• దేశవ్యాప్తంగా హైకోర్టులకు మరో ఐదారుగురు కొత్త సీజేలు
• తెలుగు రాష్ట్రాలకు సీజేలుగా సీనియర్ జడ్జిల నియామకం?
• సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం?
తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఐదారు హైకోర్టులకు కొత్త సీజేలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కొలీజియం సమావేశంలో నిర్ణయం:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌తో లపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించినట్లు సమాచారం. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏపీ హైకోర్టులో సీజే తర్వాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
ఇది చదవండి : జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
సీనియర్ జడ్జిల నియామకం:
న్యాయమూర్తుల బదిలీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కొత్తగా సీనియర్లయిన జడ్జిలను నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి తర్వాతి స్థానంలో ఉండి, అవసరాన్ని బట్టి తాత్కాలిక చీఫ్ జిస్టిస్ గా బాధ్యతలు నిర్వహించే స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలో సుప్రీంకోర్టు జడ్జిలు అయ్యే అర్హతలున్న జడ్జిలను తెలుగు రాష్ట్రాలకు పంపించనున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్‌లను ఏ రాష్ట్రాలకు బదిలీ చేస్తారు. వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమించారనే విషయాలు ఒకటి రెండు రోజులలో తెలిసే అవకాశం ఉంది.