Sunday, December 22, 2024

విశాఖ ఉక్కు ఉసురు తీస్తున్న రాజకీయ పక్షాల దొంగాట

  • చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏమి చేస్తున్నారు?
  • జగన్ మోహన్ రెడ్డి పరిమితులు అందరికీ తెలిసినవే
  • అందరూ అందరే, కేంద్రానికి విధేయులే

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేపోమాపో ఇది జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎదిరించి పోరాడే శక్తి ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాజకీయపార్టీలో కనిపించడం లేదనే పరిశీలకులు భావిస్తున్నారు. రేపు ఓట్లు పడవనే భయం, ప్రజావ్యతిరేకత వస్తుందేమో అనే అనుమానంతో పార్టీలు కాస్త హడావిడి చేస్తున్నాయి తప్ప, వారి పోరాటంలో చిత్తశుద్ధి లేదనే ఇంటాబయట వినపడుతోంది.

Also read: సంపన్న దేశాలతో సయోధ్య

మొక్కవోనిదీక్షతో కార్మికుల పోరాటం

రాజకీయ వాతావరణం ఇలా ఉండగా, కార్మిక సంఘాలు, ఉద్యమ నేతలు, వివిధ ప్రజాసంఘాలు 500రోజుల పైనుంచీ ఎంతో నిజాయితీ, నిబద్ధతతో పోరాడుతున్నాయి. ఇన్నాళ్లుగా నిరాహారదీక్షలు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా కార్మికలోకం కదం తొక్కుతూనే ఉంది. ఆదివారం, సోమవారం నాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు మిన్నుముట్టాయి. దీనితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం మరోమారు ప్రజల హృదయాలను తాకింది. ఇంకా తాకాల్సింది,సెగ రగలాల్సింది రాజకీయ పార్టీల్లోనే అనే మాటలు బాగా వినపడుతున్నాయి. ఇది పెద్ద ప్రజాఉద్యమంగా మారితే తప్ప ప్రభుత్వాలలో కదలికలు రావన్నది ఎక్కువమంది అభిప్రాయం. త్యాగాల పునాదులపై నిర్మాణమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర తెలిసినవారు కరువవుతున్న కాలంలోకి మనం వచ్చేశామని కొందరు పడే ఆవేదనలో అర్ధముంది. ఇంతకూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడం తప్ప వేరు మార్గాలు లేవా? అని ప్రశ్నించుకుంటే ఎన్నో సమాధానాలు, పరిష్కార మార్గాలు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. నిపుణులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సాక్షాత్తు ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి  నివేదికలను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఒక్క బిజెపి తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏదో ఒక రూపంలో, ఎంతోకొంత స్థాయిలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. కానీ ఆ శక్తి సరిపోవడం లేదు.

Also read: మళ్ళీ కలవరం కలిగిస్తున్న కరోనా

నష్టాలబాట వొట్టిమాట

స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వస్తున్నాయనే మాటలు సత్యదూరాలని  ఉద్యోగ సంఘాలు ఘోషిస్తూనే ఉన్నాయి. గత ఆర్ధిక సంవత్సరం నివేదికల ఆధారంగా చూస్తే ప్లాంట్ లాభాల్లో ఉందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా లాభాలు రావడం ఇదే మొదటిసారి కాదు. విశాఖ ఉక్కు పరిశ్రమ అనేకసార్లు లాభాల పంటలు పండించింది. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి గుర్తురాదా?  గుర్తులేదా? అని వేల కార్మిక గొంతులు ప్రశ్నిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ నిర్మాణం దశలో, ఆరంభంలో ప్రభుత్వం చేసిన వాగ్దానాలు చాలా వరకూ సంపూర్ణంగా ఇంతవరకూ నెరవేరలేదు. ఆ ఊసే ప్రభుత్వానికి పట్టదా అని ఉద్యోగ సంఘాలు, దాతలు, నిర్వాసితులు, త్యాగధనుల కుటుంబాల వారసులు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయని విశాఖలో వేదనాస్వరం పెద్దఎత్తున వినపడుతోంది. స్టీల్ ప్లాంట్ సొంత నిధులతో తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.4 మిలియన్ టన్నులకు పెంచుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొంతగనులు ఉంటే అప్పుడప్పుడు వచ్చే నష్టాలు తగ్గించుకోవచ్చు, లాభాలను పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఒరిస్సా మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 51% వాటాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 4,998 కోట్ల రూపాయలు మాత్రమేనని పద్దుల పుస్తకాలు చెబుతున్నాయి. పన్నులు, డివిడెండ్లు రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 48 వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి చెల్లింపులు జరిగాయని లెక్కలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాంట్ విలువ మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం మరింత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని 18వేల టన్నుల నుంచి 12వేల టన్నులకు కుదించడం కుట్రలో భాగమేనని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బీ ఎఫ్ ను పూర్తిగా మూసివేశారని, బొగ్గు సరఫరా చేయకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయిందని వారు విమర్శిస్తున్నారు. గత సంవత్సరం స్టీల్ ప్లాంట్ కు దాదాపు 835 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. సరిపడా గనులను కేటాయించి ఉంటే? సుమారు 4వేల కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చేవని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

Also read: ‘మహా’సంక్షోభం

కేంద్రానికి భయపడుతున్న రాజకీయ పక్షాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అనేక వనరులు అందుబాటులో ఉన్నాయన్నది సత్యం. రవాణాకు అనుకూలంగా సముద్రం పక్కనే ఉంది. 20వేల టన్నుల ఉత్పత్తికి విస్తరించ గలిగిన భూమి ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్ నిర్మాణమై ఉంది. ప్రపంచంలోని అనేక ప్లాంట్లతో పోటీపడగల శక్తి,సామర్ధ్యాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్నాయని ఎక్కువమంది అభిప్రాయం. “అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది” అన్న చందంగా విశాఖ ఉక్కు పరిస్థితి ఉంది. అధికార పార్టీపై ఒంటికాలుతో లేచే ఈ ప్రతిపక్షాలు స్టీల్ ప్లాంట్ ఉద్యమం విషయంలో పెద్దఎత్తున ముందుకు సాగకపోవడం విషాదమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పదే పదే చెబుతున్నారు. దిల్లీ పెద్దలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేలా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. నిజంగా  వీరి మాటలు నిజమైతే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? ప్రైవేటుపరమైతే  ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున భయపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపించి, ప్లాంట్ ను లాభాల బాటలో నడిపించి, సర్వహితంగా తీర్చిదిద్దినప్పుడే ఒకప్పటి త్యాగాలకు ఫలితం,పరమార్ధం ఉంటాయని ఎక్కువమంది అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.

Also read: నాద యోగ దినోత్సవం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles