- తనకు స్వేచ్ఛ ఇవ్వరనే అనుమానంతో నో చెప్పిన ప్రశాంత్ కిశోర్
- కార్యాచరణ కమిటీలో అత్యధికుల వైఖరి పీకేకి ప్రతికూలంగానే
- మే13 నుంచి 15 వరకూ ఉదయపూర్ లో చింతన్ శివిర్
కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన ప్రతిపాదనను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు. పార్టీని పునరుద్ధరించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి నాయకత్వం నిరాకరించడంతో ఆయన తన నిర్ణయం తీసుకున్నారు.
‘‘ప్రశాంత్ కిశోర్ భవిష్యత్ చిత్రపటాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట ఆవిష్కరించిన తర్వాత పార్టీ అధ్యక్షురాలు ఎనిమిదిమంది సభ్యులతో కూడిన సాధికార కార్యాచరణ బృందాన్ని నియమించారు. నిర్వచించిన బాధ్యతలతో పార్టీలో చేరవలసిందిగా ప్రశాంత్ కిశోర్ ను ఆహ్వానించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఆయన కృషినీ, ఆయన ఇచ్చిన సలహాలనూ మేము అభినందిసస్తున్నాం,’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
పీకే కాంగ్రెస్ లో చేరడానికి నిరాకరించడం గురించి కాంగ్రెస్ పార్టీ ఒక రోజు మౌనం పాటించింది. రాజకీయ సవాళ్ళను ఎదుర్కోటానికి ఎనిమిదిమందితో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టూ, వచ్చే నెలలో ఉదయపూర్ (రాజస్థాన్)లో చింతన్ శివిర్ (ఆలోచనా శిబిరం) నిర్వహిస్తున్నట్టూ ప్రకటించింది. మే 13 నుంచి 15 వరకూ చింతన్ శివిర్ నడుస్తుంది.
ప్రశాంత్ కిశోర్ ఇటీవలికాలంలో మూడు దఫాలు కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. పార్టీ పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యల గురించి ఆయన సవివరంగా దృశ్యం చూపించారు. పీకేను పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న లాభనష్టాలను పార్టీ ఉన్నత నాయకులు ఒకటికిరెండు సార్లు చర్చించారు. కమిటీ పీకే ప్రవేశంపైన భిన్నాభిప్రాయం వెలిబుచ్చింది. ప్రియాంక గాంధీ వద్రా, అంబికా సోనీ పీకే వైపు మొగ్గు చూపించగా, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా, జైరాంరమేష్ లు వ్యతిరేకించారు.
ఇటీవల అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా ఓడిపోయిన తర్వాత చింతన్ శివిర్ గురించీ, టాస్క్ ఫోర్స్ గురించీ చర్యలు తీసుకున్నారు. రెండేళ్ళ కిందట కనిపించే, పనిచేసే నాయకత్వం పార్టీకి కావాలని కోరుతూ సోనియాగాంధీకి లేఖ రాసిన గ్రూప్ -23 బృందం సభ్యులు ఇప్పటికీ గొణుగుతూనే ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ విషయంలో సైతం తమను సంప్రదించలేదని అన్నారు.
ఇది ఇలా ఉండగా, వచ్చే ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోరాదని తమ పార్టీ నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్ సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు ప్రకటించారు.