దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీ లెందుకురో రన్నా
మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో పెట్టిండ్రోరన్నా”
అని ఒక గాయకుడు తన పాట ద్వారా పోలీసులను ప్రశ్నించాడు.
నేను పుట్టకముందే ఎప్పుడో, అదే గాయకుడు “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడ్కో నైజాముసర్కరోడ” అని నిజాం నవాబ్ ను ప్రశ్నించాడు.
“వందనమో వందనమమ్మ నా చెల్లే స్వర్ణమ్మ” అని ఒక అమరురాలైన చెల్లెను, “మాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమైపోతివో అన్నో యాదన్న” అని పోలీస్ ఎన్కౌంటర్ లో అమరుడైన ఒక అన్నను స్మరించుకున్నాడు.
“మీరే జన్మకు మళ్ళీ పడతారో మా బిడ్డలు, మిమ్ముల ఏ జన్మల మళ్ళీ చూస్తామో మా కూనలు” అని పోలీసు ఎదురుకాల్పుల్లో చనిపోయిన తమ బిడ్డల గురించి తల్లి తండ్రుల వేదనను వర్ణించాడు ఆ కవి.
ఇలా మానవ జీవితంలోని ప్రతి బాధను వర్ణించాడు, వివరించాడు. దోపిడికి వ్యతిరేకంగా గొంతుక విప్పాలని పేద ప్రజల గొంతైనాడు. ఒక విద్యార్దికి సామాజిక గురువై అతనికి సమాజ స్పృహ కల్పించాడు. ఒక కంపెనీ కూలికి అతడికే తెలియని అతని గొప్పతనాన్ని తెలియచేశాడు, ” కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ ,కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ ” అంటూ ఒక మహిళను అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించాడు.
ఇవన్నీ చేసింది ఒక వాగ్గేయకారుడు. జననాట్య మండలి యొక్క డప్పుల చప్పుడైన మహా కళాకారుడు. పాట రచించి, గుండెకు హద్దుకునే బాణీలు కట్టి, పేద ప్రజల జీవిత మలుపులను, కష్టాలను, బాధలను,బరువులను అర్థవంతమైన అతని నాట్య భంగిమల ద్వారా జనం పాటను జనానికి చేర్చిన ప్రజా గాయకుడు, ఒకప్పటి పీపుల్స్ వార్ సానుభూతి పరుడు, కోట్లాది ప్రజల గుండె చప్పుడైన ప్రజా గాయకుడు గద్దర్.
పాటను ఆయుధంగా, తన జన నాట్యాన్ని మెరిసే మెరుపుగా, కాళ్ళకు గజ్జెలు , చేతిలో కర్ర, అమర జీవుల చిహ్నంగా ఎర్రటి బట్ట, వంటిమీద గొంగళి తో ఉరిమే వురుముగా , దోపిడి దొరలకు అధికార దుర్వినియోగం చేసే కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా నక్సలైట్ సైన్యాన్ని, రాడికల్ విద్యార్థులను తయారు చేసే ఒక మానవ యంత్రం ఆగిపోయింది. నాట్యం చేసి చేసి ఆ శరీరం అలిసిపోయింది. ప్రజల కోసం పాటను పడిన ఆ గొంతు మూగపోయింది. దేశానికి పట్టు కొమ్మ అయిన పల్లెల తో మమేకమై సాగింది అతని జీవితం. కొంత జీవితం అడవుల్లో ఆవిరైపోయింది.పల్లెకు సంబంధించిన కవితా వస్తువులైన, ఆకలి, పేదరికం, బాధలు, ముళ్లు కర్ర, కొట్టం, కట్లపాము, చెరువు, గొడ్లు, అమాయకత్వం, రాజకీయ చైతన్యం, తంగేడు పూలు, కనుమరుగైన వృత్తులు, వలస పోవటం చేత నిర్మానుష్యంగా కనిపిస్తున్న వూరు మొత్తంగా చితికి ఛిద్రమైన గ్రామీణ వ్యవస్థను తన పాటలలో చూపించాడు.
“అడవి తల్లికి దండా లో ” అంటూ అడవిని , అడవి యొక్క సంపదను వర్ణించిన గద్దర్, అదే రీతిలో నక్సలైట్ చెల్లి స్వర్ణ ను “అడవి తల్లి ఎట్లా ముద్దాడిందో, అడవి అన్నలు ఎట్లా స్వాగతం పలికారో” అన్న విషయాన్ని కవితాత్మకంగా వివరించిన పాట అతని మొత్తం పాటలలో కెళ్ళ అత్యంత జనాదరణ పొందింది.
నేను చదువుకునే సమయం లో వరంగల్ పట్టణంలో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం తీవ్రంగా వుండేది. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల పక్షాన వుండటం చేతనో, నిరుద్యోగం చేతనో, లేక కొంత మంది భూస్వాముల దౌర్జన్యానికి వ్యతరేకంగానో, దనవంతులు ఇంకా దనవంతులుగా పేదలు ఇంకా పేదవారిగా మారటం చేతనో, ముఖ్యంగా పైన చెప్పిన సామాజిక రుగ్మతలను వివరిస్తూ , వుర్రూతలూగించే బాణిలతో గద్దర్ పాటలతోనో, మొత్తానికి నాకు తెలిసి, ప్రజలందరూ ఏదో ఒక విధంగా నక్సలైట్లకు సానుభూతి చూపేవారు. అటువంటివారిలో నేనూ ఒకణ్ణి. వరంగల్ లో ప్రజలు పోలీసులను చూస్తే భయంతో వణికిపోయేవాళ్ళు. సెకండ్ షో సినిమాకు పోవాలంటే ఒక యుద్ధం చేసినట్టే. రోజూ వార్తా పత్రిక చూస్తే మందుపాతరలు, ఎన్కౌంటర్లు. అంతటి నిర్భందం లో, పోలీసుల కు వ్యతిరేకంగా వుండే గద్దర్ పాటలంటే యువకులకు ఆకర్షణ వుండేది.
నాకు స్వయంగా పరిచయం లేకున్నా, నేను ప్రస్తుతం వుంటుంది అమెరికా దేశంలో నైనా, గద్దర్ మరణ వార్త నన్ను తీవ్రంగా బాధ పెడుతోంది. ఈ వార్త నిజంగానే నాకు ఒక ఉప్పెన లాంటిది. దారిలో ఉన్న ప్రతి ప్రాణిని, వస్తువును దానిలో కలుపుకొని పోవడమే ఉప్పెన నైజం కదా అని ఆలోచిస్తే, అట్లా అనుకోలేకపోతున్నా. జబ్బు రావటం,మరణించడం సహజంగా జరిగే పరిణామాలే కదా అని అనుకుంటే సహజత్వం తో సరిపెట్టుకోలేకపోతున్నా.
ఇప్పటి సమాజంలో యువతకు సామాజిక స్పృహ లేకపోవటానికి గద్దర్ పాటలు లేకపోవటం కూడా ఒక కారణం. అతని పాటలు,పాటలలోని. భావాలు, ఆ పాటలు వివరించే సమస్యలు నిజంగా యువకులను, ఆలోచింపచేసేవి. వాటిల్లో కొన్ని నిజాలు అయినా, ఇంకొన్ని నిజాలు కాకపోయినా కనీసం ఆ సమస్యలు ప్రజల ముందుకు చర్చకు వచ్చేవి. తద్వారా పౌరసమాజానికి అవగాహన పేంపొందేది.
నక్సలైట్లు చేస్తున్న హింసను చాలామంది వ్యతిరేకించే వారు కూడా. కానీ పీపుల్స్ వార్ వున్నప్పుడు రాజకీయ నాయకుల అవినీతి ఇప్పుడున్నంతగా వుండేది కాదు. భూ కబ్జాలనే మాట కూడా వినిపించేది కాదు. వడ్డీ వ్యాపారులపై , సారా వ్యాపారులపై కొన్ని నియంత్రనలు వుండేవి. మత పిచ్చి ఇప్పటిలా లేదు. అందుకే హింసను సమర్థించని వారు కూడా మానసికంగా నక్సలిజం పట్ల సానుభూతి వ్యక్తపరిచేవారు.
ఇవన్నీ ప్రజలకు గద్దర్ పాట రూపం లోనే ముఖ్యంగా అందేది. అందుకే సమాజాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు వ్యక్తుల్లో గద్దర్ ఒకరు అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ తన ” ఇండియా ఆఫ్టర్ గాంధీ” అనే పుస్తకం లో ప్రస్తావిస్తారు. మిగితా ఇద్దరు ఎన్టీ రామారావు, పి.వి నరసింహ రావు అని రచయిత పేర్కొంటారంటే, సమాజం పై గద్దర్ ప్రభావం మనం అర్దం చేసుకోగలం.
కులమతాల పేరు మీద మణిపూర్ మారణహోమం, హర్యానా లో అల్లర్లూ, మత విద్వేషాలూ, విచ్చలవిడి గా కొనసాగుతున్న రాజకీయ దోపిడి, సమాజం పట్ల ఎవ్వరికీ బాధ్యత లేని తనం, అన్నీ చూస్తుంటే అసలు ఇప్పటి రాజకీయ నాయకులకు, తన చివరి శ్వాస వదిలే వరకు తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ, అదీ తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాలు చేసిన గద్దర్ లాంటి వ్యక్తులకు పోలిక వుందా? గద్దర్ ది ధన్యమైన జీవితం.
లాల్ సలాం గద్దర్. లక్షల మందికి సామాజిక స్పృహ కల్గించిన నీ పాటకు, ఆటకు లాల్ సలాం.
మనిషికి మరణం సహజం, కానీ మహానుభావుల మరణాలను సహజత్వంతో సరిపెట్టుకొలేము. అందుకే కళాకారునికి, అందులో ప్రజా గాయకునికి మరణం వుండదు.” మీ పాటనై వాస్తున్నానమ్మో మా అన్నాలార ” అని అప్పుడే గద్దర్ చెప్పలేదా? ప్రజల గుండె చప్పుడు గద్దర్ . అది ఆగిపోదు. ప్రజల గొంతు గద్దర్, అది మూగపోదు.
శరత్ చంద్ర వేముగంటి
New York, USA
Talented and compassionate, a true inspiration as a social worker and singer