Friday, December 27, 2024

న‌వ్యాంధ్ర‌ వెలుగు దీపం పోలవరం

నీరుకొండ ప్రసాద్ – రాజ‌కీయ విశ్లేష‌కులు

అయిదు కోట్ల ఆంధ్రుల జీవితాల్లో  వెలుగులు నింపే కాంతి పుంజం పోలవరం. ఇంతటి దీపస్తంభo అయిన పోలవరం పై కేంద్రప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరించడం సమర్ధనీయం కాదు. పోలవరం పూర్తి అయితే రాష్ట్ర సాగునీటి రంగం ముఖచిత్రమే మారుతుంది. నవ్యాంధ్రలో నల్లరాయి కూడా నల్ల రేగడి గా మారనుంది. పోలవరం నిర్మాణం కేవలం హామీ కాదు. చట్టబద్దంగా కల్పించిన హక్కు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టాలను గౌరవించకుండా నిస్సిగ్గుగా విభజన చట్టాన్ని తుంగలో తొక్కితే ఇక పార్లమెంటు ఎందుకు? చట్టం చెయ్యడం ఎందుకు? పోలవరం విషయంలో కేంద్రం చేస్తున్నది మోసం. జరుగుతున్నది ఘోరం. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా ఖర్చు కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చి ఈ విధంగా  పోలవరానికి నిధులు కోత పెట్టడంతో తెలుగు ప్రజల గుండెలు బీడు, ఆశలు మోడు బారాయి.

నదుల అనుసంధానం వాజపేయి స్వప్నం

‘‘పోలవరం నిర్మించి వాజ్ పేయి కలను సాకారం చేసుకొనేలా నదులు అనుసంధానం చేసుకుందాం. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతి కి పని కల్పిస్తాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అడుగడుగునా అండ గా వుంటుంది. రాష్ట్ర విభజన సమయంలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేసితీరుతాం’’ అని 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు, చేసిన ప్రసంగాలు విని తెలుగు ప్రజలు  తబ్బిబ్బు అయ్యారు. సంబరపడ్డారు. మరి నేడు జరుగుతున్నది ఏమిటి? ఎవరి కోసం ఈ కర్కశ రాజకీయం? చెప్పింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? ప్రజలను భ్ర‌మల్లో ముంచి ఎన్నికల్లో విజయం సాధించి ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను తుంగలో తొక్కడం వంచన కాదా?  రెండేళ్ల పాటు మురిపించి ప్రత్యేక హోదాని ఎగ్గొట్టినట్లే నేడు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు. విభజన  అనంతరం రాష్ట్ర ప్రజల హక్కులకు, ఆకాంక్షలకు కమలనాధులు  వీసమెత్తు  విలువ ఇవ్వలేదు. వారి దగాకు రాష్ట్ర ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. అయిదు కోట్ల ఆంధ్రుల సాగునీటి  దేవాలయం పై  రాక్షస రాజకీయం రాజ్యమేలింది.  రాజకీయాల ఉరవడికి పోలవరం కూడా కొట్టుకు పోయింది.

నిధుల కోత‌పై నోరు మెద‌ప‌ని నేత‌లు

ప్రత్యేక హోదా చట్టంలో లేదని మంగళం పాడిన  కేంద్ర  ప్రభుత్వం ఇప్పుడు చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు  నిధులు కోతపెట్టి ఉరి బిగించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత చట్టబద్దంగా కేంద్ర ప్రభుత్వానిదే. అయినా కుంటి సాకులు చెబుతూ బహుళ ప్రయోజనాలు అందించనున్న బహుళార్ధక సాధక ప్రాజెక్టు  గొంతు కూడా నులుముతున్నదీ కేంద్ర ప్రభుత్వం. ఇంక ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజల ముందుకొస్తారు? పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కోతపెట్టడం చూసిన తెలుగు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఈ మహా పాపంలో ప్రధాన  ముద్దాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. రానున్న రోజుల్లో రాష్ట్రంలో తామే అధికారంలో వస్తామని విర్ర వీగే నేత‌లు నిధులు కోత పై ఎందుకు మాట్లాడరు ? అంతర్వేదిలో రధం కాలితే రచ్చ,రచ్చ చేసిన రాష్ట్ర కమలనాధులు ఎందుకు నోరు మెదపడం లేదు? రాజకీయం తప్ప  రాష్ట్ర ప్రయోజనాలు అక్కరలేదా? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానన్న పవన్  కళ్యాణ్ పోలవరం నిధులకు కోతలు పెట్టినా ఎందుకు  నోరు మేదప లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నప్పుడు ప్రశ్నించాల్సిన భాధ్యత పవన్ కళ్యాణ్ కి లేదా?

జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం బాధ్యత

రాష్ట్ర విభజన  చట్టం సెక్షన్‌ 90(1) మేరకు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సెక్షన్‌ 90 (4) మేరకు పూర్తిగా కేంద్రం నిధులతో ప్రాజెక్టు నిర్మించాలి. పర్యావరణం ఫారెస్టు అనుమతులు కేందం తీసుకురావాలి. నష్ట పరిహారం పునరావాస వ్యయం పూర్తిగా100 శాతం  కేంద్రం భరించాలి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నోట్‌ ప్రకారం 2014 అంచనాలే ప్రామాణికమని చెప్పడం పచ్చిమోసమే కాదు, చట్ట విరుద్ధం కూడా. విభజన చట్టంలో 2014 అంచనాలు అని లేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పేర్కొనడమే కాదు. దాని నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు కూడా కేంద్రం పూర్తిగా భరించాలని స్పష్టంగా వున్నపుడు పార్లమెంటు ఆమోదం పొందిన చట్టాన్ని తుంగలో తొక్కి కేంద్ర మంత్రిమండలి భిన్నంగా ఎలా తీర్మానం చేస్తుంది? అంచనాలతో నిమిత్తం లేకుండా దాని నిర్మాణ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మినహాయింపు చేయదలచితే పార్లమెంటు ఆమోదం లేకుండా కేంద్ర మంత్రివర్గం ఎలా మార్పు చేస్తుంది? .

55వేల కోట్ల అంచ‌నా ఎలా ఆమోదించారు?

 పోలవరం ప్రాజెక్టుకు 2013-14 నాటి ధరల ప్రకారం రూ 20,398,61 కొట్లే ఇస్తామని చెబుతున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన 2019-2020 వార్షిక నివేదికలో మాత్రం దీనికి  2017-18 నాటి ధరల ప్రకారం రూ 55,548,87 కోట్లకు ఎందుకు  ఆమోదం తెలిపినట్లు? ఏడాది తిరగక ముందే మళ్ళీ అంచనాలు మార్చినట్లు కూడా  స్పష్టంగా అర్ధం అవుతున్నా 2013-14 నాటి ధరల ప్రకారమే ఇస్తామని చెప్పడం కేంద్రం తన భాధ్యత నుంచి తప్పుకోవడమే అని అర్ధం అవుతుంది. అపార జలరాశి  కలిగివున్న గోదావరి నది పై నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే  ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్తు, 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించడం ద్వారా 540 గ్రామాలలో 28 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం వుంది. విశాఖకు తాగునీరు, కరువు ప్రాంతం రాయలసీమకు వరం కానుంది  పోలవరం. రాష్ట్ర విభజన జరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేపట్టే సమయంలో తెలంగాణలోని ముంపు మండలాలను ఎపిలో కలపాలని గట్టిగా పట్టు పట్టడంతో ఆ  మేరకు కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసిముంపు మండలాలను ఏపీ లో కలిపింది కేంద్రం. గత ప్రభుత్వ హయాంలోనే రివైజ్డ్‌ అంచనాలు రూపొందించే ప్రక్రియ మొదలైంది.

అంచనాలను ఆమోదించిన కేంద్ర జల సంఘం

ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర జలవనరుల శాఖాధికారులు పెద్ద కసరత్తు చేశారు. టన్నుల కొద్ది పేపర్లు కేంద్రానికి పంపించారు. ఒకవేళ కేంద్ర మంత్రివర్గం 2014 షెడ్యూల్‌ ధరల ప్రకారం చెల్లించాలని తీర్మానం  చేసి వుంటే 2017-18 షెడ్యూల్‌ ధరల  ప్రకారం కేంద్ర జల సంఘానికి చెందిన సాంకేతిక సలహా మండలి 55,548,87  కోట్ల అంచనా ఎందుకు రూపొందించింది అన్న దానికి  సమాధానం  లేదు? 55 వేలకోట్లకు ఆమోదించినట్లు ఎంపీలు పార్లమెంటులో అడిగిన  ప్రశ్నలకు కేంద్రం ఇదే సమాదానం చెప్పింది. అంతేకాదు, తిరిగి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి నియమించిన సవరించిన అంచనా కమిటీ కూడా 47,725.74 కోట్లు అంచనా ఎందుకు రూపొందించింది ? మొదట్లోనే  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంశం ఎందుకు బహిర్గతం చేయ లేదు? ఇదంతా మోసం, దగా కాదా?

గత ప్రభుత్వ  హయాంలోనే 2019లో సాంకేతిక సలహా మండలి రూ. 55,548,87  వేల కోట్లకు ఆమోదం తెలిపి ఇంతకాలం పెండింగ్‌ లో వుంటే కేంద్రంలో జరుగుతున్న కుట్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ఈరోజు గత ప్రభుత్వంపై నెపం నెట్టడమంటే తమ వైఫల్యాన్ని,చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి  తప్ప మరొకటి కాదు.  ఇంతకాలం తాము చేయాల్సింది చెయ్యకుండా రాజకీయ ఆరోపణలు చేసినంత మాత్రానా మీ తప్పులు ఒప్పులు కావు. ఈ రాష్ట్రం ఏమై పోయినా పర్వాలేదు మాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరించడం  సమర్ధనీయం కాదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబునాయుడు కేంద్రాన్ని విమర్శించకుండా మౌనంగా ఉండటంలో అంతరార్థం ఏమిటో తెలియదు. అధికారపార్టీ, ప్రతిపక్షం కలసి కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టుకోవాలి. లేకపోతే ప్రలజను వంచించినట్టే అవుతుంది.

ఎందుకీ గోప్య‌త‌?

మొదట్లోనే 2017-18 ధరల అంచనా ప్రకారం కాకుండా  2013-14  ధరల  అంచనాలనే పరి గణనలోకి తీసుకొంటామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఎందుకు చెప్పలేదు.? ఆర్థిక శాఖకు వెళ్లి వాళ్లు వెల్లడి చేసేంతవరకు ఎందుకు గోప్యంగా వుంచారు? ఈ విధంగా అయితే పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే మరో దశాబ్దానికి పైగా పట్టినా ఆశ్చ‌ర్యం లేదు. దీంతో నిర్మాణ వ్యయం ఇంకెంత పెరుగు తుందో చెప్పలేం. పోలవరం లో జరుగుతున్న తతంగం అంతా గమనిస్తున్నవారికి అర్ధమయ్యేది ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి ఏదైనా రాజకీయ ప్రయోజనం లేనిదే ఏ రాష్ట్రానికి చట్టబద్దత మేరకు కూడా నిధులు, రాయితీలు ఇవ్వరన్నది. ఏది ఏమైనా  విభజన చట్టంలో చట్టబద్దత కల్పించిన  పోలవరం ప్రాజెక్టుకు పంగనామాలు పెట్టడం సమర్ధనీయం కాదు. ఇదంతా గత  ప్రభుత్వ వైఫల్యంగా చెప్పి తప్పించుకొనేందుకు వీలు లేదు. కేంద్రప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండ గట్టకుండా కేవలం తెలుగుదేశాన్ని నిందించితే కేంద్రానికి సాగిలబడినట్లే. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలి.

కనిపించని కుట్రలు

కనిపించని కుట్రలు చేస్తున్న కేంద్రప్రభుత్వాన్ని నిలదీయకుండా చంద్రబాబు ఒప్పందం దెబ్బ తీసిందని చెబితే నమ్మేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. పోలవరం పై కూడా బిజెపి ముసుగు తొలిగింది.  దగా రాజకీయాల ఉరవడికి పోలవరం కూడా కొట్టుకు పోయింది. ఇప్పటికై నా పోలవరం పై దిద్దు బాటు చర్యకు  పూనుకోవాల్సిన భాధ్యత కేంద్రం పై వుంది.విభజన చట్టాన్ని విస్మరించే హక్కు ఎవరికీ లేదని గుర్తించాలి.మాట తప్పని,మడేమ తిప్పని వంశమని పదే,పదేచెప్పుకొనే  జగన్ మోహన్ రెడ్డి పోలవరం విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం  కేంద్రం తో పొరాడి నిధులు సాధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని నిరూపించుకోగలరా ? రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాలకులను ప్రజలు కూడా ప్రశ్నించాలి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles