Saturday, December 21, 2024

ఎన్ని గదులు ఉన్నా …

రాజకీయాల్లో   విలువలు దిగజారేయి  అనీనూ  …. రాజకీయ నాయకులు ఎక్కువమంది  తమ నోటి నించి వచ్చే భాషని  పరమ నీచంగా  — జంకూగొంకూ  లేకుండా  విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనీనూ—  నేనేమీ ఇప్పుడు  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కానీ , గమనించి చూస్తే —  జగన్ చేస్తున్న  కక్ష రాజకీయాలు మాత్రం అన్ని గీతలూ దాటేసాయి  అని  సుస్పష్టంగా తెలుస్తూనే ఉంది . ఈ సంగతిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సైతం అర్ధం చేసుకుంటారనే ఆశిద్దాం!  లేకపోతే మరింతగా నష్టపోయేది వాళ్ళే!

 జగన్  రాజకీయ రంగంలో రాణించదగ్గ పనులు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడిని అకస్మాత్తుగా  ఎన్నికల ముందు  జైలు పాలు చేయడం, కేసు మీద కేసు పెట్టడం  వంటివి జగన్ కి రాజకీయంగా ఏమీ మేలు చేయలేవు.  సందేహం లేదు. నాయుడేమన్నా దేశం వదిలి పారిపోతాడా? బెయిల్ ని అంతగా ఆలస్యం చేసి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కాకపొతే!

రాజకీయాలు బేషుగ్గా చేసి ప్రజలకి మేలు చేస్తే, ఆ వ్యక్తిని అలాగే జనం గుర్తు పెట్టుకుంటారు. రాజకీయాలని కేవలం సొంత  కార్పణ్యాలకి మాత్రమే వాడుకుంటే అప్పుడు  సైతం ఆ వ్యక్తిని  చరిత్ర లో అలాగే  గుర్తు పెట్టుకుంటారు.

నాకు చంద్రబాబు నాయుడు ఏమి  తప్పు చేసాడో సరిగ్గా తెలీదు. అర్ధం కూడా కాలేదు. నాకు అర్ధం అయిన విషయం మాత్రం ఎన్నికల్లో నాయుడిని తిరగకుండా చేస్తే లబ్ది పొందొచ్చును అని గాని జగన్ పార్టీ అనుకుంటే — అది వాళ్ళకే బెడిసి కొడుతుంది అని. అందుకు నాకు సంతోషమే! చంద్రబాబు నాయుడి అరెస్ట్ కారణంగా అయినా జగన్ పాలన ఆంధ్ర రాష్ట్రానికి వదిలితే అది శుభపరిణామమే! 

ఇంతాచేసి అసలు ఆంద్ర రాష్ట్ర భవితకు ఏమీ చేయని జగన్, గుజరాతీ బడా వ్యాపారస్తులకు ఆంధ్రా సంపదని కట్టబెట్టేయడానికి ఏమాత్రమూ వెరవని జగన్ ఎవరికి  ఉపయోగపడుతున్నాడో … ఎందుకని కేంద్రంలో ఉన్న అధికార పార్టీల వాళ్ళు జగన్ కి అండగా ఉన్నారో అంత అర్ధం కాని రహస్యమా  ఎవరికైనా?? ఈ సంగతి  మరి ఆంధ్రా ఓటర్లకి  తెలీదా? తెలిసీ జగన్ కి వాళ్ళు ఇంకొకసారి గనక  ఓటు  వేస్తె,   జగన్ అవినీతి పాలనలో వారంతా ప్రత్యక్షభాగస్వాములుగా మారినట్టే కాదా! అవినీతి ప్రజలకి —  ఒక అవినీతి ముఖ్యమంత్రి  సరి అని కదా అనుకోవాలి ఎవరైనా అప్పుడు.

రాష్ట్రం మీద,  రాష్ట్ర ప్రగతి మీద ఏమాత్రమూ శ్రద్ధ లేకుండా,  కేవలం కులం, ప్రాంతం  ప్రాతిపదికగా రాజకీయాలు నడపడం  చేస్తే అది  ఆ  రాజకీయ నాయకుడి పతనానికి పరాకాష్ట. ఈ దేశంలో ఏ కులానికీ  ఎప్పుడూ మెజారిటీ లేనే లేదు . అలాంటప్పుడు ఏ కులమైనా ఈ తరహా రాజకీయాలు ఎక్కువకాలం నడపలేరు.

నాకు భయం గాని  బాధ గాని ఎక్కడ ఉందంటే … మొత్తంగా అధికార యంత్రాగం  అధికారంలో ఉన్న వాళ్లకి సాయం చేయడానికే గాని ప్రజలకి కాదు అని  ఒక సూచన గనక ఇలాగే బలంగా  కొనసాగితే ప్రజలకి క్రమేపీ అన్ని వ్యవస్థల మీదా నమ్మకం పోతుంది. అది ఎక్కువ ప్రమాదం. ఇవాళ్టి నాయకులు రేపు ఉంటారో ఊడతారో తెలీదు. కానీ వ్యవస్థలు ఉంటాయి.  వ్యవస్థల్ని కాపాడుకోవడం ప్రగతికి అవసరం!  అవ్యవస్థ   సదా అరాచకానికే  అండగా ఉంటుంది. అందుకని వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. లేనప్పుడు అది వట్టి గూండాల రాజ్యంగా మారుతుంది. ఇప్పటికే అలాంటి స్థితి ఆంధ్ర రాష్ట్రంలో  ప్రవేశించింది. అందువలన వ్యవస్థపై ప్రజలకి నమ్మకం నిలబడాలంటే —  ఆ సదరు వ్యవస్థల లోని వ్యక్తులు చట్టాల విషయంలో నిబద్ధత కలిగిన వారై ఉండాలి. అలా ఉన్నప్పుడే పరిపాలన సాగుతుంది. లేకపోతే  కష్టం. అరాచకం తధ్యం!

ఆంధ్ర రాష్ట్రం మరింతగా నష్టపోకుండా ఉండాలంటే  ఆ రాష్ట్ర ప్రజానీకం ముందు చూపుని, వారు తమ ఓటు వేసేటప్పుడు ప్రదర్శించాలి. చివరాఖరికి రాష్ట్రం అన్నది ప్రజలది గానీ,   ముఖ్యమంత్రుల సొంత  శాశ్వత చిరునామా కాదు. ఎంతగా ఊరికో ప్యాలస్ ని కట్టుకున్నా కూడా!!  ఎన్ని వందల గదులు ఉన్నా …. చివరికి పోయేది ఒక చిన్న గదిలోకే  కదా!!

జయప్రభ

7  నవంబర్ , 2023

Jayaprabha Anipindi
Jayaprabha Anipindi
జయప్రభ ప్రఖ్యాత కవి, స్త్రీవాద రచయిత్రి. విమర్శకురాలు. కథలూ, వ్యాసాలూ అనేకం రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles