Sunday, December 22, 2024

జేబులో మహాప్రస్థానం, తిరుపతిలో ఆవిష్కరణ

  • తిరుపతి వీధుల్లో నెమలి వాహనంపై శ్రీశ్రీ చిత్రపటం ఊరేగింపు
  • మహాకవి 111వ జయంతి వత్సరంలో కన్నులు విందు చేసిన వేడుక
  • భూమన కరుణాకరరెడ్డి ఘనకార్యం

మహాకవి శ్రీశ్రీ అంటే మా తరంవారికి మహాప్రేమాభిమానాలు. శ్రీరంగంశ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవితలు కంఠస్థం చేయనివారు మా మిత్రబృందంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. నాకైతే విరసం సభల సందర్భంగా చిరు జల్లు పడుతూ ఉంటే ఖమ్మం వీధులలో శ్రీశ్రీ వెనుకనే ప్లకార్డు పట్టుకొని ఊరేగింపులో నడవడం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. అటూఇటుగా మా తరానికే చెందిన ఇద్దరు ప్రముఖులు తమకు తోచిన, నచ్చిన రీతిలో శ్రీశ్రీకి ఈ సంవత్సరం నివాళులు అర్పించారు. ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇద్దరూ అభినందనీయులే. వందనీయులే.

శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు మహాప్రయత్నం

మొదటి వ్యక్తి విజయవాడ మిత్రుడు విశ్వేశ్వరరావు. శ్రీశ్రీ పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం ఆయన ప్రింటింగ్ ప్రెస్ పేరే మహాకవి పేరు కావడం. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు మహాకవి బృహత్తరమైన గేయసంపుటి మహాప్రస్థానాన్ని విరాడ్రూపంలో ప్రదర్శించాలని తలపోశారు. అద్భుతమైన పెద్దసైజు పుస్తకం తీసుకొని వచ్చారు. హైదరాబాద్ తీసుకొని వచ్చి చాలామందికి ప్రేమగా ఇచ్చారు. నాకూ పంపారు. మెగా పుస్తకం అందుకున్నవారంతా సంతోషించారు. శ్రీశ్రీ కొత్త కాదు. ఆయన గేయాలూ కొత్తకాదు. కానీ కుర్చీలో కూర్చొని రెండు చేతులూ చాచి దర్జాగా పెద్ద అక్షరాలలో ఉన్న మహాప్రస్థానంలోని పద్యాలు పెద్దగా చదువుతుంటే అందొక అనిర్వచనీయమైన అనుభూతి. విశ్వేశ్వరరావు ప్రయత్నాన్ని అభినందించనివారు ఉండరు. ఆయన తెచ్చిన మెగాబుక్ ని తమ లైబ్రరీలో ప్రత్యేక ఆకర్షణగా అలంకరించుకోనివారూ ఉండరు. అదొక పండుగ వాతావరణం తీసుకొని వచ్చిన అరుదైన పుస్తకం. వర్థంతి సందర్భంలో విడుదలై వేడుక చేసింది.

రెండో వ్యక్తి తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి. ఆయనకు రాజకీయాల కంటే సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం. కొన్నేళ్ళుగా తిరుపతిలో సాహిత్య కార్యక్రమాలు ముమ్మరంగా జరగడమే కాదు, నిండు సభలలలో పుస్తకావిష్కరణలూ, సాహిత్యగోష్టులూ జరిగే పట్టణం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తిరుపతి ఒక్కటే. ఇటీవల ఎంవి రమణారెడ్డి ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన సభను చూసి ఆశ్చర్యపోయాను. ఆ సభను స్థానిక శాసనసభ్యుడు ఏర్పాటు చేశారు కనుక అంతమంది వచ్చారని ఎంవీఆర్ కొడుకూ, అల్లుడూ సభాముఖంగా అన్న మాట. అటువంటి కరుణాకరరెడ్డి ఆలోచన ఫలితమే పాకెట్ సైజులో మహాప్రస్థానం. విశ్వేశ్వరరావు ఆలోచనకు పూర్తిగా భిన్నమైన ప్రయోగం. ఇద్దరికీ శ్రీశ్రీ పట్ల ఎనలేని ఆరాధనాభావం ఉందనడంలో ఇసుమంత సందేహం లేదు.

డాక్టర్ వెల్చేరు నారాయణరావు, డాక్టర్ శివారెడ్డి , భూమన, భూమన కరుణాకరరెడ్డి, డాక్టర్ శైలకుమార్, తదితరులు

గురజాడ వర్థంతి సందర్భంగా శ్రీశ్రీకి బ్రహ్మరథం

ఒక పబ్లిషర్ గా, ప్రింటర్ గా విశ్వేశ్వరరావు బ్రహ్మాండమైన గ్రంథం సమాజానికి సమర్పించాలని తలపోస్తే, సాధారణ ప్రజానీకం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకునేందుకు వీలుగా పాకెట్ సైజులో మహాప్రస్థానం ప్రచురించారు. అంతే కాదు, గురజాడ వర్థంతి అయిన మంగళవారం (నవంబర్ 30)నాడు తిరుపతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించి, ఆవిష్కరణ సభ నిర్వహించారు. మహాకవి చిత్రపటాన్ని, మావో రెడ్ బుక్ లా అచ్చేసిన మహాప్రస్థానాన్ని సాహితీవేత్తలు వేడుకగా అలంకరించిన నెమలి వాహనంలో ఘనంగా అంబేడ్కర్ విగ్రహం నుంచి సభాప్రాంగణం వరకూ కవి శివారెడ్డి, కరుణాకరరెడ్డి, తదితరులు భుజాలపై మోస్తూ ఊరేగించారు. అభిమానులు శ్రీశ్రీ గేయాలు ఆలపించారు. శ్రీశ్రీ గేయాలు ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖ ఆచార్యులు డాక్టర్ వెల్చేరు నారాయణరావు ఆ సభకు హాజరైనారు.

మావో రెడ్ బుక్ లాగా, జేబులో పట్టేంత చిన్నదిగా మానవ వికాస వేదిక  అచ్చేసిన మహాప్రస్థానాన్నివేల్చేరు తిరుపతిలో మహాసభలో ఆవిష్కరించారు. సభకు భూమన్ అధ్యక్షత వహించారు.

శ్రీశ్రీ జేబులో పెట్టుకొని ఐదారేళ్ళు తిరిగిన పద్యాలే

‘‘మహాప్రస్థానం పద్యాలు అచ్చుకాకముందు శ్రీశ్రీ వాటిని చేత్తోరాసి జేబులోపెట్టుకొని అయిదారేళ్ళు తిరిగాడు. ఆ పద్యాలు అచ్చుకాకముందు అచ్చు అవసరం లేదని తెలుగుప్రజలు వాటిని రాసి జేబులో పెట్టకుని తిరిగారు. డెబ్బై ఏళ్ళ క్రితమే తెలుగు కవిత్వం జేబులోకి వచ్చేసింది. మంచి కవిత్వం ఇప్పుడు జేబులోపట్టేంత వచ్చేసింది’’ అంటూ శ్రీశ్రీ గొప్పతనాన్ని వెల్చేరు వివరించారు.

శ్రీశ్రీ ఫోటోలు పట్టుకొని తిరుపతి వీధుల్లో ప్రదర్శన చేసిన సాహిత్యాభిమానులు

తెలుగు ప్రపంచ భాష

‘‘శ్రీశ్రీ అమెరికా వెళ్ళినప్పుడు తెలుగులోనే మాట్లాడాడు. అక్కడి రేడియోల్లో, సభల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడాడు. శ్రీశ్రీ కవిత్వం తెలుగులోనేరాశాడు. శ్రీశ్రీ ప్రపంచ భాషలోరాశాడు. శ్రీశ్రీ ప్రపంచ భాషలో  మాట్లాడాడు. తెలుగు ప్రపంచ భాష’’ అంటూ తెలుగు విశిష్టతలను తెలియజేశారు. ‘‘ఇప్పటి పిల్లలకు తెలుగు రావడం లేదు. మహాప్రస్థానాన్ని వారికి వినిపించండి. తెలుగును మరిచిపోకుండా ఉంటారు. వాళ్ళు మళ్ళీ తెలుగులోకి వచ్చేస్తారు. ఇప్పుడు నేను చేసింది మహాప్రస్థానం ఆవిష్కరణ కాదు. మహాప్రస్థానం జేబులో ఉన్నప్పుడే నిజమైన ఆవిష్కరణ’’ అని అన్నారు.

‘‘మహాప్రస్థానం వినదగ్గదే కానీ చదువదగ్గది కాదు. శ్రీశ్రీ అంతటి మహానుభావుడు వినదగ్గంత కవిత్వం రాశాడు. భాష తెలియనివారికి కూడా మహాప్రస్థానం గొప్పదనాన్ని తెలుసుకునేలా చేశాడు. శ్రీశ్రీ ఒక్క తెలుగుభాషకు మాత్రమే  చెందినవాడు కాదు. మొత్తం ప్రపంచానికంతటికీ చెందినవాడు,’’ అని వేల్చేరు నారాయణరావు (90) వ్యాఖ్యానించారు.

జేబులో డైనమైట్

ఈ సభకు  సరస్వతీసమ్మాన్ గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డాక్టర్ శివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ‘‘జీవితానికి సంబంధించిన సత్యాన్ని చెప్పేదే కవిత్వం. కవిత్వానికి మనుషులను మార్చే శక్తి ఉంది’’ అని శివారెడ్డి అన్నారు. మహాప్రస్థానాన్ని జేబులో పెట్టుకొని తిరగడం కాకుండా బిగ్గరగా మహాప్రస్థానంలోని పద్యాలు చదివితే దాని శక్తి తెలుస్తుందని కవి శివారెడ్డి చెప్పారు.

కనీసం మనుషులుగానైనా మిగులుదాం: కరుణాకరరెడ్డి

‘‘మహాప్రస్థానం జేబులో తుపాను కాదు.  ఝంఝామారుతం’’ అని ఉద్ఘాటించారు సభాధ్యక్షుడు, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (కరుణాకరరెడ్డి అగ్రజుడు). ‘‘నేను కొద్దిగానైనామనిషిగా ఉన్నానంటే మహాప్రస్థానమే కారణం. సమాజం ఒక్క రోజులో మారదు. కనీసం మనుషులుగానైనా మిగులుదాం, అందుకనే మహాప్రస్థానం చదువుదాం’’ అని ఉద్బోధించారు తిరుపతి శాసనసభ్యుడు, మానవ వికాస వేదిక అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles