Sunday, December 22, 2024

ఎవరు చరిత్ర హీనులు-4?

  • రైతుల భూములతో చెలగాటం ఆడుతున్న తహసీల్దార్ కథ
  • క్వారీ యజమానుల ఎత్తుగడలు, రైతులకు అన్యాయం
  • ప్రభుత్వమే నిజం నిగ్గు తేల్చాలి

‘‘మా భూముల్లో క్వారీ బ్లాస్టింగ్ రాళ్లు పడుతున్నాయి, క్వారీని తొలగించండి’’ అని తహశీల్దార్ ని అడిగితే… తహసీల్దార్ ఏకంగా రైతుల భూములనే రికార్డుల్లోంచి  తొలగించారు … ఎందుకు ఇలా జరిగింది అని పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం క్షేత్ర స్థాయిలో విచారించగా నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి  06 ఆగస్టు 2021, 23 ఆగస్టు 2021 తేదీలలో  క్షేత్ర స్థాయి విచారణలో పాలుగొన్నవారు: పీయూసీఎల్  సీనియర్ నాయకులు విఠల్ రావు (లాయర్) ,  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల, వైస్ ప్రెసిడెంట్ ఇక్బాల్ ఖాన్,  హైద్రాబాద్ ట్విన్ సిటీ సెక్రెటరీ సైయద్ సలీం,  దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, పీయూసీఎల్  స్టేట్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ మానువాడ విజయ్, ఉస్మాన్.

Also read: చరిత్ర హీనులు ఎవరు?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మండలంలోని నాంపల్లి గ్రామంలో కొంత మంది బహుజనులకు అనగా మాదిగ కులస్తులు(18 మంది), మాల కులస్తులు(3), చాకలి కులస్తులు(4), గౌఢ కులస్తులు (1), దూదేకుల(5), వడ్డెర కులస్తులు (6), ముదిరాజ్ కులస్తులు (3), ఎరుకల కులస్తులు (1), కమ్మరి కులస్తులు (1), ఆరె కులస్తులు (1), తుర్క కాశీ (3), మంగలి (3)  ఉన్నారు. ఇలా 49 కుటుంబాల వారికి 130 ఎకరాల భూమిని సర్వే నంబర్లు 378, 379, 380, 381,383, 391,404 లలో  1992 లో ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చింది.  వీరికి భూమిని పంపిణి చేసినప్పుడు వ్యవసాయ యోగ్యముగా లేనటువంటి భూమి, సీలింగ్ కింద వెలమ దొరలదగ్గెర నుండి అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నాంపల్లిలోని 49 కుటుంబాల వారికి అట్టి భూమిని పంపిణి చేశారు. 49 కుటుంబాలు కష్టపడి భూమిని చదును చేసుకొని పంటలు పండించుకొని బ్రతకటం నేర్చుకున్నారు. ప్రమాదకరమైన జంతువులనుండి వారిని వారు కాపాడుకుంటూ పంటను కాపాడుకొని ఒక జీవనాధారంగా ఆ భూములను భావిస్తున్నారు. 130 ఎకరాలలో సుమారుగా 90 ఎకరాలను ఉమ్మడి వ్యవసాయంగా 49 కుటుంబాల సభ్యులు సాగు చేసుకుంటున్నారు.

Also read: ఎవరు చరిత్ర హీనులు?

ఇతర భూముల యజమానులు ఎవరు?

వెంకట రాజేశ్వర్ జగపతి రావ్, గౌరినేని వెంకటేశ్వర్ రావ్ గారలకు చెందిన భూములను ప్రభుత్వం సీలింగ్ కింద 130 ఎకరాలు స్వాధీనం చేసుకున్నది. మొత్తం 260 ఎకరాల భూమి సర్వే నంబర్లు 378, 379, 380, 381,383, 391,404 లలో ఉన్నది. అందులో నుండి 49 బహుజన కుటుంబాలకు 130 ఎకరాలు కేటాయించారు.

