ఇంటి నివేశన స్థలాలు లేని పట్టణ పేదలకు మహాఘనత వహించిన ప్రభుత్వం వారు వాటిని ఇవ్వదలిచారు. మొదట రెండు సెంట్లు (ఒక సెంటు 48 చదరపు గజాలు) ఇద్దాం అనుకున్నారు. తరువాత “పంచ పాండవులు మంచం కోళ్ళు” సామెతలా ఒక సెంటుకు నికరం చేసారు. ఒక మైక్రో కుటుంబం అంటే 5గురు అని లెక్క. ఇల్లు అంటే, మంచం పట్టే గది వుండాలి, అందరికి కనీసం ఒక మరుగు దొడ్డి వుండాలి. ఒక వంట గది వుండి తీరాలి. అంటే లోపలకి పంపడానికి ఒకటి, బయటకు వదలడానికి మరొకటి. ఈ రెండింటికి మధ్య “పునరుత్పత్తి”కి ముచ్చటగా మూడు అగ్గిపెట్టి గదులు మనిషికి చాలని ఏలిన వారు అనుకున్నారు. అనకాపల్లి జిల్లాలో “సెంటు పట్టా” అనేది ఇప్పుడు ఒక పాప్యులర్ మాటగా స్థిరపడింది.
Also read: ఉపాధి హామీ పధకoలో కేంద్ర తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు చేయాలి!
ఈ రోజు, అనగా 2023, ఏప్రిల్ 21 మధ్యానం రెండు గంటలకు ఒక ఫోను. ఈరుగుల శంకర్రావు నుండి. శoకర్రావు మధ్యవయస్స్కుడైన దళిత యువకుడు. ఆయన గ్రామం సంపతిపురం. ప్రభుత్వం వారు తమ వద్ద ‘సేకరించిన’ భూమిలో తమకు ఇస్తామన్న వాటా సంగతి తేల్చకుండా ‘సెంటు పట్టాలు’ ఇచ్చేయడం, నిర్మాణాలకు పునాదులు తవ్వేయడం జరుగుతుందని ఇప్పుడు తాము ఏమి చెయ్యాలన్నది తన ప్రశ్న.
పట్టణ పేదలకు ‘సెంటు పట్టా’ అనే ఇళ్ళ స్థలం ఇవ్వడానికి ప్రభుత్వానికి భూమి కావాలి. మామూలుగా అయితే కొత్త భూసేకరణ చట్టం ద్వారా పెద్ద వారి భూములు తీసుకోవచ్చు. పెద్ద వారికి ఇబ్బందికలగకూడదు. పేద వారికి మేలు జరగాలి. అదెలా సాధ్యం? మీ మనస్సు ఎరిగి మీకు తగిన సలహాలు ఇచ్చే అధికారుల బృందం ఒకటి ఎప్పుడు ‘సదా మీ సేవలో’ సిద్ధంగా వుంటుంది. అలాంటి ఒకానొక సలహాతో రంగం మీదకు వచ్చింది G.O.Ms. no: 72, MA & UD (M) Department Dated : 25-01-2020.
ఈ GO ప్రకారం అవిభాజిత విశాఖపట్నం జిల్లాలో పేదలకు ఇచ్చిన D-పట్టా భుములు, అనగా బంజరు భూమికి గాను ఇచ్చిన పట్టా భూమి, ఈ GO కింద తీసుకుంటారు. దీనినే “లేండ్ పూలింగ్” అన్నారు. ఒక D పట్టాదారు తన భూమిని శ్రీ ప్రభుత్వం వారికి అప్పగిస్తే, అందుకు వారు ‘ఎర్రని ఏగాణి’ ఇవ్వరు. మీరు భూమి ఇస్తే, అందుకు ప్రతిగా 18 సెంట్లు (864 చదరపు గజాలు) భూమిని అభివృద్ధి చేసి, వ్యవసాయేతర భూమిగా తామే మార్చి, రిజిస్టర్ చేసి సదరు పట్టా కాగితాలు చేతిలో పెడతారు. ఆ భూమిని ‘జిరాయితీ’ భూమిగా మీ ఇష్టంవచ్చినట్లు చేసుకోవచ్చు.
D-ఫారం పట్టా భూమి రెండు ఎకరాలు వుంటే మాత్రం ఎందుకు? అది అమ్మకూడదు, కోన గూడదు. కొంటే ఆరు నెలలు జైలు శిక్ష, రెండు వేల రూపాయలు జరిమానా. అంటే “డబ్బులిచ్చి దరిద్రం” కొనుకున్నట్లు. కనుక ఇది ‘మీకు భలే మంచి చవక బేరము’ అన్నారు అధికారులు. మా మీద మీకు నమ్మకం లేకపోతె, “లేండ్ పూలింగ్ ధ్రువపత్రం” అనే కాగితం ఒకటి RDO సంతకంతో ఇస్తామని చెప్పారు. RDO అంటే MRO అనే గోచి కంటే పెద్ద, కలెక్టర్ అనే పంచె కంటే చిన్నది అన్నమాట. జనం నమ్మారు. నమ్మక వారికి మరో దారి లేదు. “కొండతో గొర్రె ఎక్కడ పోరాడుతుందని” ముక్తాయించే వారు ఎప్పుడూ పక్కలో సిద్దంగా వుంటారు.
Also read: దండోరా రిపోర్టు చెప్పిన భూసంస్కరణల కథాకమామీషూ
అనకాపల్లి జిల్లాలో సంపతిపురం, వేటజంగాలపాలెం, కుంచంగి, కూండ్రం, సీతానగరం అనేక గ్రామాలలో దళితులు, ఇతర పేద వర్గాలకు ఇచ్చిన D పట్టా భూములను తీసుకున్నారు. ఏడాదికి ఏంతో కొంత ఆదాయం వచ్చే జీడి మామిడి తోటలను JCBలతో లాగేస్తూ వుంటే, గుడ్ల నీరు కక్కుకుంటూ చూస్తూ నిలబడిపోయారు. ఇది జరిగి నాలుగు (4) ఏళ్ళు కావస్తుంది. ‘లేండ్ పూలింగ్’ అయ్యింది కాని ‘లేండ్ ఏలాట్మెంట్’ కాలేదు. ఎవరికీ కాలేదు?! ఈ భూములు ఇచ్చిన వారికి కాలేదు.
నాలుగేళ్ల కిందట ఇంటి ఇంటికి తిరిగి బతిమాలడి, బామాడి, అర చేతిలో స్వర్గం చూపించి భుములు సేకరించిన అప్పటి అధికారులు, ఉత్తమ సేవా పతకాలు పొంది, ప్రమోషన్ లు కొట్టి బదిలిమీద వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలిన వారికి “సెంటు పట్టాల” పంపిణి మీద వున్న ధ్యాస, 18 సెంట్లు మీద లేదు. వచ్చేది ఎన్నికలు. దాంతో సేకరించిని D-పట్టా భూములలో లే అవుట్ లు వేస్తున్నారు. లబ్దిదారులను తీసుకు వచ్చి స్థలాలు అప్పగిస్తున్నారు. మరి ! ఎకరా ఇస్తే మీకు 18 సెంట్లు జిరాయితీ హక్కులతో, రిజిస్టర్ చేసి మరీ ఇస్తామన్నారే? వారి సంగతి?
మహారాజశ్రీ ఏలినవారు ఏరు దాటిపోయారు. D-పట్టాదారులు బోడి మల్లయ్యలైనారు. భుములు ఇచ్చిన D-పట్టా పేదలు తాశీల్దార్ కచేరికి, మహరాజశ్రి జిల్లా కలెక్టర్ వారి ‘స్పందన’ అనే కచేరికి సోమవారాం, సోమవారం గుడికి పోయినట్లుగా, RDO సంతకం, రాజముద్రతో వున్న లేండ్ పూలింగ్ ద్రవపత్రాలు చేతపట్టుకొని పోతున్నారు. కిరాణ దుకాణంలో “అరువు రేపు” అన్న బోర్డు ఉన్నట్లుగానే ప్రభుత్వ కార్యాలయాలవద్ద ‘రేపు’ అనే కనిపించని బోర్డు ఒకటి వుంది. ఇలా నాలుగేళ్ళు గడిచిపోయాయి. నాలుగేళ్ళలో ఒక్కొక్క D-పట్టాదారుకు ఎంత లేదన్న నాలుగు జతలు పెరాగాన్ చెప్పులు అరిగి వుంటాయి. అంతకు పెచ్చేగాని తగ్గదు.
ఈ రోజు సంపతిపురo, తమ్మయ్య పేట గ్రామాల పేదల నుండి సేకరించిన D-పట్టా భుములలో నిర్మాణాలు మొదలు అయినాయి. భూబాధితుల కడుపు రగిలింది. అందరూ వెళ్లి మా సంగతి తేలివరకు ‘సెంటు పట్టా’ ముట్టుకోవడానికి వీలులేదన్నారు.
Also read: అజయ్ కల్లం చేతులమీదుగా సంపత్ పురంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ఎం జరిగి ఉంటుందో ఊహించoడి. రెవిన్యూ అధికారులు హుటా హుటిన వచ్చి మీకు GO ప్రకారం ఇవ్వవలసిన ఎకరా బాపతుకు 18 సెంట్లు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారని అనుకుంటున్నారా?! ఓరి వెర్రి పీరుల్లారా! ఇది ఇండియారా బాబు ఇండియా. రాజ్ కపూర్, నర్గిస్ ల శ్రీ 420 చూసారా?!
హుటాహుటిన వచ్చింది పోలీసులు. అడ్డుకున్నారా అడ్రాస్ లేకుండా పోతారని ‘ఘాట్టి’ వార్నింగ్ ఇచ్చిపోయారు. ఇప్పుడు ప్రతి సచివాలయంలో ఒక గ్రామ పోలీసు వున్నారు. వారికి ఈ ‘అరాచకపు’ ‘ప్రగతి నోరోధక’ ‘చట్ట వ్యతిరేక’గాల్ల పై ఒకటి కాదు రెండు కళ్ళు వేసి వుండమని చెప్పిపోయారు. అన్నట్లు మొన్ననే, అనగా ఎప్రిల్ 14న సంపతిపురం గ్రామంలో మాజీ విశాఖ జిల్లా కలెక్టర్, మాజీ చీప్ సేక్రటరి శ్రీ అజయ్ కల్లం IAS చేతుల మీదుగా Dr. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆ దళితవాడలో అంబేద్కర్ విగ్రహం వుంది. ఆయన చేతిలో ‘రాజ్యంగo’ అనే పుస్తకం కూడా వుంది. కాని సంపతిపురం దళితుల చేతిలో నేడు భుమిలేదు. నాలుగేళ్ల కిందటి వరకు ఏంతోకొంత ఆదరువుగా వున్న జీడి మామిడి తోటలు లేవు. సంపతిపురoలో అంబేద్కరుడు విగ్రహంగా వున్నాడు, తెరవడానికి వీలులేని పుస్తకంగా ఆయన చేతిలో రాజ్యాంగం వుంది.
Also read: అంతటివాడు చెప్పినా పరిష్కారానికి నోచుకోసి సమస్య
PS అజయ్ కుమార్
జాతీయ కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం