Thursday, December 26, 2024

సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

గాంధీయే మార్గం-10

‘‘..ఇంటిపేరు సార్థకపరిచే ఆకారము! చాలా పొట్టి మనిషి, పొట్టిగా కత్తిరించిన క్రాఫు, మోటు ఖద్దరు అడ్డకట్టు, భుజం మీద చిన్న తుండు గుడ్డ. చేతిలో కాంగ్రెస్‌ జెండా, మెడకు రెండువైపులా అట్టబోర్డు, ప్రతి అట్టపైనా సిరాతో వ్రాసిన నినాదాలు, ‘హరిజనులను దేవాలయాలలోనికి రానీయండి’, ‘హరిజనులతో సహపంక్తి భోజనాలు చేయండి’ అని – ఆయన వేషము, ఆయన చర్యలు నాకే కాదు, ఆయనను చూచిన ప్రతి వారికీ వింతగానే ఉండేవి…’’

1945-1952 మధ్యకాలంలో నెల్లూరులో దీనజనసేవలో పొట్టి శ్రీరాముగారితో కలిసి సన్నిహితంగా పనిచేసిన ఆచార్య పి.సి.రెడ్డిగారి అభిప్రాయమది. వారు ఇంకా ఇలా అంటారు – ‘‘… ఈ అభివర్ణన బట్టి శ్రీరాములు తన గురువు గాంధీజీ వలె విచిత్రమైన పద్ధతులను అవలంబిస్తే ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించవచ్చునని, తన ప్రజాసేవాలక్ష్యాలను తేలికగా సాధించవచ్చునని భావించినట్లు తోస్తూంది. కానీ గురువుకు ఉన్న ఆకర్షకమైన రూపంగానీ, వక్తృత్వచాతురిగాని, లౌక్యంగాని, అన్నింటినీ మించి తన అభిప్రాయాలను ప్రచారం చేసుకోగల శక్తిగాని శ్రీరాములులో లోపించడం వలన ఆయనను ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఆత్మాహుతి చేసే వరకు శ్రీరాములు ఆదర్శవాదాన్ని కాంగ్రెస్‌ సంస్థగానీ, ప్రజలుగానీ సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయనను ఒక చాదస్తుడుగాను, పిచ్చివాడుగాను, ఒక వింత వ్యక్తిగాను మాత్రమే ప్రజలు భావించారు…’’

జస్టిస్ కృష్ణయ్యర్ ఉద్బోధ 

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత 1985 మార్చి 16న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్ గారు మదరాసులో చేసిన పొట్టి శ్రీరాములు స్మారక ప్రసంగం చివరలో ఇలా వ్యాఖ్యానిస్తారు –

‘‘… పొట్టి శ్రీరాములుకూ, ఆయన సందేశానికీ మనం ద్రోహం చేశాము. ఆయనను సరిగా అర్థం చేసుకోకుండా, ఆయన చేసిన ఆత్మబలిదానాన్ని ప్రాంతీయతత్వ విజయంగా చిత్రించి, ఆయనను పరిహసింప జూచాము. ఈ విధంగా ఆయనలోని కుహనా వలస రాజ్య నాగరికత యొక్క ప్రభావం ‘వైవిధ్యంలో ఏకత్వం’ అనే మన జాతి ప్రధాన సూత్రానికి తీరని హాని కలిగించింది. ‘రాజకీయ ప్రాంతీయ వాదాన్ని’ (Political Regionalism) పరిహసించడం వంటి రూపాలలో ఆ ప్రభావం అభివ్యక్తం అయింది. మైనారిటీలకు రక్షణ కల్పిస్తూ స్వతంత్రంగా తాను అభివృద్ధి చెందాలని సమాన ధర్మాలుగల ఒక భాషాప్రాంతం ప్రజలు కోరే కోరికను ఎవరూ అణచివేయజాలరు. అలా అణచి వేసిననాడు అత్యద్భుతవాస్తవం అయిన మన ‘సాంస్కృతిక వైవిధ్యం’ దెబ్బతినక మానదు. ప్రజల సాంస్కృతిక వారసత్వాన్నీ, భవిష్యత్తునూ ప్రకటించే సుసంపన్నమైన భాషలు అనేకం ఉండటం దేశానికి విపత్తు కాదు. పరిపుష్టి కలిగించే అంశమే అది. నేడు మన కర్తవ్యం పొట్టి శ్రీరాములుకూ  ఆయన పోరాట లక్ష్యానికి కొరత వేయడం కాదు, గాంధీజీ బోధన ద్వారా ఏ ‘స్వరాజ్య-స్వదేశీ’ సిద్ధాంతం శ్రీరాములును ఉత్తేజపరచిందో, ఆ సక్రమమైన మార్గంలో ఆ ఉద్యమాన్ని పునరుద్ధరించడం…’’

 మహాత్మాగాంధీ హత్య జరిగినపుడు పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఉన్నారు. ఆ వార్త వినగానే నిర్ఘాంతపోయి,  రెండు రోజులపాటు మౌనవ్రతం అవలంబించారని పి.సి. రెడ్డి చెప్పారని నమోదు అయ్యింది. రెండు రోజులు శ్రీరాములు తిండీ, నీరూ ముట్టలేదు. అటు తర్వాత కొంత స్థిమితపడి ఇలా అన్నారట – ‘‘…ఇంక మనదేశపు రాజకీయాలో అనూహ్యమైన పరిణామాలు రాబోతున్నాయి. ఈ సంఘటన మనదేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు వంటిది. ఇంక గాంధీయిజం స్థానే నెహ్రూయిజం చోటు చేసుకోగలదు. ఈ దశలో జాతిపిత నిర్యాణం మిక్కిలి అశుభ సూచకం…’’ ఇది పొట్టి శ్రీరాముగారికి గాంధీజీ మీద ఉన్న ఆశా, నమ్మకం, గౌరవాలను పట్టి చూపుతోంది.

గాంధీ, శ్రీరాములు మధ్య పోలికలు

 గాంధీజీ, శ్రీరాములుకు సంబంధించి పోలికలు, తేడాలు బాగా విశ్లేషించారు వై.ఎస్‌.శాస్త్రి ‘అమరజీవి సమరగాథ’ గ్రంథంలో.  ఈ వాక్యాలు చూడండి — 

‘‘…చాలా విషయాలలో గురువుకీ, శిష్యునికీ మధ్య ఎలాంటి పోలికా లేదు. గాంధీజీ స్ఫురద్రూపి. విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేశారు. ఆదిలో శ్రీరాములు వలే అంతర్ముఖుడుగా ఉన్నా, లండన్‌లో చేరిన తర్వాత కొన్ని మాసాలకే తన చుట్టూ ఉన్న లోకంతో సరిపుచ్చుకుని, లోకజ్ఞత అలవరచుకుని, బహిర్ముఖుడుగా మారారు. శ్రీరాములు అలా కాకుండా అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి, సామాన్యమైన విద్యాభ్యాసం చేసి, చివరి వరకు సామాన్యుడుగానే జీవించాడు. జీవితాంతం ఆంతర్ముఖుడుగానే ఉన్నాడు, లోకజ్ఞత అలవడ లేదు…’’ 

పొట్టి శ్రీరాములు సత్యాగ్రహిగా తన జీవితంలో త్రికరణ శుద్ధిగా అక్షరాలా అమలు జరిపారు. ఎలాంటి కీర్తిని గానీ, ప్రజల కృతజ్ఞతను గాని ఎన్నడూ ఆశించలేదు. ప్రజలలో కొందరు తనను పిచ్చివానిగా భావించినా లెక్క చేయకుండా సంతృప్తిగా, సంతోషంతో తన విధి నిర్వహణను తను చేశారు. అలాగే ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేయడం తప్పా, వారి ప్రశంసలు, మెప్పు సంపాదించాలనే నైపుణ్యం అతనిలో మృగ్యం.  

పొట్టి శ్రీరాములు అంతశ్చేతనకు, వ్యక్తిత్వానికి విలక్షణ రూపాన్ని కల్పించింది గాంధీజీ సిద్ధాంతాలే!

గాంధీజీలో ఇరుపార్శ్వాలు లోకాన్ని సమ్మోహితం చేశాయి. ఒకటి – ఆయనలోని రామభక్తుడు, యోగి, సంయమి, ఋషి కల్పుడు. మరొకటి – రాజకీయ  చాతురీదురంధరుడు. భారతస్వాతంత్య్ర సంగ్రామసేనాని. ఈ పార్శ్వాలు నిజానికి పరస్పర విరుద్ధమైనా, వీటి మధ్య సామరస్యం సాధించడానికి జీవితాంతం గాంధీజీ కృషి చేశారు. శ్రీరాములును ఆకర్షించింది గాంధీలోని తొలి పార్శ్వం మాత్రమే! గాంధీజీలోని యోగి, సర్వసంగ పరిత్యాగి, దీనజనపరాయణుడు శ్రీరాములుతో మమైకం చెందారు – లేకపోతే ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళి ఉండేవాడు కాదు,  సబర్మతీ ఆశ్రమ జీవితాన్ని కోరుకుని ఉండేవాడు కాడు.

సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు

గాంధీజీ అహింసా సూత్రంలోని అసలు భావాన్ని పొట్టి శ్రీరాములు ఎలా అర్థం చేసుకున్నారో ఒక ఉదంతం మనకు స్పష్టం చేస్తున్నది. గాంధీజీ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు బస చేసిన గది ముందు రెండున్నర అడుగుల పొడవుగల ఒక కోడెత్రాచు కనిపించిందట. ఆశ్రమంలో కొత్తగా చేరిన, నియమాలు వంటబట్టించుకోని ఒక యువకుడు దాన్ని చంపాలని రాయి విసిరితే, పాము రెండు భాగాలుగా తెగి,  తల భాగం నానా యాతన పడుతోందట. దీన్ని చూసి శ్రీరాములు పరితపిస్తూ , రాయి విసిరిన యువకుణ్ణి – పడగ మీద కొట్టి పామును చంపివేయవసిందిగా వేడుకున్నారు. దీన్ని గమనించిన ఆశ్రమ వాసులు పామును చంపాలని ప్రోత్సహించింది శ్రీరాములేనని గాంధీజీకి ఫిర్యాదు చేశారు. ఇది విని,  కాసేపు గాంధీ మౌనం వహించారు. పిమ్మట శ్రీరాముల చర్య ఎలా అహింసావ్రతానికి అనుకూలమైందో వివరించారు. 

ఒక ఆవుదూడ నయం కాని వ్యాధితో యాతనకు గురవుతుంటే – జీవకారుణ్య దృష్ట్యా దాన్ని వధించడమే ఉత్తమమనిపించిందని గాంధీజీ తన గత అనుభవాన్ని విశ్లేషించి పొట్టి శ్రీరాములు చర్యను సమర్థించారు. గాంధీజీ ఆలోచనలలోని అంతరార్థాన్ని అంత బాగా ఆకళింపు చేసుకున్న సత్యాగ్రహి శ్రీరాములు! 

సబర్మతీ ఆశ్రమంలో క్షాత్రాలయంలో రాత్రి 9 గం. తర్వాత ఏ పురుషుడు కనబడగూడదనేది నియమం. అయితే ఆశ్రమ కార్యదర్శి నారాయణ్‌దాస్‌, క్షాత్రాలయం లో  స్త్రీ హాస్పటల్‌ వ్యవహారాలు పర్యవేక్షించే కుమారి ప్రేమా బెహన్‌ కాంతక్‌ గార్లు సమయాన్ని మరచిపోయి చర్చిస్తుండేవారు. వారి మీద ఉండే గౌరవం వల్లా చాలామంది ఆశ్రమవాసులు పట్టించుకోలేదు. కానీ శ్రీరాములు దీనిని తీవ్రంగా తీసుకున్నారు. కొందరు వారించినా వినకుండా గాంధీజీకి ఫిర్యాదు చేశారు శ్రీరాములు. గాంధీజీ వారిని మందలించారు కూడా. నియమాలలోని అంతరార్ధాలను అందుకున్నారు కనుకనే కారణం చెప్పకుండా ఆశ్రమాల నుంచి తప్పుకున్నారు పొట్టి శ్రీరాములు!

శ్రీరాములుపై గాంధీజీ అభిప్రాయం

1946 నవంబరు 25న శ్రీరాములు హరిజనుల దేవాలయ ప్రవేశం గురించి ఆమరణ నిరాహారదీక్షకు పూనినపుడు, మిగతా కాంగ్రెస్‌ నాయకులకు స్వాతంత్య్రసాధన ప్రధానమనిపించింది. ఈ సంఘటన చివరలో టంగుటూరి ప్రకాశం గారికి  గాంధీజీ రాసిన జవాబులో ఈ వాక్యాలున్నాయని చరిత్రకారులు  రామచంద్ర గుహ ( 2003 మార్చి 30న ‘ది హిందూ’ పత్రికలో) రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు –  

“… glad that the  fast of Sreeramulu ended in a happy manner you described. He had sent me a telegram immediately after he broke his fast. I know he is a solid worker, though a little eccentric.” ఈ మాటల గురించి వ్యాఖ్యానిస్తూ గుహా, “Eccentric” is a word capacious enough to also mean “determined”. This Potti Sreeramulu certainly was” అని అంటారు. 

పొట్టి శ్రీరాములు నిర్యాణం వార్తను ప్రచురించిన ఆంధ్రపత్రిక, పొట్టిశ్రీరాములు

1944 అక్టోబరు 3 నుంచి 1945 సెప్టెంబరు 2 మధ్య కాలంలో కావలి నుంచి 4, నెల్లూరు నుంచి 5, అంగూరు నుంచి ఒకటి – ఇలా ఎనిమిది సుదీర్ఘమైన లేఖలను గాంధీజీకి పంపారు శ్రీరాములు. హరిజనోద్ధరణ గురించి తన మనస్సులో చలరేగుతున్న ఆలోచనలను గాంధీజీకి వివరంగా తెలిపారు. అయితే గాంధీజీకి,  కాంగ్రెస్‌ నాయకులకు హరిజన సమస్య కన్నా హిందూ -ముస్లిం సమస్య కీలకంగా కనిపించింది. గాంధీజీ మహాశయుడు శ్రీరాములు రాసిన అన్ని ఉత్తరాలకు జవాబు ఇవ్వలేకపోయేవారు. దానికి కారణం గాంధీజీకి అంత సమయం లేకపోవడమే. అందువల్లనే, ఇచ్చిన జవాబులు కూడా సంక్షిప్తంగా ఉండటమే కాదు, సుదీర్ఘమైన లేఖల బదులు క్లుప్తంగా రాయవసిందిగా శ్రీరాములును గాంధీజీ కోరేవారు. నిజానికి గాంధీజీకి పొట్టి శ్రీరాములు రాసిన ఉత్తరాలను అధ్యయనం చేస్తే మరింత లోతుగా మనకు బోధపడతారు శ్రీరాములు!

వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం

నెల్లూరులోని మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజన ప్రవేశం కోసం 1946 మార్చిలో పొట్టి శ్రీరాములు చేసిన పది రోజుల నిరాహార దీక్ష ఫలించింది. మార్చి 15వ తేదీన  మదరాసు ప్రెసిడెన్సీ రాష్ట్ర ప్రభుత్వ ఆజ్ఞలకు లోబడి హరిజన ప్రవేశానికి అనుమతించారు. మరుసటి రోజు అంటే 1946 మార్చి 16న 12 గంటలకి పొట్టి శ్రీరాములు తన పది రోజుల దీక్షను విరమించారు.  మరలా 1946 నవంబరు, డిసెంబరు నెలలో 20 రోజులు ఉపవాస దీక్ష చేసి హరిజన దేవాయ ప్రవేశ శాసనానికి తోడు హరిజన బాధా నివారణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోదించేటట్లు చేశారు. పిమ్మటనే తిరుమల వేంకటేశ్వరస్వామి, సింహాచలం నరసింహస్వామి వార్ల ఆలయాల్లో వారికి ప్రవేశం లభించింది.  హరిజనుల ఆర్థిక, సాంఘిక పరిస్థితులలో ఏ మాత్రం అభివృద్ధి కనబడలేదని ఆవేదన పడిన పొట్టి శ్రీరాములు అప్పటి మదరాసు ప్రెసిడెన్సీ ప్రధాని ఓమండూరి రామస్వామి రెడ్డికి 1948 సం. జూన్‌, జూలై మాసాలలో రెండు ఘాటైన ఉత్తరాలు కూడా రాశారు! 

గాంధీజీ జీవితాన్నీ, ఆలోచనలనూ, సిద్ధాంతాలనూ పూర్తిగా ఆకళింపు చేసుకున్న మనస్సన్యాసి పొట్టి శ్రీరాములు! గాంధీజీ బాటలో నడిచిన అపర గాంధేయవాది పొట్టి శ్రీరాములు!! 

(రచయిత మొబైల్: 9440732392)

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles