- లాక్ డౌన్ లేదని విచ్చలవిడితనం వద్దు
- వాక్సిన్ అందగానే పంపిణీకి ఏర్పాట్లు
మంగళవారం సాయంకాలం 6 గంటలకు జాతి నుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడతారనే సమాచారం బాగా వైరల్ అయ్యింది. కొత్త విషయాలు, భరోసాలు, కానుకలు, ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని మీడియా, సోషల్ మీడియాతో పాటు దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, మామూలుగా ఎప్పుడూ చెప్పే జాగ్రత్తలతోనే ప్రసంగం ముగిసింది. వరుసగా పండుగలు వస్తున్నాయి కాబట్టి కరోనా జాగ్రత్తలు, శుభాకాంక్షలకు సంబంధించి మాత్రమే ఈ ప్రసంగం ఉంటుందని కొందరు ఊహించారు. వారు ఊహించినట్లే ప్రసంగం సాగింది. ఈ తరహా ప్రసంగం ప్రజలకు కొత్తేమీ కాదు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండీ ప్రధాని చేసిన ప్రసంగాలలో ఇది ఏడవది. కరోనా వ్యాక్సిన్ చివరి వ్యక్తికి చేరే దాకా కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.
వాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పాల్సింది
ఇది అభినందించి, హర్షించాల్సిన అంశమే. కానీ, ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా చెప్పిఉంటే బాగుండేది. దేశంలో వ్యాక్సిన్ల పంపిణీ, సరఫరాలపై ఇటీవలే ఒక సమీక్షా సమావేశం జరిగింది. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత త్వరగా అందించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. 2021 ప్రథమార్ధంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. 2020 డిసెంబర్ నుండి 2021 జులై లోపు, పలుదశల్లో పలు వ్యాక్సిన్లు చేతికి అందుతాయనే ఆశలో దేశ ప్రజలు ఉన్నారు. ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ఈ ప్రసంగంలో వ్యాక్సిన్ పంపిణీ, సరఫరాలకు సంబంధించిన అంశాలపై ప్రస్ఫుటంగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశాన్ని ఉటంకిస్తూ, పునరుద్ఘాటన చేసి ఉంటే చాలా బాగుండేది. కరోనా తీరును సామాన్య ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రధాని వంటి వారి నుండి ప్రజలు కోరుకునేది భరసో. స్పష్టమైన సమాచారం, రోడ్ మ్యాప్ వివరించి, ప్రజలకున్న సందిగ్ధతను పటాపంచలు చేయవల్సిన బాధ్యత నేతలదే. వ్యాక్సిన్ల అందుబాటు, సామర్ధ్యంపై గందరగోళం సృష్టిస్తున్నారు.
గందరగోళానికి స్వస్తి చెబుతే బాగుండేది
ఈ గందరగోళాన్ని ప్రధాని బ్రేక్ చేసిఉంటే మరింత బాగుండేది. ఫిబ్రవరి కల్లా దేశ ప్రజల్లో సగం మందికి వైరస్ సోకుతుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ మాటలన్నది ఎవరో కాదు, కరోనా వైరస్ అంచనాలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సభ్యుల్లో ఒకరైన కాన్పూర్ ఐఐటికి చెందిన మణీంద్ర అగర్వాల్. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య 75లక్షలు. ఈ సంఖ్య తప్పని ఈయన అభిప్రాయం. అయితే, సెప్టెంబర్ మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరిన కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు.ఇది శుభ పరిణామం. దేశంలో 30 శాతం ప్రజలు కరోనాబారిన పడ్డారని ఈ కమిటీ అంచనా వేసింది. ఇది వచ్చే ఫిబ్రవరికి 50 శాతం చేరవచ్చని అగర్వాల్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సీరోలాజికల్ సర్వేలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని ఈ కమిటీ అంచనా వేసింది. దేశంలో ప్రతి 10లక్షల మందిలో 5500 మందికి మాత్రమే కరోనా సోకిందని ప్రధాని చెప్పారు.
పొంతన లేని మాటలు
అగర్వాల్ కమిటీ సభ్యులు చెబుతున్న దానికి, ప్రధాని చెబుతున్న మాటలకూ ఏ మాత్రం పోలిక లేదు. ప్రస్తుతం దేశంలో రెండు వేల పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, త్వరలోనే కరోనా పరీక్షలు 10కోట్లు దాటుతాయని మోదీ అంటున్నారు. ప్రస్తుత భారత దేశ జనాభా 139 కోట్లకు మించిపోయింది. దీన్నిబట్టి చూస్తే, సమాంతరంగా పరీక్షలు వేగవంతం చేసి, కరోనా సోకినవారి నిజమైన సంఖ్యను తేల్చుకోవాల్సి వుంది. దేశ ప్రతిష్ఠ దృష్ట్యా కొంత రహస్యం పాటించినా, వైద్య చికిత్స దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా ప్రయాణంలో ఒకటి మాత్రం వాస్తవం. సాధారణ మరణాలు తగ్గాయి. అదే విధంగా మన జనాభా స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే, కరోనా వల్ల నమోదైన మరణాల సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పాలి. దేశంలో చాలామందికి ఈపాటికే కరోనా వచ్చి వెళ్ళిపోయిందంటున్నారు. భారతదేశ ప్రజల జన్యు వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు బహుశా మనల్ని రక్షిస్తున్నాయేమోనని అనుకోవాలి.
లాక్ డౌన్ లు ఇకపై ఉండవు
ప్రధాని మాటల ద్వారా తేలిందేంటంటే లాక్ డౌన్ ముగిసిపోయినట్లేనని భావించాలి. వైరస్ పరీక్షలు సంపూర్ణమై, వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి, కరోనా వైరస్ తుదికంటూ నశించడానికి ఇంకా చాలా సమయం పడుతుందనే సంకేతం ప్రధాని ప్రసంగం ద్వారా అర్ధమవుతోంది. లాక్ డౌన్ నిబంధనలు లేవని, పండుగ రోజులని విచ్చల విడిగా తిరగొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన హెచ్చరికలను శిరసావహించాలి. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా, తీవ్ర విషాదం నింపుతుందని ప్రధాని చేసిన హెచ్చరింపును గౌరవించాలి. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఆరోగ్య జాగ్రత్తలు వహించడం, యోగ, వ్యాయామాలు క్రమం తప్పకుండా చెయ్యడం, శారీరక, మానసిక దృఢత్వం పెంచుకోవడం మొదలైనవి తప్పనిసరిగా పాటించాలి. “సేవా పరమో ధర్మః” మంత్రాన్ని ఆచరణలో చూపిస్తున్న అత్యవసర సిబ్బందిని గౌరవించడం, వారి పట్ల కృతజ్ఞతగా ఉండడం మన విధి, అని ప్రధాని పదే పదే చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుండి సమీప భవిష్యత్తులో ఆశావాహమైన ప్రకటనలు వస్తాయని ఆశిద్దాం.