అనుకున్నప్పుడు
పుట్టేది కాదు కవిత్వం
విశ్వ చక్ర భ్రమణంలో
లయ దెబ్బ తిన్నప్పుడు
ఆ కుదుపు దానికి ఒక ప్రేరణ.
ఈ ఊరిని మరో ఊరికి
తీసి కెళ్లే పక్షిలాగ
ఉడ్డీన కాంక్ష
దానికి రెక్కలు మొలిపిస్తుంది.
మార్పులు ఎదురైనప్పుడల్లా
మనిషి కలవర పడతాడు.
మార్పును అర్థం చేసుకొని
అల్లుక పోవడమే కవిత్వం.
కలం అందంగా వుంటుందా!
రాస్తుంటే
చేతి కదలికలను బట్టి
అక్షరాలను ఊహించగలన్నేను.
అంతర్జ్వలనంలోని
ఉష్ణ భాషే కవిత్వం.
ఏదీ స్థిరంగా వుండదు
ముఖ్యంగా సౌందర్యం!
రూపం మారుతున్నప్పుడల్లా
నిర్వచనం మారుతుంది
మేఘం ఆకాశానికి
చిరునామా కావటమే కవిత్వం.
జీవితం విలువైంది అంటారు
అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు
మరణించ గానే
మర్చిపోవటానికి తొందర పడతారు
ఆ ఖాళీని కొత్త ఊపిరితో నింపాలని ఆరాట పడతారు.
మనిషి స్వార్థంలోని
ఆశ్చర్యమే కవిత్వం.
కోరికలు నిరంతరం పుడతాయి
అవి స్వప్నాలుగానూ మారుతాయి
కాలం దిగంతాల దగ్గర ఆగినట్టుగా అనిపిస్తుంది.
ప్రశ్నార్థకాలకు
జవాబులు వెతకడమే కవిత్వం.
ప్రియతమా!
పోతూ పోతూ
నువ్వు చూసిన చూపే మిగిలింది.
బహుశా అది
కవిత్వం కాక తప్పదు.
Also read: గ్రౌండ్
Also read: బ్రెడ్
Also read: సముద్రం ముద్ర
Also read: సామూహిక
Also read: వలస చేప