కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగుతున్న రైతు ఉద్యమం వెనుక రాజకీయ దళారుల ప్రమేయం ఉందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అరోపించారు. మార్కెట్ యార్డులు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయని, అవి నియమించుకునే కమిటీలే పెత్తనం చలాయిస్తూ పంట దిగుబడులను ఇష్టానుసారం కొనుగోలు చేస్తాయని అన్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకు, రైతులకు లాభం చేకూర్చేందుకు కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అన్నారు. రైతులు తమకు నచ్చిన చోట సరకును అమ్ముకునే అవకాశాన్ని కొత్త చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. చట్టానికి లోబడే ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్రం కొత్త నిబంధనలను తెచ్చిందని జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటూ కొత్త చట్టాల కారణంగా రైతులకు మద్దతు ధర రాదన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం పట్టని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వారి కపట ప్రేమను చూపుతున్నాయని అన్నారు.