Thursday, November 7, 2024

ముమ్మరంగా పోలవరం పనులు-సీఎం జగన్

  • అధికారులను ఆదేశించిన సీఎం జగన్
  • ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్
  • 2022 ఖరీఫ్ నాటికి నీళ్లందించేందుకు ప్రణాళిక
  • రివర్స్ టెండర్లద్వారా ప్రజాధనం ఆదా అయిందన్న సీఎం

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు  కానుకగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం  గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పురోగతిని పరిశీలించేందుకు ప్రాజెక్టును సీఎం జగన్ సందర్శించిన జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2022 ఖరీఫ్ సీజనకు సాగునీరు విడుదల చేసేందుకు సన్నద్ధం కావాలని అధికారులకు ఆదేశించారు.

నిర్వాసితుల తరలింపుకు ఏర్పాట్లు

ప్రాధాన్యక్రమాన్ని బట్టి నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.  మొదట 41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పునరావాస పనులు చేపడతామన్నారు. దీనికోసం సుమారు 3330 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అధికారులు తెలిపారు. మలి దశలో 45.72 మీటర్ల వరకూ నీటి నిల్వ చేరినపుడు ఆమేరకు పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను  సీఎం ఆదేశించారు. వచ్చే మే నెలనాటికి పునరావాస కాలనీలు పూర్తిచేసి నిర్వాసితుల తరలింపుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరును సీఎం జగన్ ఆదేశించారు.

2022 ఖరీఫ్‌ నాటికి సాగునీరు

2021 డిసెంబర్‌కల్లా పోలవరం పనులు పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశం చేశారు. చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించడానికి మిగిలిన రెండు మూడు నెలల సమయం ఎలాగూ పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆలస్యమయితే జూన్‌ నాటికి గోదావరిలో భారీగా నీరు చేరే అవకాశం ఉన్నందున ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయాలన్న సీఎం జగన్ అలా చేయని పక్షంలో 2022 ఖరీఫ్‌ నాటికి సాగునీరు ఇవ్వలేమని అభిప్రాయపడ్డారు.  

గత ప్రభుత్వ నిర్లక్ష్యం

అనుకున్న లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులను వేగిరం చేయాలన్నారు. మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్‌  ఛానల్‌ పనులు సంపూర్ణంగా పూర్తికావాలని అన్నారు. కాఫర్‌ డ్యాంలో ఉన్న ఖాళీలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అప్పుడే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా ముందుకు సాగుతాయని జగన్ అన్నారు. ఆర్‌అండ్‌ ఆర్‌ పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు డ్యాంలు కట్టినా సరే పూర్తిస్థాయిలో నిల్వ చేయలేకపోయామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ఏరోజూ కూడా 3 టీఎంసీలు కూడా నింపలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 240 కోట్ల రూపాయలు వెచ్చించి 10 టీఎంసీల నీటిని నిల్వచేసినట్లు జగన్ తెలిపరు. గండికోట, కండలేరు జలాశయాల విషయంలో కూడా  గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక గండికోటలో 20 టీఎంసీల నీటిని నిల్వచేశామన్నారు. పోలవరంలో కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌కు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నట్లు సీఎం తెలిపారు.

సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ

కాపర్‌ డ్యాం గ్యాప్‌లు మూసివేసే సమయంలో డెల్టాకు సాగునీరు, తాగునీటి కొరత ఎదురు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని  అధికారులను జగన్ ఆదేశించారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఈ పనులు చేయనున్నందున రైతులకు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళిక తయారు చేయాలన్నారు. దీనికి యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి ఇస్తామన్న ఇరిగేషన్‌ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.  డ్యాం నిర్మాణంలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక కమిటీనికూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు  తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులు, పీపీఏ, సీడబ్ల్యూసీకి చెందిన వారు కమిటీలో ఉంటారని తెలిపారు. 2018 నాటి బిల్లులు ఇప్పటికీ పెండింగులో ఉన్నాయన్న సీఎం బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ అధికారులను సూచించారు.

ఇదీ చదవండి: కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు కేంద్రం బ్రేక్

మిల్లీ మీటరు కూడా ఎత్తు తగ్గించం

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని కొన్ని ప్రసార మాధ్యమాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత మాత్రం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించేది లేదన్న సీఎం అలాంటి వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సమీక్షా సమావేశానికి ముఖమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్, సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పి. విశ్వరూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాలకృష్ణలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రితో బుగ్గన, అనిల్ చర్చలు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles