• నాలుగు ప్రస్తుత గనుల విస్తరణకు చర్యలు
• వెల్లడించిన సింగరేణి సిఎం.డి. ఎన్.శ్రీధర్
రానున్న నాలుగు సంవత్సరాలలో సింగరేణిలో 14 కొత్త గనులను ప్రారంభించుకోవడానికి సకాలంలో సన్నాహాలు పూర్తిచేయాలని, 5 ఏళ్లలో 100 మిలియను టన్నుల లక్ష్య సాధన దిశగా కంపెనీని ముందుకు తీసుకువెళ్లాలని సంస్థ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ సింగరేణి ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురు, శుక్ర వారాల్లో (ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో) రెండు రోజుల పాటు జరిగిన మేథోమథన సదస్సులో సింగరేణి డైరెక్టర్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం సింగరేణి 65 మిలియను టన్నుల బొగ్గు ఉత్పత్తి నుండి వచ్చే ఏడాది 67 మిలియను టన్నులకు ఎదుగుతోందని, రానున్న 5 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సింగరేణి డైరెక్టర్లతో పాటు, సింగరేణి మైనింగ్, ప్లానింగ్, ఎస్టేట్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, పర్సనల్, పర్చేజ్, ఐ.టి., వంటి కీలక విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సింగరేణి కంపెనీ భవిష్యత్తు, ప్రగతి వ్యూహాలపై సుదీర్ఘ మేథోమథనం జరిపారు. దేశ, రాష్ట్ర బొగ్గు, విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొంటూ, సింగరేణి సంస్థ కూడా అభివృద్ధి పథంలో అగ్రగామిగా ఉండేలా భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని సూచించారు.
Also Read: సింగరేణిలో రాజకీయాలు
నాలుగేళ్ల కాలంలో కొత్తగా 14 గనులు తెరవాల్సి ఉందనీ, అలాగే ప్రస్తుతం నడుస్తున్న 4 గనులకు విస్తరణలు సాధించాల్సి ఉందనీ, వివిధ రకాల అనుమతులు సాధించడానికి ఇప్పటినుండే సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గు మార్కెట్టులో వచ్చిన మార్పులను వివరిస్తూ సింగరేణి సంస్థ పోటీ మార్కెట్టును తట్టుకొని నిలబడాలంటే నాణ్యతను పెంచడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని కూడా భారీగా తగ్గించుకోవాలనీ వివరించారు.
బొగ్గు ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గాలంటే యంత్రాల పనిగంటలు ఇంకా పెరగాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల షవల్స్ రోజుకి 10 నుండి 14 గంటలు ఉత్పత్తిలో పాల్గొంటున్నాయనీ, వీటి ఉత్పత్తి కాలాన్ని 18 గంటల వరకూ పెంచాలన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఈ ఏడాది టన్నుకు సుమారు 9 వేల వరకూ చేరిందనీ, దీనిని ఎంతగా తగ్గిస్తే కంపెనీకి అంత ప్రయోజనమని వివరించారు. భూగర్భ గనులలో ఎస్.డి.ఎల్. యంత్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయించాలనీ, భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించుకోవడానికి నిర్దిష్టమైన కార్యచరణను అమలు జరపాలన్నారు.
దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత దిశగా పోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికి పటిష్టమైన భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో సోలార్, థర్మల్ విద్యుత్తు రంగాలోకి అడుగుపెట్టామనీ, నిర్మాణంలో ఉన్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలనీ, మరో 300 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్ ప్లాంటును మానేరు డ్యాం మీద నిర్మించడానికి ప్రయత్నిస్తునామనీ వివరించారు. బొగ్గు, విద్యుత్ ఉత్పాదన ద్వారా కంపెనీకి మంచి ఆర్ధిక పూనాదిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: సింగరేణి డిస్మిస్ కార్మికుల దీక్షలు
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ & పి&పి) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఇ&ఎం) డి.సత్యనారాయణరావు, ఇ.డి. (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, జి.ఎం. (సి.డి.ఎన్.) కె.రవిశంకర్, జి.ఎం. (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జి.ఎం. (సి.పి.పి.) నాగ భూషణ్ రెడ్డి, జి.ఎం. (పి&పి) సత్తయ్య, జి.ఎం. (ఎస్టేట్స్) ఎస్.డి.ఎం.సుభానీ, ఇంకా వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.