మనం రాసే కవితలు
ఒక పెద్ద ప్రక్రియలోని అస్థిమిత లయలే
ఇప్పుడవి మన సొంతమైనాయి.
మనలోని ఆర్తి
ఒక అయస్కాంతమై
వాటిని తన వైపు లాక్కుంటున్నది
ఆ శక్తి ప్రకాశమే మన కవిత్వం.
ఈ కన్నీళ్లు మనవి కాదు
విశ్వ దుఃఖంలోని
ఒక్కొక్క బొట్టే
సముద్రంగా మారితే
దాని ముందు పట్టిన మన దోసిలి,
అమృతం కురిపిస్తున్న జాబిలి.
లోకంలో
భావాలు లేవని కాదు
వాటి పొరలు విప్పడానికి
కనులు మొలవాలి గదా!
అమూర్తమే కావచ్చు
దాని దృశ్య ప్రాతినిధ్యమే ఒక పద్యం.
మనం వెదజల్లే మాటలు
అపారమైన
శబ్ద సర్వస్వం లోనివే కావచ్చు
రహస్యమంతా పదాల ఎన్నికలోనే
ధాతు సమ్మేళనం లోని
రీతుల ఎరుకే కవిత్వం.
రండి మిత్రులారా!
సూర్యుడే మనకు ఆదర్శం
ఇతరుల కోసం క్షణక్షణం
తనను తాను దగ్ధం చేసుకుంటాడు
బీజం లోంచి
మహా భూజాన్ని సృష్టించే ధీరుడు
మనమూ అంతే!
కాస్తంత కోపాన్ని
కరుణగా మారుస్తాం
కొంచెం ప్రేమతో
ఎండను వెన్నెలగా చల్ల బరుస్తాం
అక్షరాన్ని
ఆశగా నిలబెడతాం.
Also read: వలస చేప
Also read: చక్రం
Also read: అల్పాక్షరముల…
Also read: ముంబయిలో వర్షం
Also read: అంశిక