వోలేటి దివాకర్
పినాకిని ఎక్స్ ప్రెస్ గురువారంతో 30 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా ఆంధ్ర ,తమిళనాడు రాష్ట్రాలకు సేవలందిస్తున్న ఇంటర్ సిటీ రైలు 30 వసంతాల సేవలను పూర్తి చేసింది. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు, సీజన్ టిక్కెట్ హోల్డర్ లకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు పంచింది.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన 12711/12712 పినాకిని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కు కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ గుండా ప్రవహించే పెన్నా లేదా పినాకిని నది పేరు పెట్టారు. ఇది విజయవాడ నుండి జూలై 01, 1992 న ప్రారంభించబడింది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ జంక్షన్‌ని దక్షిణ రైల్వే జోన్‌లోని తమిళనాడు రాష్ట్ర రాజధాని MGR చెన్నై సెంట్రల్‌కి మధ్య నడిచే రోజువారీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.
ఈ రైలు ప్రతి వైపు 430 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. పినాకిని ఎక్స్‌ప్రెస్ నూరు శాతం ఆక్యుపెన్సీ రేటు 100% కలిగి, ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంది.. దీంతో రైలు 18 కోచ్‌లతో ప్రారంభమైన ఈ రైలు కోచ్‌ల సంఖ్యను 24కి పెంచారు.
పినాకిని ప్రారంభ దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే ప్లాట్‌ఫారమ్ నెం.1లో ఇంటర్ సిటీ రైలును అభిమానులక్లబ్ , ఔత్సాహికులు అలంకరించారు. కేక్ కట్ చేసి 30వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు.