మహతి, పెరుగు రామకృష్ణ
“టీ టైంమ్ పొయెట్స్” ఓ చిరు కవి సమ్మేళనం. అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. కలిసి టీ తాగుదామన్న నెపంతో వస్తారు. కవితలు మోసుకొస్తారు. కొన్నిసార్లు అక్కడికక్కడే అల్లేస్తారు. కొంతమంది కవులు, ఆశుకవులయితే మరి కొందరు శ్రోతలు, విమర్శకులు అయిపోతారు. అందరూ సరసులే. సహృదయులే. రసవ్యసన పరులే. సరస సాహిత్య గోష్టిలో తేనీరే కాదు, కవితామృతంకుడా పంచుకునే వారే.
Also read:“తెలుగు జబ్బు”
ఈ చిరు కవులు సంఖ్యలో మాత్రమే ‘చిరు’. ముగ్గురో నలుగురో కలుస్తారు. వాసిలో మాత్రం దిగ్గజాలే. ‘మహతి’ అనే కలంపేరుతో రాసే మైడవోలు వెంకట శేష సత్యనారాయణగారు ఆంగ్లంలో రాస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక పత్రికలు వారి కవితలను నిరంతరం ప్రచురిస్తుంటాయి. వారి ఆంగ్లభాషా ప్రావీణ్యం, ఛందస్సుపై పట్టు కాకలు తీరిన వారిని కూడా అబ్బుర పరుస్తుంది. ఎవరికైనా నిఘంటువు పక్కన లేకుండా వారి రచనలు చదవడం కష్టమే. వారి శైలి నారికేళ పాకం. సారూప్యాలు, ప్రతీకలతో నిండిన వారి రచన అందుకున్నవారికి అమృత భాండమే. సంస్కృత ఆంధ్రాల్లో, భారతీయ తత్వ శాస్త్రాల్లో వారి జ్ఞాన సంపద అపారం. సుందరాకాండ ఆధారంగా రాసిన Finding the Mother, దివినుండి భువికి దిగిన Ganges, Krishna వారి ప్రసిద్ధ రచనలు.
మరో ప్రముఖ వ్యక్తి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు. వీరిని అంతర్జాతీయ కవి అంటారు. అనేక సాహిత్య కార్యక్రమాలను స్వయంగా జరిపిస్తుంటారు. కొత్త వారికి చేయూతనిచ్చి ప్రోత్సహిస్తారు. చాల పుస్తకాలను ప్రచురించారు. స్వంత రచనేలే కాకుండా వీరి సంకలనాలు కూడా చాలానే ఉన్నాయి. వీరి రచనలు కొన్ని ఇతర భాషల్లోకి తర్జుమా చేయ బడ్డాయి. తను రాసిన కవితలు అత్యంత మధురంగా చదివి వినిపించడం వీరి ప్రత్యేకత. “ఒక పరిమళ భరిత కాంతిదీపం” లాంటి వారి ఇటీవలి రచనలు భావ పరిపుష్టితో, భాషా పాటవంతో పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.
Also read: “చలం – స్త్రీ”
గత రెండేళ్లుగా ఈ ప్రముఖుల ప్రక్కన చేరిన రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్ చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో ఎక్కువగా కవిత్వం రాస్తాడు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశాడు. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ, భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.
Also read: “రచన లక్ష్యం”
పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు అనేక బహుమతులు పొందిన కథా రచయిత. వీరి కథలు సామాన్యుడి జీవితానికి ప్రతిబింబాలు. అనేక పుస్తకాలుగా వీరి కథలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
డా శ్రీనివాసులు రెడ్డి గారు అనేక విషయాలపై దృష్టి సారించగలిగిన ఆలోచనాపరులు. వీరి కథలకు అనేక సంస్థలు బహుమతులిచ్చాయి.
Also read: “మహమ్మారి”