- మార్చి 10 తేదీన జాతకాలు
- ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపైన
- ఎగ్జిట్ పోల్స్ ఏమంటాయో చూడాలి
- ఇంతవరకూ బీజేపీదే హవా అంటున్న మీడియా
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగే చివరి విడత పోలింగ్ తో ఎన్నికల పోరు నేటి (సోమవారం)తో ముగియనుంది. ఈ 10 వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. దానితో అందరి జాతకాలు తేలిపోతాయి. 2024 లో దిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో తెలియకపోయినా, ఆ యా పార్టీలు, అగ్రనేతల బలాబలాలను అంచనా వేయడానికి ఒక ప్రాథమిక రూపం వస్తుంది. కొత్త ఫ్రంట్ ల భాగోతానికి సంబంధించిన కదలికలు కూడా మరో రూపాన్ని తీసుకుంటాయి.
Also read: కొత్త కూటమికోసం కేసీఆర్ సమాలోచనలు
ఈ ఎన్నికల ఫలితాలు కీలకం
అంతే కాదు, జులైలో జరుగనున్న రాష్ట్రపతి ఎంపికపై కూడా ఈ ఫలితాలు ప్రభావాన్ని చూపిస్తాయి. వెరసి, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటిని సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తున్నారు. అందునా, ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకమన్నది జగమెరిగిన సత్యం. అక్కడ మొత్తంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దేశంలోనే అది అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రపతి ఎన్నికలో అక్కడి ఎమ్మెల్యే ఓటు అత్యంత విలువైనది. జనాభా ప్రాతిపదికన ఈ ఓటు విలువ ఉంటుంది. ప్రస్తుతం యూపీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలను కలుపుకుంటే వాటి మొత్తం విలువ 83,824. అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 80 ఉన్నాయి. ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంటుంది. రాష్ట్రపతి ఎంపికలో మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలు కూడా ఎంతో ముఖ్యం.షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ -మే మధ్యలో జనరల్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా బిజెపి ప్రభుత్వం మాటి మాటికీ చాటి చెబుతోంది. ఎన్నికల ఖర్చుఅదుపు, పరిపాలనా సౌలభ్యత మొదలైన అంశాల దృష్ట్యా జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టడమే మంచి నిర్ణయమని ఎక్కువమంది భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ముందస్తుగా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రేపటి ఫలితాలు ఈ నిర్ణయంపైనా ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి ముందుగా 2023లో మరో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. త్రిపుర,మేఘాలయ, నాగాల్యాండ్,కర్ణాటక, ఛత్తీస్ గడ్,మధ్యప్రదేశ్, మిజోరాం,రాజస్థాన్,తెలంగాణ అందులో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ముఖ్యమైన రాష్ట్రాలు కూడా వాటిల్లో ఉన్నాయి. రేపటి ఫలితాలు ఈ ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం దేశ రాజకీయక్రీడనే ఆటాడించే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
Also read: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
అందరూ సర్వం ఒడ్డి పోరాడారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు కొత్తగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చరణ్ జిత్ సింగ్ చన్నీ (పంజాబ్ ) వరకూ.. తమ సర్వశక్తులను ఒడ్డారు. బూత్ ఇంచార్జి నుంచి పార్టీల అధ్యక్షుల వరకూ తమ ప్రతిభాపాటవాలను చాటిచెప్పారు. ఇక ఫలితాలే రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలు, నివేదికలు బిజెపి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఇప్పటి వరకూ బిజెపి అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఆ పార్టీయే తిష్ట వేసే శకునాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి.ఉత్తరప్రదేశ్ లో ప్రధానమైన పోటీ బిజెపి – సమాజ్ వాదీ మధ్యనే ఉంటుందని ఇప్పటికే పలు సంస్థలు తెలిపాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపుఓటములు ఎలా ఉన్నా, సమాజ్ వాదీ పార్టీ ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎక్కువగా వినపడుతున్న మాట. అదే విధంగా, బిజెపి సీట్లు తగ్గుతాయని దాని తాత్పర్యం. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశాలు ఉన్నాయని సర్వేలు ప్రముఖంగా చెబుతున్నాయి. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో బిజెపి- కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని వార్తలు వస్తున్నాయి. గోవాలో బిజెపి హవా కనిపిస్తోంది. మణిపూర్ ఫలితాలపై మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. అక్కడ బిజెపి వైపే మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ తన బలాన్ని చాటుకోవడంలో ఎన్నదగిన పాత్రను పోషిస్తుందని అంచనా వేయాల్సి ఉంటుంది. నేటితో నేటి అసెంబ్లీ ఎన్నికలకు తుదిదశ ముగిసినప్పటికీ, మరోపోరుకు తొలిదశ ఆరంభమైందని భావించాలి.
Also read: ఉక్రెయిన్ కార్చిచ్చులో కర్ణాటక యువకుడి బలి