మార్గదర్శక వ్యాఖ్యాత మైనాస్వామి
లేపాక్షి (ఆంధ్ర ప్రదేశ్): మూల విరాట్-ధ్యాన ముద్రలోని సుందర రూపం, శ్రీ వీరభద్ర స్వామి ఉగ్రరూపo- తైలవర్ణచిత్రం, వేలాడే స్తంభం, వటపత్రశాయి, భిక్షాటనమూర్తి అద్భుత శిల్పం… భారత ప్రధాని నరేంద్ర మోదిని మంత్రముగ్ధుడిని చేశాయి. ఈ నెల 16న లేపాక్షి వీరభద్రాలయ సందర్శనకు వచ్చిన మోది విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవానికి ప్రత్యక్ష నిదర్శనగా నిలిచిన లేపాక్షి శిల్ప సంపద-తైల వర్ణచిత్రాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. విజయనగర కాలం నాటి వైభవాన్ని ప్రత్యక్షoగా వీక్షించిన ప్రధాని తన్మయత్వం చెందారు. ప్రధాని ఆలయ సందర్శన సందర్భంగా చరిత్రకారుడు మార్గదర్శక వ్యాఖ్యాతగా వ్యవహరించడం అరుదైన విషయం. దేవాలయ చరిత్ర, తైలవర్ణ చిత్రాలు-శిల్పాల గురించి ప్రధానికి చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు. మైనాస్వామి రాసిన లేపాక్షి పుస్తకం మూడు భాషల్లో వెలువడి సంచలనం సృష్టించింది. మరో రెండు భాషల్లో వెలువరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రత్యేక పూజలు, సంకీర్తనల గానం, తోలుబొమ్మలాట పూర్తయిన తర్వాత ప్రధాని మోది గర్భగుడి ప్రదక్షిణ చేశారు. అనంతరం మహా మండపం పైకప్పు మీద గల 25×14 అడుగుల వీరభద్రస్వామి ఉగ్రరూప తైలవర్ణ చిత్రాన్ని ప్రధాని చూశారు. 10 చేతుల్లో వివిధ ఆయుధాలు, పొడవాటి కత్తి, దక్షయజ్ఞం సందర్భంగా దక్షప్రజాపతి తలను తెగనరకడం వoటి విషయాలను చరిత్రకారుడు మైనాస్వామి ప్రధానికి వివరించారు. మూల విరాట్ 4 చేతులు కలిగి ధ్యానముద్రలో వున్నాడు. తైలవర్ణచిత్రం మాత్రం 10 చేతులతో మహోగ్రరూపంతో భిన్నంగా వుంది. ఆ తేడాను గమనించమని మోదీని కోరగా రెండు రూపాలను తదేకంగా తిలకించారు.
వేలాడేస్తంభం: నాట్యమండపంలోని భారీ స్తంభాలు- శిల్పాలు, పైకప్పుపై గల తైలవర్ణ చిత్రాలను చూసిన ప్రధాని ముగ్దులయ్యారు. నేలను తాకని ఆకాశ స్తంభం దిగువన మైనాస్వామి ఒక పలుచటి వస్త్రాన్ని వుంచగా, ప్రధాని దాన్ని స్వయంగా స్తంభం కింద నుంచి వెలుపలకు లాగారు. వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా గమనించారు.వేలాడే స్తంభం ప్రత్యేకతను అడిగి తెలుసు కొన్నారు. వేలాడే స్తంభం, దాని పక్కనున్న స్తంభం చోళ శిల్పశైలి-మరో 2 పెద్ద స్తంభాలు హొయసల శైలిలో వుండగా, మిగిలిన స్తంభాలన్నీ విజయనగర శైలిలో వున్నాయని చరిత్రకారుడు చెప్పగా ఎంతో ఆసక్తిగా విన్నారు.
Also read: సరికొత్త చరిత్ర రచనకు శ్రీకారం చుట్టాలి, చరిత్ర సదస్సులో వక్తల పిలుపు
వటపత్రశాయి: మహాభారతం-అరణ్యపర్వంలోని కిరాతార్జునీయo, శివ పురాణంలోని గిరిజా కల్యాణం, వీరభద్ర అనుగ్రహం పొందిన ఆలయ నిర్మాత విరూపణ్ణ- ఆయన పరివారం, మార్కండేయ పురాణంలోని వటపత్రశాయి తైలవర్ణ చిత్రాలను పరిశీలించారు. ఆయా గాథలు-వటపత్రశాయి వర్ణచిత్రం గురించి మైనాస్వామి వివరించినప్పుడు బాలకృష్ణుని కన్నులను చిత్రించిన విధానాన్ని మోది మూడు వైపుల నుంచి చూశారు. విజయనగర శిల్పులు-కళాకారుల ప్రతిభా పాటవాలకు ప్రధాని చేతులెత్తి నమస్కరించారు.
భిక్షాటనమూర్తి: నాట్యమండపం ఎడమ వైపునున్న భిక్షాటనమూర్తి సుందర రూపాన్ని తనివి తీరా చూశారు. విజయనగర శిల్ప శైలి-ఇతర శైలి భిక్షాటనమూర్తి విగ్రహాలలో భేదాల గురించి చరిత్రకారుడు చెప్పగా భక్తి శ్రద్ధలతో విన్నారు. నరేంద్రమోది శైవపురాణ క్షేత్రం-కాశి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి పాఠకులకు తెలుసు.
ప్రధాని రాకతో లేపాక్షి ప్రభ నలుదిశల వ్యాపించడమే కాకుండా, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి కూడా దోహదం కాగలదని చరిత్రకారుడు మైనాస్వామి అభిలషించారు.
ఇలావుండగా, వీరభద్ర స్వామి గుడిని పెనుకొండకు చెందిన నంది లక్కిశెట్టి-ముద్దమాంబల సుపుత్రుడు నంది విరూపణ్ణ సామాన్య శకం 1531 లో నిర్మించాడు. విజయనగర సామ్ర్యాజ్య చక్రవర్తి సంబెట అచ్యుత దేవ రాయలు (శ్రీక్రిష్ణ దేవరాయల తమ్ముడు) ఆలయ నిర్మాణానికి అన్నిరకాలుగా సాయపడినట్టు చలివెందుల శాసనం(1531 ఆగస్ట్ 6) చెబుతున్నది. గుడి సముదాయంలో సుమారు 20 శాసనాలున్నాయి. రెండో ప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల ‘తుళు ప్రశస్తి’ శాసనాన్ని మైనాస్వామి ఇటీవల పరిష్కరించారు. ఆ శాసనాన్ని అచ్యుత దేవరాయలు 1533 లో రాయించారు.
కాగా, లేపాక్షి వీరభద్రాలయ సముదాయానికి ‘యునెస్కొ(UNESCO)’ గుర్తింపు కోరుతూ మైనాస్వామి 2022 డిసెంబర్ 14,15 తేదీల్లో జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
Also read: పెనుకొండ, లేపాక్షిలలో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చెయ్యాలి: మైనాస్వామి
(చరిత్రకారుడు మైనాస్వామిని 9502659119 చరవాణిలో సంప్రదించవచ్చు)