Sunday, December 22, 2024

జమిలి ఎన్నికల జాతరకు జైకొడతారా?

దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి వినిపించారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్బంగా గుజరాత్ లో జరిగిన శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సు దీనికి వేదిక అయ్యింది. ఇది మొదటిసారి కాదు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై మోదీ పట్టుదలగానే ఉన్నారు. 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ జరిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. అప్పుడు 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి.

జమిలి ఎన్నికలకు జైకొట్టిన తెలుగు పార్టీలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు, శాసన సభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా ఖర్చు కలిసివస్తుంది. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా, పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది. తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.

పరిపాలనకు సావకాశం

ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి  సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది. బిజెపి పెద్దలు ప్రతిపాదిస్తున్న ” జమిలి ఎన్నికల” పై కొందరు  అనేక అనుమానాలు, సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ, అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి.

సంకీర్ణ సంకటం

కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపితో సహా కాంగ్రెస్ కు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, బిజెపి చాలా బలంగా ఉంది. ఈ తరుణంలో, జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే  స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ, దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దీని వల్ల, వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.

పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు శ్రీకారం

పరోక్షంగా, అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో అలుముకుంటున్నాయి. ఈ భయాలన్నీ ప్రధానంగా  జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, దాన్ని అనుసరిస్తున్న ప్రాంతీయ పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని కుదించాలి, కొన్నింటికి పొడిగించాలి. ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉందనే చెప్పాలి. తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయింది.ప్రస్తుతం, బిజెపికి ఎదురులేదనే చెప్పాలి.

సమాంతర ఎన్నికలకు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం

“సమాంతర ఎన్నికల”పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది.ఇక్కడ కూడా  బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది. లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది. ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఎల్లవేళలా, అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.

ప్రభుత్వం పడిపోతే?

సంకీర్ణంగా  ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల పడిపోయినప్పుడు, ఎన్నికలు మళ్ళీ  నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా “జమిలి ఎన్నికల” అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు, సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి. మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. “కేవలం ఇది చర్చించే విషయం కాదని, భారత్ కు ఎంతో అవసరం”, అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా  పునరుద్ఘాటించారు.

మాటిమాటికీ ఎన్నికలు అభివృద్ధికి ఆటంకాలు

కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంమీద,నరేంద్రమోదీ మాటలబట్టి, జమిలి ఎన్నికలు తప్పకుండా వచ్చే వాతావరణం కనిపిస్తోంది. అది ఎప్పుడన్నది సమీప భవిష్యత్తులో తేలిపోతుంది. తాజాగా బీహార్ ఎన్నికల గెలుపుతో, మధ్యప్రదేశ్ ఉపఎన్నికలలో విజయం సాధించడంతో  బిజెపి మంచి ఊపులో ఉంది. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా, దేశ ప్రజల మంచికి, దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles