తిరుప్పావై మరో కోణం
‘‘ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదనే ప్రశ్న వస్తుంది. పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థ. అంటే స్వరూపం, గుణం, దయ మొదలైనవి నిండుగా కలిగినది అనవచ్చు.
పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||
మరి ఏమిటా పూర్ణం? ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది. “పూర్ణమిదమ్”- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియలేదు కదా!. “పూర్ణ మదః”- అదః అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. దీన్నికూడా గుర్తించటం కష్టం. ఈ పూర్ణం ఏం చేస్తుంది? “పూర్ణాత్ పూర్ణముదచ్యతే”- ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి, స్తితి, లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది. అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. “పూర్ణస్య పూర్ణమాదాయ” ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే విభవములు అనీ అవతరాలు అనీ అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా! మనం ఇప్పుడు చూడలేము కదా, ఎలాగా? “పూర్ణమేవా వశిష్యతే”- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక సంపూర్ణవిశ్వాసం ఏర్పడాలి. ఈ స్వరూపాలన్నన్నింటినీ గోదా మాత ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం’’ అనిజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. ఆ విగ్రహం అర్చా స్వరూప నారాయణుడు. అది కృష్ణ స్వరూపం అని విశ్వసించి సంశయాలు వదిలి, అది కృష్ణతత్వమని గ్రహిస్తే పిలిచితే పలికే దైవం అని అర్థమవుతుంది. ఈ గుర్తింపు లేకపోతే, ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా ప్రయోజనం లేదు. అహంకారం నశించి ఆ విజ్ఞానం ఉదయిస్తే ఇల్లే తపోవన మవుతుంది. అటువంటి జీవనమే తపస్సు అవుతుందని వివరిస్తూ నాలుగో పాశురంలో గోద భగవంతుని స్థానం. అంతర్యామిత్వమని జీయర్ స్వామి వివరించారు
చిన్న జీయర్ వివరణ లేకుండా మనం తిరుప్పావైని అర్థం చేసుకోవడం కష్టం. వారి వివరణ: మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. …మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది. భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవలసిన సంగతి. భగవంతుడు మనను అనుగ్రహిస్తే మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి, మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్దం కూడా నిర్వీర్యం కావాలంటే – భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది భగవత్సేవ–భగవానునికోసమే చేస్తునాను అనే భావన మనకు ఉంటే చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలికితే చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ ప్రబోధించారు.