రాజకీయాలలో విమర్శకు, తిట్లకు (దుర్భాషలకు) మధ్య సరళరేఖ చెరిగిపోతోంది. పెద్దంతరం,చిన్నంతరం లేదు.ఈ విషయంలో ఒకరిని మించి ఒకరులా తయారవుతున్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.అద్దాల మేడలో కూర్చుని రాళ్లు రువ్వుకుంటున్నారు.`అతని కంటే ఘనుడు(లు)….`అనే రీతిలో చెలరేగిపోతున్నారు.తిట్టగలిగే వారికి రాజకీయంలో కొనసాగే అర్హత అన్నట్లు పరిస్థితి మారింది. తిట్టడం, తిట్టించుకోవడం తప్ప ప్రజాశ్రేయస్సు కోసం నిర్మాణాత్మక సూచనలకు, సలహాలకు కాలం చెల్లిందనిరాజకీయాలలో తలపండి క్రియాశీలకంగా దూరంగా ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలే ఉండకూడదనుకుంటున్న వేళ వాటి సలహాలు, సూచనల ప్రసక్తి ఎక్కడ?అని ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంతాల స్థానంలో రాద్ధాంతాలు తిష్ఠ వేస్తున్నాయని అంటు న్నారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే కల్పిత సంభాషణలు ఉన్నాయంటూ `చింతామణి` నాటక ప్రదర్శనపై నిషేధం విధించిన పాలకులు తెలుగజాతి మనోభావాలను దెబ్బతీస్తున్న `నోటి దురుసురాయుళ్ల`పై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నలు పుట్టుకువస్తున్నాయి.
తిట్ల జడివాన:
తమలపాకుతో ఒకటిస్తే తలుపు చెక్కతో రెండిస్తా అన్నట్లు పరిస్థితి తయారైంది పార్టీల నాయకుల తీరు. సభను నడపవలసిన వారి నుంచి మంత్రులు, సభ్యుల దాకా చేస్తున్న `లకార`, `వకార` ప్రయోగాలు ఎలక్ట్రానిక్,సామాజిక మాధ్యాలలో చక్కెర్లు కొడుతున్నాయి. సభను చట్టసభల కార్యకలాపాలు, బహిరంగ సభలపై ప్రత్యక్ష ప్రసారాలు లేని కాలంలో వక్తల నోట అప్పుడప్పుడు వెలువడే `అసభ్య మాటల`లను `రాయడానికి వీలులేని విధంగా`అని మాధ్యమాలలో వచ్చేది.ఇప్పుటి పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పవలసినపనిలేదు.వర్తమాన పరిస్థితిని ,నాయకుల తీరును బట్టి `ఎందుకూ పనికిరాని వారు రాజకీయాల్లోకి వెళతారు`అనే వ్యంగ్యోక్తిని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
Also Read: కాంగ్రెస్, బీజేపీపై కేసీఆర్ ధ్వజం
తాము పలానా వ్యక్తిని దూషిస్తున్నామనుకుంటున్నారే కానీ రాజ్యాంగపరమైన వారి హోదాను కించపరుస్తున్నామనే సంగతిని విస్మరిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని అంటే అది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతవాసులకు వర్తిస్తుందనే అవగాహన కూడా లేదనిపిస్తోంది.అసభ్యంగా మాట్లాడేవారికి తమ గురించి ప్రజలు ఏమనుకుంటారు?అనే దానిని అటుంచి తమ వైఖరిపట్ల కుటుంబసభ్యుల స్పందన ఏమిటనే ఆలోచనైనా లోపిస్తుందనిపిస్తోంది.
మర్యాదకు మసక:
`మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి`అనే సూక్తి మసకబారుతోంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో `ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి`అని పిలుపునిచ్చి అధికారంలోకి రాగానే గౌరవం కోరుకోవడం వింత పరిణామం.పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించే వారు కూడా అనుచితవ్యాఖ్యలు చేసి,ఆనక క్షమాణలు కోరడం తెలిసిందే.
`ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?`అన్నట్లు అధినాయకులే కట్టుతప్పుతుంటే అనుయాయులను ఏమి తప్పపట్టగలం.ఎదుటి వారిని తిట్టకపోతే తామెక్కడ వెనుకబడి పోతామో అనే భయం వెన్నాడుతుందేమో? రాజకీయ `సభాపర్వం`లో ఒక `వికర్ణుడు` అయినా లేకపోవడం దురదృష్టకరపరిణామం.
