ఇలపావూరి మురళీమోహనరావు నాకు సాక్షి ప్రాంగణంలో పరిచయం. ఆయన సాక్షి టీవీలో గోష్ఠులలో పాల్గొనడానికి వచ్చేవారు. టీవీ స్టుడియోలో కార్యక్రమం పూర్తయిన తర్వాత నా గదికి వచ్చి టీతాగి కబుర్లు చెప్పి వెళ్ళేవారు. ప్రపంచంలో చాలా అంశాలపైన నిశ్చితాభిప్రాయాలు ఉన్న ఆలోచనాపరుడు. అప్పుడప్పుడే రాజకీయ విశ్లేషకుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్న రోజులవి. క్రమంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడుగా, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్ సమర్థకుడుగా, టీడీపీ, బీజేపీకి బద్ధవిరోధిగా పేరు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ ని ఆటపట్టించడంలో ఆయన విన్యాసాలు వింతగా ఉండేవి. చిరునవ్వు చెదరకుండానే ఎదుటివారిని చీల్చిచెండాడే గడుసుతనం ఇలపావూరిది.
రాజకీయ విశ్లేషకుడిగా ఇష్టపడినవారిని ప్రేమించేవారూ, ఇష్టపడనివారిని ఎండగట్టేవారూ ఇలపావూరి మురళీమోహనరావు. ఆయన ఇంత అకస్మాత్తుగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఆయనకు ఏ జబ్బూలేదు. మంచి ఆరోగ్యంగా కనిపించేవారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్టణం బీచ్ లో ఆదివారం అంతా కుటుంబంతో గడిపి సాయంకాలం గుండెపోటు రావడంతో తెల్లవారుజామున మరణించారు. ఒంగోలు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందనీ, ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియలకోసం హైదరాబాద్ కు తీసుకువస్తున్నామనీ ఆయన కుమారుడు ప్రమోద్ మీడియాకు తెలిపారు. ఆయనకు ఇంతకు పూర్వం గుండెకు సంబంధించిన వ్యాధి ఏదీ లేదు. గుండె నొప్పి లేదు. అమాంతంగా మృత్యువు కబళించింది. హైదరాబాద్ లో బడంగ్ పేటలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
ఇలపావూరివారికి అభిమానులు ఎంతమంది ఉన్నారో విమర్శకులు కూడా అంతే మంది ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంత గొప్పగా అభిమానిస్తారో, అంతే ఘాటుగా విమర్శిస్తారు. తెలుగుమీద, స్థానిక, జాతీయ రాజకీయాలపైన, మనిషి స్వభావంపైన గట్టి పట్టున్న రచయిత. శషభిషలు లేవు. డొంకతిరుగుడు తెలియదు. సూటిగా ముక్కుమీద గుద్దినట్టు తాను అనుకున్నది చెప్పడమే ఆయన ప్రత్యేకత. ఆయనకు రాజకీయాలతో పాటు సినిమాలు కొట్టినపిండి. ఆధ్యాత్మికరంగంలోనూ అందెవేసిన చేయి. ఏ విషయమైనా వివరంగా, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు చెప్పగల సమర్థుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నా ఆయనకు చాలా ఇష్టం. విశ్లేషణలు నిస్పాక్షికంగా ఉండవు కానీ వాదన బలంగా వినిపించగల సామర్థ్యం ఆయనది. ఆయన చిట్టచివరి వ్యాసం మర్రి శశిధరరెడ్డిపైన ధ్వజం. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంపైన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రం. తండ్రి చెన్నారెడ్డి అంటే గౌరవమే కానీ శశిధరరెడ్డిని క్షమించలేదు.
వివిధ పత్రికలలో వెయ్యికిపైగా వ్యాసాలదాకా ప్రచురించారు. ఆరు నవలలు రచించారు. 250 దాకా కథలు రాశారు. ఆయనకు కన్నడ భాష వచ్చు. ఆ భాషనుంచి ఇరవై కథల దాకా తెలుగులోకి అనువదించారు. ఆయన మరణం కేసీఆర్ కీ, జగన్ కు నష్టం. ఎన్నికల సమయంలో తమ పార్టీలను ఆకాశానికి ఎత్తడమే కాకుండా ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా తెగడడంలో ఆయన ప్రవీణుడు. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలూ వివరించడంలో ప్రత్యేకమైన నేర్పు సంపాదించారు.
అరవై ఎనిమిదేళ్ళ కిందట ప్రకాశం జిల్లా అద్దంకిలో జన్మించిన మురళీ మోహనరావు అయిదు దశాబ్దాల క్రితం ఉద్యోగంకోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కుటుంబంతో అద్దంకి వెళ్ళారు. ఆదివారం సముద్రతీరానికి వెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి చేరే లోపే ప్రాణం పోయింది.
బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం, పెళ్ళిపుస్తకం సినిమాలకు కథలు రాశారు. ఆ కథలే నవలల రూపంలో ‘హాసం’ పత్రికలో ప్రచురించారు. ఎలుక వచ్చే….ఇల్లు భద్రం’’ అనే పేరుతో రాసిన నవల ఆధారంగా రేలంగి నరసింహారావు ‘ఎలుకా మజాకా’ అనే సినిమా తీశారు. తెలంగాణ ప్రజల శ్రేయోభిలాషి వెళ్ళిపోయారని తెలుసుకొని బాధపడ్డానంటూ ఇలపావూరి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.
వాక్యాలను బాణల వలె సంధించగల ప్రావీణ్యం ఇలపావూరి సొంతం. టీవీ చానళ్ళలో డిబేట్లలో పాల్గొని తన వాదనతో వీక్షకులను ఆకట్టుకునేవారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగించుకొని తన అభిప్రాయాలను ప్రచారం చేసేవారు. సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ పత్రికలకు వ్యాసాలు క్రమం తప్పకుండా రాసేవారు. చమత్కార సంభాషణా ప్రియుడు. మాటలతో కోటలు దాటగల ప్రభావశీలి. ఆయన వాదనను అంగీకరించకపోయినప్పటికీ వాదించే తీరు ఆకట్టుకుంటుంది. బహుముఖ ప్రతిభాశాలి. ఇలపావూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.