ఆటలాడే పిల్లలు
భూమిలోంచి డైరెక్టుగా
పూచిన పువ్వుల్లా వున్నారు.
గ్రౌండ్‌కు ప్రాణమొచ్చింది
స్తబ్దంలోంచి శబ్దం చిగురించింది.
ఇక్కడ ఆడని ఆటల్లేవు
ఆ చిట్టి తండ్రి విసిరిన జావెలీన్ త్రో
కాలాన్ని చీల్చుకుంటూ
ఇంకా ప్రయాణిస్తూనే వుంది.
ఎన్.సి.సి. క్యాడెట్స్
కవాతు చేస్తుంటే
దేశం యుద్ధానికి సిద్ధమైనట్టుగా వుంది
క్రీడా స్థలం కాస్తా
రణస్థలంగా పరిణమించింది.
ఉదయం పూట నడక
పడకను ధిక్కరించి
బయట పడ్డ పురోగమన దృశ్యం
ఇవాళటి అడుగుల్లో
ఆ పిల్లల చురుకుదనం దూరినట్టుంది.
దారిలో నిద్ర గన్నేరు చెట్టు నుంచి
ఓ ఆకు ఇటు వైపు ఉలిక్కిపడి చూసింది.
ఈ మైదానం
కేవలం ఖాళీ స్థలం అనుకునేరు
చరిత్రను కడుపులో దాచుకున్న
జ్ఞాపకాల పురాస్థలం
నేనివ్వాళ గతంలో పీల్చిన
గాలి కోసం వెతుకుతున్నాను.
ఇవాళ కొంచెం పొగ మంచు
వొంటిని కప్పేస్తున్నది
చలి మొదలైంది కాని
తలపోతల వెచ్చదనం ముందు ఇదెంత!
ఓ రెండు మేఘ శకలాలు
మైదానం మీంచి కదలటం లేదు
బహుశా
నా కవిత్వంలో చోటు కోసం
నా వైపే చూస్తున్నాయి.
ఎవరో దయామయుడు
సెల్‌ఫోన్ లోంచి
రఫీ పాటను వినిపిస్తున్నాడు.
మైదానం కాస్త
జీవన రంగస్థలంగా మారిపోయింది.
Also read: బ్రెడ్
Also read: సముద్రం ముద్ర
Also read: సామూహిక
Also read: వలస చేప
Also read: చక్రం