- స్వాతంత్ర్య సమర యోధుడు
- ఘంటసాల శతజయంత్యుత్సవాలు సైతం
- ప్రధానిస్థాయిలో పింగళి పుట్టిన రోజుపై చర్చ
ఆగష్టు 2వ తేదీ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టినరోజు. ఆయన సామాన్యుడు కాడు, స్వాతంత్ర్య భారత సమరంలో అనేకులు అనేక విధాల సేవలు అందించారు. త్యాగాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రతిభావంతులు. కానీ, పింగళి వెంకయ్య ప్రజ్ఞ బహుముఖం. ఈ బహుప్రతిభామూర్తిని, స్వాతంత్ర్యదీప్తిని, అచ్చతెలుగుకీర్తిని భారత ప్రభుత్వం ఈ ఏడు ఘనంగా తలచుకుంటోంది. విశిష్టరీతిలో నివాళులు అర్పిస్తోంది. ఆ దిశగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉత్సవరంగంలో దిగిపోయారు.
Also read: భస్మాసురుడిని తలపిస్తున్న మనిషి
నిన్న అల్లూరి సీతారామరాజుకీ, నేడు పింగళి వెంకయ్యకూ
మొన్న అల్లూరి సీతారామరాజుకు, నేడు పింగళి వెంకయ్యకు భారత ప్రభుత్వం ఘన నీరాజనాలు పలకడం మన తెలుగువారందరికీ అమితానందకరం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలకు తెలుగునాడు, పింగళి వెంకయ్య జన్మభూమి భట్లపెనుమర్రు వేదికగా నిలవడం మన తెలుగువారందరికీ గర్వకారణం. ఆగస్టు 2 నుంచి 15 వ తేది వరకూ ప్రతి మొబైల్ ప్రొఫైల్ పిక్ లో జాతీయ జెండా ఉండాలని, 13-14-15 తేదీలలో మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలని ప్రధాని ప్రకటించారు. అటు మన జయ పతాకకు -ఇటు రూపశిల్పి వెంకయ్యకు కోట్లాదిమంది జేజేలు పలికే పర్వదినాలుగా ఇవి చరిత్రలో మిగిలిపోతాయి. వెంకయ్య స్మారకంగా పోస్టల్ స్టాంపును హో మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు దిల్లీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే ఈ ఉత్సవం సందర్భంలో వెంకయ్య కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలుస్తారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం దిల్లీలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడం గొప్ప సందర్భం, గొప్ప సంరంభం. భట్ల పెనుమర్రు గ్రామస్థులకు కూడా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పలకడం విశిష్టమైన కార్యం.
Also read: పులుల పరిరక్షణ
ఘంటసాల శతజయంత్యుత్సవాలు
మన గంధర్వుడు ఘంటసాల శత జయంతి ఉత్సవాలను కూడా త్వరలో నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖామాత్యులు కిషన్ రెడ్డి ప్రకటించడం మరో సమ్మోహన సందేశం. ఘంటసాల కేవలం సినిమా గాయకుడే కాదు, అనేక దేశభక్తి గీతాలను రచించి, పాడిన పరమ దేశభక్తుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. పింగళి వెంకయ్య త్యాగనిరతి, దేశభక్తి, జెండా రూపకల్పనలో చూపించిన శ్రద్ధాభక్తులు, శక్తియుక్తులు లోకానికి తెలిసినవే. జాతీయ జెండా నిర్మాతగానే కాక, జాతీయ భావాల ప్రదర్శనలో, ఆచరణలో ఆయన నడచిన మార్గం అనన్య సామాన్యం. ఒకప్పటి ఒక గ్రామ కరణం బిడ్డకు నేడు జాతిమొత్తం ఇంత ఘనంగా నీరాజనం పలుకుతోందంటే ఆయన పెరిగిన వైనం, నడచిన మార్గం ఎంత గొప్పవో నేటి తరాలు తెలుసుకొని తీరాలి. రేపటి తరాల బిడ్డలు తరతరాలకు తలచుకోవాలి. అంతటి ఘనమైన జీవన నేపథ్యం ఆయన వెనకాల ఉంది. అది నేడు ఆదర్శవంతమైన చరిత్రగా మన ముందు నిలబడి ఉంది.ఇంతటి ఘనమైన వ్యక్తి చరమ జీవితం కడు ఘోరంగా సాగింది. కటిక పేదరికం ప్రతి క్షణం వెక్కిరించింది. మరో మహా యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చివరి రోజులు కూడా అలాగే సాగాయి. జాతీయ పతాకం గురించి ప్రభుత్వం గతంలో ప్రచురించిన పుస్తకంలో పింగళి వెంకయ్య పేరును సూచించకపోవడం దారుణం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, తెలుగువారి పట్ల ఉన్న చిన్నచూపుకు అది పెద్దగుర్తు. ఈ ప్రభుత్వమైనా దానిని సరిదిద్దుతుందని ఆశిద్దాం.
Also read: కార్గిల్ విజయస్ఫూర్తి
భారతరత్నకోసం అభ్యర్థన
వెంకయ్యకు ‘భారతరత్న’ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు. వారి కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నారు. తెలుగువారందరూ అదే కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతటి చారిత్రక పురుషుడి స్వగ్రామం భట్లపెనుమర్రులో అసౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగా ఉందని ఆ గ్రామవాసులు ఆవేదన చెందుతున్నారు. వీటన్నిటిపైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వారి కుటుంబ సభ్యులు గౌరవంగా జీవించగలిగేలా ప్రభుత్వాలు సహకారం అందించాలి. జయంతి వేళ, పింగళి వెంకయ్యకు జేజేలు పలుకుదాం.
Also read: బూస్టర్ డోస్ కు నో చెప్పకండి