ఉదయమంటేనే
కవిత్వం నాకు.
రాత్రంతా సతాయించిన
చీకట్లను దులిపి
బాల్కనీలో ఆరేస్తాను.
కవిత్వానికి సమయమూ
ప్రత్యేక సందర్భమూ
ఉంటాయని కాదు.
కనపడని క్షణాల మీద
పాకే చీమలాంటిది కవిత్వం.
జ్వర పీడితుని
కలవరింతలు కవిత్వమే
నుదురు నిమిరి చూడు
స్పర్శ ఉపశమన మంత్రమే.
సంధ్యాకాలం
కవిత్వం కాదని కాదు
పడమటి దిక్కు
చిక్కని మందారాల తోట
రక్త జ్వలన
స్వర రాగిణుల పాట.
కవిత్వం రాయనప్పుడు
కలం ఏ మూలనో దాక్కుంటుంది.
పిలిచినా పలకదు
ఎందుకో దానిలోని సిరా
మరిగి పోతుంది.
టీవిలో కోహ్లీ
సిక్సర్ కొట్టాడు గాని
అది హృదయాన్ని తాక లేదు
కీర్తి క్రికెటర్ల సొంత ఆస్తి కాదు
అది ప్రజలందరి
ఉమ్మడి ఉద్వేగ స్ఫూర్తి.
వైరస్ బాధితులను
ఆదుకోడానికి
ఒక పరుగూ పనికి రాలేదు
గెలుపు కన్న
మానవత్వం పిలుపే ముఖ్యం!
మిత్రుడా!
కరుణను మించిన
కవిత్వం వుంటుందా!
ఎన్నిసార్లయినా అరిచి చెప్తాను
కవి సమయమంటే
కన్నీరు తుడవటమే.
Also read: ఆల్బం
Also read: అడుగులు
Also read: వంటిల్లు
Also read: శైలారోహణ– అమండా గోర్‌మన్
Also read: స్ఫురణ
Also read: స్తబ్ధకోశం
Also read: రైతు భారతం
Also read: అయ్యో!