వాహనదారులు విధిగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేనిపక్షంలో గట్టి చర్యలే ఉంటాయట. ఆ సర్టిఫికెట్ లేని వాహనాలను, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్.సి.) స్వాధీనం చేసుకుంటారు. వాహనాల తనిఖీ సమయంలో పీయూసీ లేకపోతే దానిని పొందేందుకు వారం రోజుల గడువు ఇస్తారు. ఆలోగా తీసుకోకపోతే ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చేలా ముసాయిదా రూపొందించిన కేంద్రం వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది. ఈ నూతన విధానంలో భాగంగా వాహనదారుల వివరాలను మోటార్ వాహనాల డేటాబేస్ కు అనుసంధానించిన సర్వర్లలో పొందుపరుస్తారు. పీయూసీ తీసుకోవడానికి ముందే యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వాహనాల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్ని అన్ని రకాల వాహనాలకూ ఒకే రకమైన సర్టిఫికెట్ ను ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కొత్త సర్టిఫికెట్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వాహన యజమాని, వాహనం వివరాలు, ఆ వాహనం నుంచి విడుదలవుతనన కాలుష్యం పరిమాణం వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ఈ విధానంలో వాహనాల దొంగతనాలను కూడా నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది.