ఉదయపు కోడి కూత కవిత
కారడవి చిమ్మ చీకట్లలో
కళ్ళు చించుకున్నా ఏమీ కనిపించని రాత్రిళ్ళలో
తళుక్కున మెరిసే మిణుగురు కవిత..
బహుశా హృదయానికి తెలుసేమో
తనదాకా రక్తాన్ని మోసుకువచ్చి
చెడు రక్తాన్ని శుద్దీకరణకు దారిచూపే
ప్రవాహవేగం కవిత అని..
మీరెవరైనా సముద్రకెరటాల ఉత్సాహ ఘోషలో
ఉద్యమ కవిత్వాన్ని విన్నారా..?
పిడికిళ్ళు బిగుసుకుంటున్నప్పుడో
కళ్ళు కన్నీరు కారుస్తున్నప్పుడో
వైకుంఠ రధం అనాధశవాన్ని మోసుకెళ్తున్నప్పుడో
సైనిక కవాతులో లయబద్దంగా అడుగులు పడుతున్నప్పుడో
నవరసాలొలికే కవిత్వం గమనించారా..?
కవిత్యమంటే పదాల చట్రంలో బిగిసిన
అక్షర కూర్పు కాదు
కవిత్వమంటే ప్రవహిస్తున్న నదినుండి విడివడి
పచ్చని పంట పొలాల్లో పారుతున్న ప్రాణధార
చూరునుండి నిశ్శబ్దంగా జారుతున్న చిట్టి చినుకు..
రాతి నేలల్ని రైతులు దున్నేచోట
శిలలను పగలేసి శ్రామికులు రస్తాలు పరచేచోట
చెమటతడితో విన్పించే మంత్రగానం కవిత
కవిత చప్పట్లు మోత కాదు
కవిత పుస్తకాల దొంతర కాదు
కవిత శాలువల సన్మానం కాదు
కవిత గాయపడ్డ నిస్తబ్ద హృదయానికి సజీవస్పర్శ..!
Also read: ఇనుపచెట్లు
(కవి మొబైల్ఫ 9849230443)