- భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
- అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లతో కలిసి ఆయన ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అవినీతికి పాల్పడకుండా, స్వచ్ఛమైన, నీతివంతమైన రాజకీయాలు చేస్తామని ఎన్నికైన కార్పొరేటర్లతో బండి సంజయ్ ప్రమాణం చేయించారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కనప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఒక వర్గం మెప్పు పొందేందుకు మెజారిటీ ప్రజలను అధికార టీఆర్ఎష్ అవమానిస్తోందని బండి సంజయ్ అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ లు కుమ్మక్కు:
మేయర్ పీఠం దక్కనప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులను తెప్పిస్తామని సంజయ్ హామీ ఇచ్చారుహైదరాబాద్ ను విశ్వనగరంగా చేశామని చెబుతున్న టీఆర్ఎస్ పాతబస్తీ అభివృద్ధిని చూసి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి నోచుకోవడంలేదని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని సంజయ్ ఆరోపించారు.
ఇది చదవండి: దేవాలయాల చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు
శుక్రవారం సెంటిమెంటు:
హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారని అందుకే గతంలో తమ కార్పొరేటర్లతో శుక్రవారమే ప్రమాణం చేయించామని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల ముందు అమ్మవారిని దర్శించుకున్నామని గుర్తుచేశారు.
ఇది చదవండి: ప్రణామాలు చేసినా ప్రమాదం తప్పదు: బండి సంజయ్
భారీ బందోబస్తు:
బండి సంజయ్ రాక నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇది చదవండి: బంద్ కు టీఆర్ఎస్ మద్దతుపై సంజయ్ మండిపాటు