నిరుపేద రైతులు (Representative photo)

అధికారుల పనితీరు ఎలా ఉన్నది అంటే .. తలనొప్పిగా ఉంది మందు ఇవ్వండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు తలే లేకపోతే నొప్పే ఉండదు కదా అని తలను తీసేసిన డాక్టర్ లా ఉంది. క్వారీల యజమానులు  బ్లాస్టింగ్లు చేయటం వల్ల తాము వ్యవసాయం చేసుకోలేక పోతున్నాం అని 49 కుటుంబాల సభ్యులు అధికారులను కలిశారు. అధికారులకు తరచూ బ్లాస్టింగ్ రాళ్లు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి అని, వ్యవసాయ భూముల్లో రాళ్లు, పొడి పడి వ్యవసాయం చేయడం ఇబ్బంది అవుతుంది అని రాతపూర్వకంగా మొర పెట్టుకున్నారు. తహసీల్దార్ కు మొర పెట్టుకుంటే, ఆ తహసీల్దార్ ఏకంగా 130 ఎకరాల పేదల వ్యవసాయ భూమిని రెవెన్యూ రికార్డుల్లోంచి తొలగించారు.

Also read: ఎవరు చరిత్ర హీనులు?

పూర్తి వివరాలు:

1) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం నాంపల్లి గ్రామానికి చెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం 30 మార్చి 1992 నాడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దాదాపు 49 పేద కుటంబాలకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి ఉన్నది.

2) కులాలవారిగా చూసుకుంటే ఇందులో మాదిగ కులస్తులు (18 మంది), మాల కులస్తులు (3), చాకలి కులస్తులు (4), గౌడ కులస్తులు (1), దూదేకుల(5), వడ్డెర కులస్తులు (6), ముదిరాజ్ కులస్తులు (3), ఎరుకల కులస్తులు (1), కమ్మరి కులస్తులు (1), ఆరె కులస్తులు (1), తుర్క కాశీ (3), మంగలి (3)  ఉన్నారు.

3) వరుసగా సర్వే నంబర్ 378, 379, 380, 381,383, 391,404 లలో భూమిని కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో సగం భూమి పట్టా భూమి, మిగిలిన సగం ప్రభుత్వ భూమి. ఈ భూములు ఎక్కువగా గుట్టలు, రాళ్లతో నిండి ఉన్నాయి. వ్యవసాయ యోగ్యంగా లేని భూమి. అయినప్పటికిని 49 కుటుంబాలకు జీవనోపాధి ఈ భూములే. 

4) భూమి పట్టాలు ఇచ్చిన రోజు నుంచీ భూమిని చదును చేసుకుని నాంపల్లి గ్రామ పేద కుటుంబాలు ఉమ్మడిగా  వ్యవసాయం చేసుకుంటున్నాయి.

5) 2005వ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి వచ్చిన CLDP ఫండ్  సహకారంతో రాళ్లుగా ఉన్నభూమిని ఇంకా మంచిగా  చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.

6) ప్రభుత్వం ఇచ్చిన ఈ సర్వే నంబరు భూముల్లో సగం భూమి పట్టా భూమి సగం భూమి ప్రభుత్వ భూమి కాగా పట్టా భూమి యజమానులు 2003 లో క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి 20 ఎకరాలకు అనుమతి తీసుకున్నారు.

7) క్వారీ ఏర్పాటుకు అనుమతి తీసుకున్న సర్వే నంబర్లు 381(7 ఎకరాల విస్తీర్ణంలో), 391/2 (4 ఎకరాల విస్తీర్ణంలో).

8) ఈ క్వారీ యజమానులు స్టోన్ క్రషర్ ఎక్విప్మెంట్ ని( మెషినరీ) తమ పట్టా భూములు అయిన సర్వే నంబర్లు 404, 391 లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టోన్ క్రషర్ మరియు క్వారీ కలిపి మొత్తం 20 ఎకరాలు మించదు.

9) అయితే ఈ క్వారీ ఏర్పడ్డ రోజు నుంచి రైతుల వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురు అయ్యాయి.

10) ఈ క్వారీ యజమానులు మెల్లగా రైతులు చేసుకుంటున్న  వ్యవసాయం భూమిని కబ్జా చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ నియమాల ప్రకారం స్టోన్ క్రషర్ చుట్టూ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ప్రకారం ప్లానిటేషన్ చేయవలసి ఉంటుంది. దీని కొరకు క్వారీ యజమానులు CLDP ఫండ్ కింద రైతులు చదును చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసి అందులో నీలగిరి చెట్లు పెట్టారు. క్వారీ యజమానుల అక్రమ ఆక్రమాన్ని రైతులు వ్యతిరేకించారు.  దీనిపై రైతులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు నంబరు 90964, 08అక్టోబర్ 2012. కానీ కలెక్టర్ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. క్వారీ యజమానులకు ఇంకా బలం ఎక్కువయ్యింది.  

11) క్వారీ యజమానులు రోజు రోజుకీ రైతులు సాగు చేసుకుంటున్న భూమిని మరింత కబ్జా చేయడం మొదలు పెట్టారు.

12) క్వారీని తొలగించమని రైతులు మైనింగ్ డిపార్ట్మెంట్ AD కి తేదీ 05 జనవరి 2013 నాడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో క్వారీ నుంచీ, క్వారీ యజమానుల నుంచీ తాము ఎదుర్కుంటున్న సమస్యలు తెలిపారు. క్వారీని తొలగించమని మైనింగ్ డిపార్ట్మెంట్ కి లెటర్ ఇవ్వడాన్ని క్వారీ యజమానులు తీవ్రంగా పరిగణించారు.

13) క్వారీ యజమానులు అధికారులను గుప్పిట పెట్టుకున్నారు.  తేదీ 01 అక్టోబర్ 2015 నాడు తహసీల్దార్ ఆఫీస్ నుంచి నాంపల్లి గ్రామ రైతులకు నోటీస్ లు వచ్చాయి.  ఆ నోటీస్ లో ఇలా రాసి ఉంది “భూమిని మీకు అసైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకూ మీరు వ్యవసాయం చేయడం లేదు.  ప్రభుత్వం జీవనోపాధి కోసం ఇచ్చిన భూమిని క్వారీ యజమానులకు మీరు వ్యాపార ఉద్దేశంతో లీజుకు ఇచ్చారు. ఇది అసైన్మెంట్ రూల్స్ కి విరుద్ధం. కావున ఈ భూమిని ప్రభుత్వం తన ఆధీనంలోకి ఎందుకు తీసుకోకూడదు అన్నదానిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వగలరు.” …  ఈ నోటీస్ 378, 379, 380, 381,383, 391,404 సర్వే నంబర్లలో భూములు అలాట్ అయిన అందరు రైతులకూ వచ్చింది.

క్వారీ పనులు జరుగుతున్న చిత్రం

14) నోటీస్ చూసిన రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు.  ఒకవైపు క్వారీని తొలగించాలని తాము పోరాడుతూ ఉంటే రెవెన్యూ అధికారులు ఈ రకంగా తమకు నోటీస్ పంపడం ఏంటి అని తహసీల్దార్ ని ప్రశ్నించారు. మోఖ పైకి వచ్చి విచారించమని రైతులు తహసీల్దార్ ను అడిగినారు.  అయినప్పటికీ తహసీల్దార్ తేదీ 05 డిసెంబర్ 2015 నాడు భూములు గవర్నమెంట్ కస్టడీకి  ‘రెస్యూమ్’ ఎందుకు చేయకూడదు అని మరొక నోటిస్ ఇచ్చాడు.

15) తహసీల్దార్ చర్యను వ్యతిరేకిస్తూ రైతులు ఎన్నిసార్లు ప్రభుత్వ అదుకారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావట్లేదు. కలెక్టర్ దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యుడు 15 రోజులలో సమస్యను పరిష్కరిస్తామనియు, 49 కుటుంబాల సభ్యులకు భూమిపై హక్కులు కలిపిస్తానని 12 ఆగస్టు 2021 నాడు 49 కుటుంబాల రైతులకు వాగ్దానం చేశారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Also read: ఆ ఆరుగురు …..

ఇవిగో సాక్ష్యాలు!

తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు కుట్రపూరితమైనవి అని తెలుపుటకు సాక్ష్యాలు:

1) ఈ స్టోన్ క్రషర్, క్వారీ కలిపి మొత్తం 20 ఎకరాలు మించదు. ఒకవేళ రైతులు వ్యాపార ఉద్దేశంతో క్వారీకి భూమి ఇచ్చారు అనుకుంటే ఒక రైతుకు 3 ఎకరాలు లెక్కబెట్టుకుంటే ఏడుగురు రైతులు మాత్రమే అసైన్మెంట్ రూల్స్ ఉల్లఘించినట్లు లెక్క. కానీ ఒకేసారి 49 మంది  భూమి పట్టాలు ఎందుకు రెస్యూమ్ (తిరిగి స్వాధీనం చేసుకోవడం) చేస్తాను అంటున్నారు? రైతుకు 3 ఎకరాల వంతున ఏడుగురు రైతులకూ కలిసి 21 ఎకరాలు.

2) క్రషర్, క్వారీ ఉన్నది కేవలం 381,391,404 సర్వే నంబర్లలో మాత్రమే. అలాంటప్పుడు క్రషర్ కి భూమి ఇచ్చారు అని 378, 379, 380,383 సర్వే నంబర్లలో ఉన్న రైతులకు ఎందుకు నోటీసులు వచ్చాయి?

3) వాస్తవానికి 378, 379, 380, 381,383, 391,404 సర్వే నంబర్లు సబ్ డివిషన్ మ్యాప్ లు కాలేదు (ధరణి వెబ్సైట్ ప్రకారం). ఇందులో సగం భూమి పట్టా భూమి కాగా మిగిలిన సగం పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూమి. ఉదాహరణకు 381 సర్వే నంబరులో 47 ఎకరాల 23 గుంటలు ఉంటే 381/1 లో 23ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి మరియు 381/2 లో 23 ఎకరాల 31 గుంటల పట్టా భూమి ఉంటుంది. అయితే 381 మ్యాప్ డివైడ్ కాలేదు కాబట్టి 381/1, 381/2 ఈ రెండు బిట్టులలో ఏ బిట్టులో క్రషర్ ఉంది అని లొకేషన్ చూసి చెప్పడం కష్టం. మరి అలాంటప్పుడు 381/1 లొనే క్రషర్ ఉంది అని తహసీల్దార్ నిర్ధారించి ఎలా నోటీస్ ఇవ్వగలిగాడు?

4) ఈ భూములపై రైతులు క్రాప్ లోన్ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన CLDP ఫండ్ తో రాళ్లుగా ఉన్నభూమిని చదును చేసుకున్నారు. అయినప్పటికీ భూమి అలాట్ అయిన రోజు నుంచి ఒక్కసారి కూడా రైతులు వ్యవసాయం చేయలేదు అని తహసీల్దార్ ఎలా నిర్ధారించారు?  నోటీస్ ఎలా  ఇవ్వగలిగాడు..?

Also read: నడుస్తున్న కథ

దీని వెనుక ఎవరున్నారు?

రైతుల భూములు రెస్యూమ్ చేయడం వలన ఎవరికి లాభం?  దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు?

1). సర్వే నంబర్లు 378, 379, 380, 381,383, 391,404 లలో దాదాపు 260 ఎకరాల భూమి ఉంది. ఇందులో 130 ఎకరాలు పట్టా భూమి కాగా మిగతా 130 ఎకరాల వరకూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమి. 1993 సంవత్సర పహానీ ప్రకారం 130 ఎకరాల పట్టా భూమి వెంకట రాజేశ్వర జగపతి రావు S/o శ్రీనివాస రావు పేరు మీద ఉంది. ఇదంతా గుట్టలతో నిండిన భూమి. ఈ భూమి చేతులు మారుతూ ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం కింది వ్యక్తుల పేర్ల మీదికి వచ్చింది.

1. దూపల్లి మల్లికార్జునరావు (రిటైర్ట్ డీఆర్ఓ), కుటుంబసభ్యులూ- 25ఎకరాల 32 గుంటలు.

2. ఏనుగు మనోహర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు- 11 ఎకరాల 70.5 గుంటలు.

3. ద్యావనపల్లి జయశ్రీ, ఆమె కుంటుంబం- 27 ఎకరాల 43 కుంటలు

4. యాచమనేని చంద్రమోహన్ రావు, కిరణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు – 68 ఎకరాల 81 గుంటలు.

పై వ్యక్తుల్లో ఏనుగు మనోహర్ రెడ్డి అనే టీఆర్ఎస్  నాయకుడు తప్ప మిగతా వాళ్ళు  క్రషర్ యజమానులుగా ఉన్నారు. నియమ, నిబంధనలు పాటించడం లేదని తేదీ 05 ఆగస్టు 2020 నాటికి క్రషర్ లను ప్రభుత్వం మూసివేయించడం జరిగింది.

మొత్తానికి కొందరు భూ కబ్జాదారులు, స్థానిక రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు అంతా కలిసి పేద రైతుల భూమి కొట్టేశారు. ఇందులో ఎవరెవరి వాటా ఎంత, అసలు మొత్తం భూమి విషయంలో ఏం జరిగింది అని ప్రభుత్వం విచారణ చేసి లెక్క తీయవచ్చు. ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదు?

క్షేత్ర స్థాయిలో పర్యటన సందర్భంగా కలిగిన అనుమానాలు

1) తహసీల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు, అందుకే ‘భూములను రెస్యూమ్’ కు రికమెండ్ చేస్తాను అంటున్నారు. సాగు చేస్తున్న  రైతులకు ఎందుకు కొత్త పాస్ బుక్కులు ఇవ్వకుండా తొక్కి పెట్టారు?

2) రైతుల భూముల్లో రెండు వైకుంఠథామాలు, ఒక డంపింగ్ యార్డ్  ఎందుకు కట్టారు?  జీవనోపాధి కింద రైతులకు ఇచ్చిన భూములు ఇవి. వైకుంఠథామాలను, డంపింగ్ యార్డులను ఎందుకు తొలగించలేక పోతున్నారు? వీటిని  వేరే చోటుకి తరలించే అవకాశం ఉన్నప్పటికినీ రైతులను ఎందుకు వేధిస్తున్నట్లు?

3).’రైతుల భూములను రెస్యూమ్’ కోసం సిఫార్సు చేస్తామన్న తహసీల్దార్, ఆ రైతుల భూముల్లోనే జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల కింద 4 ఎకరాల భూమిని ఎలా కేటాయిస్తున్నారు?  మరియు జర్నలిస్టులకు  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా  కట్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది? రైతులకు జీవనోపాధి కింద ఇచ్చిన భూములను ఎలా ప్రభుత్వం లాక్కుంటుంది?  .

4)ఎవరికోసం, దేనికోసం రెవెన్యూ అధికారులు  అధికార దుర్వినియోగానికి పాలుపడుతున్నట్లు?  రైతులకే సూటిగా వారి “కోరికలు” ఏమిటో అధికారులు చెప్పవచ్చుగా? అధికారుల అవినీతిని వార్తల రూపంలో రాయకుండా 4 ఎకరాల భూమిని జర్నలిస్టులకు ఇవ్వటం, క్వారీ యజమానులతో చేతులు కలపటం అవినీతిని పెంచటమే కదా!? ఈ చర్యలు అధికారులకు అవసరమా? విజిలెన్స్ అధికారులు ఎందుకు తహసీల్దార్ పైన నిఘా పెట్టలేకపోయారు? రెవెన్యూ  అధికారుల ఆస్తులపై ఎందుకు విచారించ కూడదు?

5). 49 కుటుంబాలకు భూ సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎందుకు కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వకూడదు?

ప్రభుత్వం ఈ కింది విధంగా ఎందుకు ఉండకూడదు …

1. రెవెన్యూ అధికారుల తప్పును సరి చేసేటందుకు 3 ఎకరాల స్కిం ను కొత్తగా ప్రభుత్వం ఇక్కడ అమలు చేయవచ్చు, క్వారీ యజమానుల ఆగడాలకు చెక్ పెట్టవచ్చు . జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ల రూపంలో ఇస్తున్న లంచానికి ‘చట్ట బద్ధత’ కలిపించుకోవచ్చు.

2.  “నిరంతరం మేసే మేకల లాంటి అధికారుల కోసం, క్వారీ యజమానుల కోసం”   రైతుల రెక్కలను నరికిన వేములవాడ రెవెన్యూ అధికారులు అనే అపవాదు చరిత్రలో లేకుండా చూసుకోవచ్చు.

Also read: ఆనందం … ?

-జయ వింధ్యాల, అడ్వకేట్  & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

(పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. మొబైల్ :  9440430263)  

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles