Sunday, December 22, 2024

దేశమంతటా రాజకీయాలాట!

మరి కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వివిధ పార్టీల్లో ముసలాలు మొదలయ్యాయి. ఇప్పుడప్పుడే ఎన్నికలు లేని రాష్ట్రాల్లోనూ కలవరం, కలకలం మొదలైంది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండుమూడు సంవత్సరాల వ్యవధి వుంది. కానీ  వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే రణతంత్రపు ఎత్తులు చాలా చోట్ల ప్రారంభమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశమంతా ఎన్నికల ఆట మొదలైంది.   శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన తాజా భేటీ జాతీయ స్థాయిలో వేడి పుట్టిస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాల్లోని పరిణామాలు దేశంలోని రాజకీయ ప్రకంపనలను కళ్లముందు నిలబెడుతున్నాయి.

Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

బీజేపీ దూకుడు

గెలుపు ఓటములు ఎట్లా ఉన్నా బిజెపి చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు, చోటామోటా నాయకులను కూడా తక్కువగా చూడడం లేదు. వీలైనంత ఎక్కువమందిని పార్టీ లోకి చేర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది. శిరోమణి అకాళీ దళ్, సమాజ్ వాది పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సి పి ), జెడి(యు) మొదలైన పార్టీలు కూడా శరవేగంగా పావులు కదుపుతున్నాయి. శివసేన తాజాగా బిజెపితో కొత్తపల్లవి ఎత్తుకున్నా, కూటమిలోని పార్టీల పట్ల ఆచితూచి అడుగేస్తోంది. సంక్షేమ పథకాలను బలోపేతం చేస్తూ వైసిపి ఆంధ్రప్రదేశ్ లో తన ఓటుబ్యాంక్ ను మరింత గట్టిగా నిర్మించుకుంటోంది. తెలంగాణలో వలసల పర్వం ప్రారంభమైంది. టీ ఆర్ ఎస్ తో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెడతారని చాలమంది అనుకున్నారు కానీ ఆయన బిజెపిలో చేరి కొత్త మార్గం ఎంచుకున్నారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి కాలుమోపారు. వచ్చే జులై 8 వ తేది వైఎస్సార్ పుట్టినరోజు నాడు సొంతపార్టీని ప్రకటించబోతున్నారు. ఇట్లా అందరూ ఆట మొదలు పెట్టారు. సుదీర్ఘమైన చరిత్ర కలిగి, దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా నిశ్శబ్దంగానే వుంది. ఆ పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పార్టీని ప్రక్షాళన చేసి, కొత్త పుంతలు తొక్కించండంటూ పెద్దఎత్తున శబ్దం చేస్తున్నారు. అయినప్పటికీ, అధినేత్రి సోనియాగాంధీ మౌనముద్ర వీడడం లేదు.

Also read: యూపీలో ఏమి జరుగుతోంది?

మహారాష్ట్రలొ కొత్త ముసలం

మహారాష్ట్రలో కొత్త ముసలం ముదురుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో బంధం తెంచుకున్న శివసేన చిరకాల శత్రువులైన కాంగ్రెస్, ఎన్ సి పీ తో దోస్తానా కట్టింది. ముగ్గురూ కలిసి 2019 నుంచి కాపురం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు 2024లో రానున్నాయి. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే  వీరి బంధం అప్పటి దాకా సాగేట్లు లేదు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరితో కలవకుండా ఒంటరిగానే పోటీ చేసి, మా సత్తా ఏంటో చూపిస్తామంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానో పాటోలే మొన్న బుధవారం నాడు  వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ‘మహా వికాస్ అఘాడి’తో భాగస్వామ్యం ఉండదని పాటోలే అన్న మాటలపై శివసేన మండిపడుతోంది. మెజారిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ఆ నాయకుల అతివిశ్వాసానికి అద్దంపడుతున్నాయంటూ శివసేన తిప్పికొట్టింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఈ మద్య  ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రౌత్ ప్రధానిని ప్రశంసిస్తూ అన్న మాటలు శరద్ పవార్ ను పునరాలోచనలో పడేసినట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే కాంగ్రెస్, ఎన్ సి పి తో కలిసి సాగడం శివసేనకు రాజకీయంగా అవసరమే అయినా, అది సాగుతుందా అనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనూ పెరుగుతున్నాయి. మధ్యంతరంగానో, 2024 ఎన్నికల సమయానికో మళ్ళీ బిజెపి – శివసేన ఏకమయ్యే ఆలోచనలను కూడా కొట్టిపారేయలేమనే వదంతులు వినిపిస్తున్నాయి.

Also read: మోదీతో దీదీ ఢీ!

బీహార్ లో లోక్ జనశక్తి పై పిడుగు

బీహార్ లో లోక్ జనశక్తి పార్టీలో మొదలైన ముసలం వెనకాల సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నారని వినిపిస్తోంది.లోక్ జనశక్తి అధ్యక్షుడు,దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ ను ఒంటరి చేయాలనే కుట్రకు బాబాయ్ పశుపతి నాయకత్వం వహించడంతో ఆట రసకందాయంలో పడింది. ఈ పార్టీలో ఉన్న ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పశుపతి వైపే ఉన్నారు. తనకు వ్యతిరేకంగా చేతులు కలిపిన ఈ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా చిరాగ్ పాశవాన్ లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. పశుపతి కుమార్ వర్గం ఏకంగా చిరాగ్ ను పార్లమెంట్ పార్టీ నేతగా తప్పించింది. అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగిస్తున్నామంటూ ప్రకటించింది. ఇతని స్థానంలో పశుపతి కుమార్ కే అన్ని పగ్గాలు ఇస్తున్నట్లు వీరందరూ తేల్చిచెప్పేశారు. లోక్ సభ సచివాలయం కూడా ఎల్ జె పి సభాపక్ష నేతగా పశుపతిని గుర్తిస్తూ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మొత్తం ఈ పర్వంలో, చిరాగ్ పాశవాన్ ఒంటరయ్యాడు. బిజెపి పెద్దల ఆశీస్సులు పెద్దగా ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న చిరాగ్ పాశవాన్ భవిష్యత్తు ఎటువైపు సాగుతుందో చూడాలి. ఈ ఐదుగురు ఎంపీలు నితీశ్ కుమార్ తో కలిసిపోతే, ఆయన బలం మరింత పెరుగుతుంది. అసెంబ్లీ లో జెడి (యు)కి బలంలేకపోయినా, కేంద్రంలో తన పరపతిని పెంచుకోడానికి నితీశ్ కుమార్ కు ఈ అంశం కలిసి వస్తుంది. నిజం చెప్పాలంటే, బిజెపి – జెడి (యు) బంధం ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేం. ఒకరిపై ఒకరికి నమ్మకాలు లేవు. అనుమానపు కాపురం సాగుతోంది.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

యోగీపై యాగీ

ఇటు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అటు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్పపై వ్యతిరేకత పెరుగుతున్నా రేపటి 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే  వీరిని భరించక తప్పని పరిస్థితిలోనే బిజెపి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. జనసేన నేత పవన్ కల్యాణ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, మంత్రిగా నియమించే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నారనే వదంతులు వినపడుతున్నాయి. ఆ పార్టీని బిజెపిలో విలీనం చెయ్యాలనే ఒత్తిడి పవన్ పై ఎప్పటి నుంచో ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనసేన పార్టీని బిజెపిలోకి విలీనం చెయ్యడానికి, రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడతారా? అన్నది ప్రశ్న. మొత్తంమీద  చాలా రాష్ట్రాల్లో కొత్త సంపర్కాలు, పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు, మిత్రపక్షాల్లో విభేదాలు,కొత్త పార్టీల స్థాపనలతో దేశ రాజకీయ క్షేత్రంలో కలకలం మొదలైంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అప్పటిదాకా ఈ కలవరం కలకలం కొనసాగుతూనే ఉంటాయి.అన్ని పార్టీలు చురుకుగా ముందుకు సాగుతున్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంకా మొద్దు నిద్దరను వదిలించుకోలేదు.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles