న్యూఢిల్లీ: రైతు ఉద్యమాన్ని కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటు న్నాయని, రైతు సంక్షేమానికి గండి కొడుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.రైతులకు అన్నివిధాలా లాభం చేకూరాలని కేంద్రం మూడు కొత్త చట్టాలను తీసుకు వచ్చిందని, అన్ని పార్టీలతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకుందని ఇవాళ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పంజాబ్ కు చెందిన రైతులను పక్కన పెడితే ఈ బిల్లులపై ఎక్కడ వ్యతిరేకత లేదని చెప్పారు. నిజమైన రైతులు ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగానే ఉన్నారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన ఆరేళ్లలో ఎరువుల కోసం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడలేదని, ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ అందించేలా ఏర్పాట్లు చేశారని కిషన్ రెడ్డి వివరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ వింత వైఖరి:
రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వైఖరి వింతగా ఉందని, రైతు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తాను చేస్తున్న అవకతవకలకు కేంద్రాన్ని బాధ్యునిగా చేయాలని చూస్తున్నారని అన్నారు.సన్నబియ్యం సాగు చేయకూడదనడం అందుకు ఉదాహరణ అన్నారు. రైతుల సాగు ప్రోత్సహించి, పంటలను కొనుగోలు చేయవలసింది పోయి నిషేధం విధించడం ఏమిటని ప్రశ్నించారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తున్నారని, అన్నీ కేంద్రమే చేస్తే ఇంక మీరెందుకు? అని ప్రశ్నించారు.