Also Read: విరాళాలు వివాదాలు
`వారికి (కాంగ్రెస్, బీజేపీ నాయకులకు) నోటి దురుసు ఎక్కువైంది. హద్దు మీరి మాట్టాడుతున్నారు. నిన్న, ఇవ్వాళ పుట్టు కొచ్చిన నాయకులు ముఖ్యమంత్రి పదవికి, ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికి ఎంత వస్తే అంత హద్దుమీరి మాట్లాడుతున్నారు. మేమూ మాటలను ఉపయోగించవలసి వస్తే ప్రధాన మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా ఎవరిని లెక్కచేయం` అని తెలంగాణ మంత్రి కె.తారక రామారావు తాజాగా సిరిసిల్ల బహిరంగ సభలో అన్నారు. ఆయన ఆవేదన అర్థం చేసుకోదగినదే కానీ ఆయన మాటలు ’తప్పులెన్నువారు..` పద్యాన్ని గుర్తుకు తెస్తోందని, అంతకు ఒక రోజు ముందే నాగార్జున సాగర్ సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాటలు, ప్రఖ్యాత ఇంజనీర్ కె.ఎల్.రావుపై చేసిన వ్యాఖ్యల మాటేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రి మాటలను బట్టి చూస్తే, తమ తరపువారెవ్వరూ ఇంతవరకు పల్లెత్తుమాట అనలేదనిపిస్తోందని, తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ప్రస్తుతకాలం దాకా తమ అధినాయకుడివిమర్శలు, దూషణలను పరిశీలించుకోవాలని విపక్షాలు సూచిస్తున్నాయి. ప్రధానిని ఉద్దేశించి `మోడీ లేడు గీడీ లేడు` అన్న కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
తీసిపోని మహిళామణులు:
దూషణలో కొందరు నాయకురాళ్ల మాటలు పురుషులకు ఎంతమాత్రం తీసిపోవనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం ఎమ్మెల్యే ,సినీనటి రోజాను, తెలుగుదేశం నాయకురాలు, సినీ నటి దివ్యవాణినిఉదాహరణగా చెప్పవచ్చు. అధికారులను ఫోనుల్లో దబాయస్తూ,దుర్భాషలాడడం కూడా మాధ్యమాలలతో వచ్చింది. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడుచంద్రబాబునాయుడుసహా ఆ పార్టీనాయకులపై రోజా దాడిని కొత్తగా చెప్పనవసరంలేదు.ఇక తెదేపా నాయకురాలు దివ్యవాణి నాలుకకు పదును పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి `గొడ్డుమోతోడు`అని చేసిన వ్యాఖ్యను ఎలా తీసుకోవాలి. నరేంద్ర మోదీ లాంటి ప్రధానిని చూడలేదని ఒకప్పడు ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో ప్రశంసించిన నాటి టీడీపీ అధ్యక్షుడు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తారా? లేక అందరికి ఒకే నియమం, ధర్మం అనే రీతిలో చర్యలకు దిగుతారో? కనీసం ఆమెతో బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తారో? దివ్యవాణి వ్యాఖ్యకు ఒక `డాక్టర్` సోదరి సామాజిక మాధ్యమంలో అంతే ఘాటుగా ప్రతిస్పందించడం గమనార్హం.
Also Read: ఎన్నికల్లో కుస్తీ..ఆనక దోస్తీ
ప్రత్యర్థులే…శత్రవులు కారు….
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నట్లు వీరంతా రాజకీ ప్రత్యర్థులే కానీ శత్రువులు కారు. వ్యక్తిత్వ, శీలహననం సరికాదని, పార్టీల భావజాలం, సిద్ధాంతాలు వేరు కావచ్చుకానీ అందరూ గౌరవనీయులు, ఆదరణనీయులేనంటారు.ఎవరు ఎవరిని తూలనాడినా దూషితుల గౌరవం తగ్గుతుందేమో కానీ పడ్డవారికి ఇబ్బంది లేదని సరిపెట్టుకోవలసిన పరిస్థితి.