగౌడ అనంతర కాలంలో ప్రధానులుగా పని చేశారన్నవాస్తవం ఆ సీనియర్ బీజేపీ నాయకుడికి తెలియకపోవడం ఆశ్చర్యం. భక్తిపారవశ్యంలో సంభవించిన మతిమరుపా లేక సహజసిద్దమైన మందమతా?
బాల నరేంద్రుడు
‘బాల్ నరేంద్ర’ అనే కామిక్స్ పుస్తకం నరేంద్రమోడీ వ్యక్తి ఆరాధనకి పనికి వచ్చే పత్రిలో ఒకటి. బాలుడిగా నరేంద్రమోదీ సాధించిన విజయాలనూ, ప్రదర్శించిన అసాధారణ వ్యక్తిత్వ పార్శ్వాలనూ వర్ణిస్తూ రాసిన 17కథలు ఈ పుస్తకంలో ఉంటాయి. మోదీ బాలుడిగా ప్రదర్శించిన సాహసం, కరుణ, ఒకరి స్థానంలో తనను ఊహించుకొని వారి సమస్యలను అర్థం చేసుకునే శక్తి (ఎంపతీ), ధైర్యం, ఉదాత్తమైన ఇతర లక్షణాలు ఇందులో వర్ణించారు. ఈ పదిహేడు కథలూ నరేంద్రమోదీ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన సమాచారం అందిస్తాయని, జాతి యావత్తూ గొప్ప ఆశతో ఎదురు చూస్తున్న నాయకుడు ఎట్లా తయారైనారో ఈ పుస్తకం తెలుపుతుందని తుదిపలుకులలో ప్రచురణకర్త రాశారు. ఇది 2014లో ప్రచురితమైంది. ఈ కథల ప్రచురణకు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయం అనుమతించింది. ‘బాల్ నరేంద్ర’ కామిక్స్ పుస్తకం ప్రచురణకర్త ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ, ఈ కథల విశ్వసనీయత ఏమంటే ఇందులో పొందుపరచిన సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందని అన్నారు. దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు మన ప్రధాని పేరు పెట్టారు. భారతదేశంలో ప్రధాని స్థాయిలోని నాయకుడు జీవించి ఉన్న సమయంలోనే ఒక వ్యవస్థకు ఆయన పేరు పెట్టడం అన్నది ప్రప్రథమం. ఎట్లా చదవాలో, పరీక్షలు ఎట్లా రాయాలో పిల్లలకు మోదీ చెప్పగలరు. దాని పైన ఒక పుస్తకమే రాశారు. ఒత్తిళ్ళు లేకుండా జీవితం గడపడం ఎట్లాగో పెద్దవాళ్ళకు సలహాలు చెబుతూ రాశారు. మోదీ యోగాభ్యాసం చేస్తారు. యోగా చేయవలసిందిగా ఒక యాప్ ద్వారా ఇతరులకు ఉద్బోధిస్తారు. అడవి జంతువులంటే ఆయనకు ఇష్టం.
ఎంత ఒత్తిడైనా తట్టుకోగలరు
మోదీ జీవిత విధానం కూడా విశేషమైనది. కఠినమైన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఉదయం చేస్తారు. రోజుకు 18 గంటలు పని చేస్తారు. పండుగలూపబ్బాలూ సరిహద్దుకు వెళ్ళి వీరజవాన్లతో గడుపుతారు. ఎంత ఒత్తిడినైనా అలవోకగా తట్టుకోగలనని నిరూపిస్తారు. మూడు రోజులలో 65 గంటల పర్యటనలో అమెరికాలో 20 సమావేశాలలో పాల్గొన్నారు. అవి ఆషామాషీ సమావేశాలు కావు. అమెరికా అధ్యక్షుడితో, ఆస్ట్రేలియా ప్రధానితో, జపాన్ ప్రధానితో ముఖాముఖి సమావేశాలలో ద్వైపాక్షిక సంబంధాల గురించి లోతుగా మాట్లాడటం, క్వాడ్ కూటమి నాయకులతో ప్రపంచ పరిస్థితుల గురించి, చైనా, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ వంటి గంభీరమైన సమస్యల గురించి సమగ్రంగా చర్చించడం అంటే మాటలు కాదు. రాజకీయ చర్చలే కాకుండా అమెరికా వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులతో సమాలోచనలూ, ఇతర ముఖ్యమైన ఆంతరంగిక సమావేశాలలో కూడా పాల్గొన్నారు. ఇవి కాకుండా ఐక్యరాజ్య సమితి సర్వసభ్యసమావేశంలో ‘‘ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ’’ మోదీ మాట్లాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించారు. భారత సైద్ధాంతిక ఆదిపత్యాన్ని చాటారు. అంతర్జాతీయరంగంలోమోదీ పాత్రను కూడా అసాధారణీకరించే ప్రయత్నం జరిగింది. ముఖ్యమైన దేశాల నాయకులతో నువ్వు అంటే నువ్వు అనుకునేంత (ఫస్ట్ పర్సన్ లో పిలుచుకునేంత) సాన్నిహిత్యం మోదీకి ఉన్నదని చెబుతారు. బరాత్, డొనాల్డ్, ఇమాన్యువెల్, బెన్, చైనా అధినేత లీషింగ్ పింగ్ మోదీకి స్నేహితులు. పింగ్ అయితే మోదీని కలుసుకునేందుకు రెండుసార్లు ఇండియాకు వచ్చారు. మోదీ గుజరాత్ లో యువకుడిగా ఉండగా బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. ఈ విషయం ఆయన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో చెప్పారు. మోదీ వస్తువల మీద బీజేపీ పోర్టల్ లో ఒక విభాగం ఉంది. ‘నమో’ బ్రాండింగ్ తో ఆయన బొమ్మ కలిగిన కోవిడ్ మాస్క్ లూ, ముజేతి కంకణాలూ, పెన్నులూ, నోట్ పుస్తకాలూ, బాడ్జీలూ, స్టిక్కర్లూ, టోపీలూ, టీషర్టులూ రకరకాలవి ఉంటాయి. మోదీ మొహంలాగా కనిపించే ముఖౌటాలు (ముసుగులు) కూడా విరివిగానే ప్రచారంలో ఉన్నాయి. ఒక్క భారతీయ జనతాపార్టీ మాత్రమే కాదు ప్రభుత్వం సైతం మోదీ ప్రచారానికి చేయవలసిందంతా చేస్తోంది. ప్రతి పెట్రోల్ బంక్ లోనూ ప్రధాని చిత్రం మనకు స్వాగతం చెబుతుంది. టీకాలు వేసుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ పైన కూడా మోదీ ఫోటో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నడిపే పోర్టల్ లో, కేంద్ర ప్రభుత్వ శాఖలు నిర్వహించే పోర్టల్స్ లో, విడుదల చేసే ప్రకటనలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలలో మోదీ బొమ్మ అనివార్యం. ఇవీ మోదీ వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించడానికి బీజేపీ, ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలలో కొన్ని. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్ ఇందుకోసం ఉన్నాయి. సుప్రీంకోర్టు మెయల్ తో పాటు మోదీ బొమ్మ ఉండే ఏర్పాటు కూడా చేశారు. చివరికి అత్యున్నత న్యాయస్థానం కొన్ని రోజుల కిందట ప్రభుత్వాన్ని గట్టిగా మందలించిన తర్వాతనే మోదీ బొమ్మను తొలగించారు.
వ్యక్తిపూజ లేకుండా రాణించవచ్చు
వ్యక్తి ఆరాధనను పనికట్టుకొని ప్రోత్సహించడం అన్నది కొత్త కాదు. చాలామంది నాయకులు ఆ పని చేశారు. లాటిన్ అమెరికా దేశాలలో జువాన్ పెరాన్ (అర్జెంటైనా), బటిస్టా, కాస్ట్రో (క్యూబా), ఆగస్టో పినోచెట్ (చిలీ), యూరప్ లో ఫ్రాన్సిస్కో ఫ్రాంక్ (స్పెయిన్), హిట్లర్ (జర్మనీ), ముస్సోలినీ (ఇటలీ), స్టాలిన్ (సోవియట్ యూనియన్), ఆఫ్రికాలో రాబర్ట్ ముగాబే (జింబాబ్వే), ఇదీ అమీన్ (ఉగాండా), ఆసియాలో సుకర్ణో (ఇండొనీషియా), మావో జెడాంగ్ (చైనా) వంటి నియంతలు ఉన్నారు. వీరందరికీ రెండు అంశాలలో పోలిక ఉంది. అందరూ నియంతలే, నిరంకుశపాలకులే. వారిలో ఎవ్వరికీ అధికారం పోయిన తర్వాత ఇసుమంతైనా గౌరవం మిగలలేదు. చరిత్ర వారిని ఉపేక్షించలేదు. అధికారంలో ఉన్నంతకాలం పత్రికలలో పతాక శీర్షికలు వారిని కీర్తిస్తూ వచ్చినా, చుట్టూ ఉన్న వందిమాగధులు ఎన్ని దండకాలు చదివినా అధికారాంతమునందు చూడవలె అన్నట్టు ఉంటుంది నియంతల జీవితం. మన దేశంలో కూడా పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఇందిరాగాంధీ కొద్ది కాలం పాటు నియంతలాగా వ్యవహరించడం వల్ల ఆమె గొప్పదనానికి మచ్చ వచ్చింది. ఆ మచ్చ లేకపోతే అన్ని ప్రజాస్వామ్యాలకూ తల్లి వంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిపూజ తగదు. అసాధారణీకరణ, మామూలు రొటీన్ పనులను సైతం ఘనకార్యాలుగా చిత్రించే ప్రక్రియ లేకుండా దేశానికి ప్రయోజనం కలిగించే విధానాలను నిజాయితీగా అమలు చేయడం ద్వారా చాలామంది నాయకులు పరిపాలనలో అద్భుతాలు సాధించారు. ఆత్మవిశ్వాసంతో చాలా ఏళ్ళు అధికారంలో కొనసాగారు. ఇందుకు సజీవమైన ఉదాహరణ జర్మనీకి చెందిన ఎంగెలా మర్కెల్. ఆత్మవిశ్వాసం కలిగిన పార్టీలూ, నాయకులూ అసాధారణీకరణ కోరుకోరు. గోరంతలు కొండంతలు చేసి చూపరు. ఆత్మవిశ్వాసం ఉన్న నాయకులకు పొగడ్తలూ, అసాధారణీకరణలూ, స్తోత్రపాఠాలూ అవసరం లేదు. ఏదైనా లోపం ఉన్న నాయకులూ, ఆత్మవిశ్వాసం లేనివారూ, వైఫల్యాలను దాచుకోవలసిన అగత్యం ఉన్నవారు మాత్రమే ఇటువంటి భజన కార్యక్రమాలు కోరుకుంటారు.
(29 సెప్టెంబర్ 2021 బుధవారం మధ్యాహ్నం ప్రసారమైన శ్రీ పరకాల ప్రభాకర్
విశేష కార్యక్రమం మిడ్ వీక్ మ్యాటర్స్-31 ఆధారంగా)