- దీపావళికి ముందే రాజకీయ ఠపాసులు
- బీహార్ నుంచి తమిళనాడు వరకూ ఇదే తీరు
దీపావళికి ఇంకా రెండు వారాలపైనే సమయముంది. ఈలోగానే పెద్దపెద్ద శబ్దాలతో వ్యాఖ్యల టపాకాయలు పేలడం మొదలైంది. జరుగుతున్న బీహార్ ఎన్నికల ప్రక్రియ నుంచి, రాబోయే తమిళనాడు ఎన్నికల వరకూ ఇదే తీరు. ఆ రాష్ట్రాల ప్రజల సంగతేమో కానీ, దేశంలోని మిగిలిన రాష్ట్రాలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఒక పక్క తొలి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన సభలలో పరస్పర వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి. కొవిడ్-19 తీవ్రత కాస్త నెమ్మదించిన అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులో మరోసారి మనుస్మృతిని ఆధారంగా చేసుకుని విసికె అధినేత తిరువామవలన్ చేసిన వ్యాఖ్య మహిళా లోకంలో ముఖ్యంగా రాజకీయరంగంలో ఆగ్రహావేశాలకు కారణమైంది.
బీహార్‌లో మోదీ వాగ్బాణాలు
లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలను గుప్పించారు. జంగిల్‌రాజ్‌కు తేజస్వి యువరాజ్ అంటూ చురకలు అంటించారు. నితీశ్ నేతృత్వంలో బీహార్ అభివృద్ది పథంలో పయనిస్తోందని కితాబునిస్తూ, లాలూ హయాంలో జరిగిన అవకతవకలను ఏకరువు పెట్టారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలిస్తామనీ, కుంటుంబానికి ఒక ఉద్యోగం దక్కేలా చూస్తామనేది ప్రధాన హామీ. కరోనా విస్తృతి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయి ఉన్న వారికి ఈ హామీ ఎంత స్వాంతన కలిగిస్తుందో చెప్పలేము కానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. బీహార్‌లో పది లక్షల ఉద్యోగాలు సరే, 2014 ఎన్నికలలో తమరు 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్నారు. దాని సంగతేమిటని ప్రశ్నించారు.
రాహుల్ సభలో హర్షధ్వానాలు
ఉద్యోగాలివ్వడం మాట అటుంచి, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని అన్నప్పుడు రాహుల్ సభలో హర్షధ్వానాలు వినిపించాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రజలనుంచి స్పందన లభించింది. 2015 ఎన్నికలలో ఆర్జేడీతో కలిసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితిశ్ కుమార్ అనంతరం, ఆ పార్టీని విడిచి పెట్టి, బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇదే ఎన్నికల ప్రచారంలో అప్పట్లో బీజేపీ బీహార్‌కు ప్రత్యేకంగా 90వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి కారణం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలైన తరవాత నవ్యాంధ్ర ప్‌్దేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం అనంతరం మొండిచేయి చూపింది. కనీసం ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వలేదు. ఆ క్రమంలో అప్పటి బీజేపీ బీహార్‌కు ప్రకటించిన ప్యాకేజీపై విమర్శలు వెల్లువెత్తాయి.
అప్పుడు బీజేపీని బీహార్ ప్రజలు నమ్మలేదు
అంతచేసినా, బీహార్ ప్రజలు బీజేపీని నమ్మలేదు. ఆర్జేడీ-జేడీ కూటమికే విజయాన్ని కట్టబెట్టారు. కొద్ది నెలల తరవాత నాటకీయంగా ఆర్జేడీ తప్పుకుంది. ఆ క్రమంలో బీజేపీ జేడీయూకి అండగా నిలిచి, అధికారంలో భాగాన్ని పంచుకుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి, ఎన్నికలకు వెడుతున్నాయి. ఈ క్రమంలో లోక్ జన్ శక్తి పార్టీ నేతలు నితీశ్‌పై విమర్శలు సంధించారు. గతంలో మాదిరిగా నితీశ్ ఇప్పుడు బీజేపీకి దెబ్బకొట్టి, ఆర్జేడీ పంచన చేరతారని వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. గూండారాజ్‌గా పేరు తెచ్చుకున్న బీహార్ నితీశ్ కుమార్ హయాంలో కాస్త తీరు మార్చుకుందనీ, అభివృద్ధి పథాన నడించిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే వైపు కాస్త మొగ్గు ఉందనిపించినా.. కరో్నా కష్టాలు పడిన ఓటర్ల మనసు ఎటు మొగ్గుతుందో ఫలితాలొచ్చేదాకా వేచి చూడాల్సిందే కదా!
తమిళనాట మనుస్మృతి వివాదం
తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని అవలంబించే పార్టీలలో అగ్రగామి డిఎంకె.. ఆ పార్టీకి ఎదురు నిలిచింది ఎమ్జీఆర్ తరవాత ఒక్క జయలలిత మాత్రమే. ఇప్పుడు జయలలిత లేరు. ఈ క్రమంలో తమిళనాట మరోసారి అలాంటి తరహా వ్యాఖ్యలు వినిపించాయి. డీఎంకెకు మిత్ర పార్టీ అయిన విసికె అధినేత తిరుమావలన్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మహిళలందరూ వ్యభిచారులేనని మనుస్మృతి పేర్కొందంటూ ఆయన చేసిన వ్యాఖ్య గగ్గోలు రేపింది. బ్రాహ్మణ మహిళలకు కూడా ఈ వ్యాఖ్య వర్తింస్తుందని ఆయన అనడంతో వివాదం మరింత తీవ్ర రూపుదాల్చింది. వెంటనే బీజేపీ నేత ఖుష్బూ సుందర్ రంగంలోకి దిగారు. వెంటనే తిరుమావలన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమావలన్ వ్యాఖ్య వెనుక రానున్న తమిళనాడు ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఉద్దేశం కనిపిస్తో్ంది. తమిళనాడు సాధారణంగానే బ్రాహ్మణ వ్యతిరేకత ఎక్కువ. ఇలాంటి వ్యాఖ్య ద్వారా బ్రాహ్మణేతరుల ఓట్లను రాబట్టాలనేది లక్ష్యం కావచ్చు.
మిత్రపక్షంతో డీఎంకే ఈ వ్యాఖ్య చేయించిందా?
నేరుగా డీఎంకే నేతలే ఇలాంటి వ్యాఖ్యలకు దిగితే..పరిస్థితి దిగజారుతుందని, తమ మిత్ర పార్టీ అయిన విసికె అధినేతతో చేయించి ఉంటారని అంటున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేసి, ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చి లబ్ధి పొందడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఆంధ్ర ప్రదేశ్‌కు ఇలాంటి పోలిక ఒకటి ఉంది. డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా 2009లో ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు ఓటర్లలో భావోద్వేగాలను రగిల్చే వ్యాఖ్యలే చేశారు. ఆ ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు లభించాయి. అవే కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దోహదపడిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో మొదటి దశ ఎన్నికలు జరిగాయి. రెండో దశ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్య ఇలా ఉంది. ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే, తెలంగాణకు రావడానికి వీసా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది….. ఈ వ్యాఖ్య ఆంధ్ర ప్రాంత ఓటర్లలో ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఇప్పుడు డీఎంకే తన మిత్ర పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం ప్రారంభించింది అనుకోవచ్చు. కానీ ఓటర్లు విజ్ఙులు.
మనుస్మృతిలో చాలా అంశాలు ప్రక్షిప్తాలు: అనంతలక్ష్మి
తిరుమావలన్ వ్యాఖ్యపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి స్పందించారు. కలియుగంలో పరాశరస్మృతిని అనుసరించాలన్నారు ఆమె. మనుస్మృతిలో చాలా అంశాలు ప్రక్షిప్తాలు (ఉద్దేశపూర్వకంగా చేర్చినవి) అని ఆమె చెప్పారు. మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం వెనుక వాళ్ళ ఉద్దేశాలు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉన్నాయనీ, మహిళను దేవతగా కొలిచే దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఏ గ్రంథమూ మహిళను తక్కువ చేసి, చూపలేదని స్పష్టంచేశారు. మహిళలు అంటూ బ్రాహ్మణ మహిళలు కూడా అని ప్రత్యేకంగా చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని ఆమె అంటున్నారు.
కాంగ్రెస్ కి రాహుల్ గారే పెద్ద శత్రువు…