వోలేటి దివాకర్
పార్టీ సమన్వయకర్త విధి వర్గ విభేదాలను పరిష్కరించి, పార్టీలోని అందర్నీ సమన్వయం చేయడం. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సిపి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా తన వర్గాన్ని ఉసిగొల్పుతూనే మరోవై పు రాజమహేంద్రవరంలో అదే సామాజిక వర్గానికి అండగా నిలుస్తానని చెబుతున్నారు. తద్వారా అటు రామచంద్రపురంలో… ఇటు రాజమహేంద్రవరంలో వర్గ రాజకీయాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. తన కొడుకు సూర్యప్రకాష్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ భవిష్యత్ నే పణంగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన తనయుడికి రామచంద్రపురం సీటు కేటాయించాలన్నది పిల్లి డిమాండ్ గా వినిపిస్తోంది. ఇందుకు అవసరమైతే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని పార్టీని ఇరుకుపెట్టే ప్రయత్న చేస్తున్నారు.
Also read: వలంటీర్ల వ్యవస్థ పై పవన్ ను సమర్ధించిన సోము
పిల్లికి పెద్దపీట
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆది నుంచి ముఖ్యమంత్రి జగన్ కుటుంబం వెన్నంటే ఉన్నారు. వైఎస్ మరణాంతరం జగన్ కు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైఎస్సార్సిపిలో చేరారు. ఆయన త్యాగం వృధా పోలేదు. బిసి సామాజిక వర్గానికి చెందిన పిల్లికి జగన్ పదవుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దీనిలో భాగంగా ప్రతిపక్షంలో ఉండగా పార్టీకి లభించిన తొలి ఎమ్మెల్సీ పదవిని పిల్లికి ఆఫర్ చేశారు. దీంతో తెలంగాణాలో తొలి నుంచి పార్టీకి అండగా నిలిచి, ఎమ్మెల్సీ పదవిని ఆశించిన తెలంగాణాకు చెందిన కొండ మురళి, సురేఖ దంపతులతో సహా ఎంతో మంది కీలక నేతలు వై ఎస్సార్ సిపికి దూరమయ్యారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు లభించిన ఎమ్మెల్సీ సీటును అప్పుడే పార్టీలో చేరిన ఆదిరెడ్డి అప్పారావుకు కట్టబెట్టారు. ఈవ్యవ హారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. 2014 ఎన్నికల్లో రామచంద్రపురంలో ఆయన ఓడిపోతారన్న సర్వే ఫలితాల నేపథ్యంలో మండపేట సీటును పిల్లికి కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి రెవె న్యూ మంత్రిగా అవకాశం కల్పించారు. శాసనమండలి రద్దు చేయాలన్న ఆలోచనల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిని కోల్పోయే అవకాశం ఉండటంతో పిల్లిని రాజ్యసభకు పంపించారు. రెడ్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన సమన్వయకర్తల నియామకంలో కూడా పిల్లికి పెద్దపీట వేసి ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా నియమించారు.
Also read: సర్వేలన్నీ వైసీపీ వైపే, అందులో రాజమహేంద్రవరం టాప్!
కొడుకు భవిష్యత్ కోసం ఆరాటం
పార్టీలోనూ, పదవుల్లోనూ జగన్ ఇంత ప్రాధాన్యతనిచ్చినా పిల్లి సుభాష్ చంద్రబోస్ సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. రామచంద్రపురం సీటు తన కుమారుడు సూర్యప్రకాష్ కు రామచంద్రపురం ఇప్పించుకునేందుకు మంత్రి చెల్లుబోయిన వేణు సీటుకు ఎసరుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని ప్రత్యర్థి వర్గాన్ని ఎగదోస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎంపి భరత్ రామ్ మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. దీనిలో భాగంగా ఇటీవల పార్టీ సమన్వయకర్త మిధున్ రెడ్డి ఎదుటే రాజా సోదరుడు, పార్టీ యువజన విభాగం ప్రాంతీయ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, భరత్ వర్గానికి చెందిన యువజన విభాగం నాయకుడు పీతా రామకృష్ణ బాహాబాహీకి దిగారు. ఆ తరువాత గణేష్ రామకృష్ణకు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కూడా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం ప్రజల్లో పార్టీని పలుచన చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను శాంతింపజేసి, సంయమనం పాటించేలా చేయాల్సిన పిల్లి సుభాష్ చంద్రబోస్ భరత్ వర్గానికి చెందిన రామకృష్ణను పరామర్శించడం ద్వారా భరత్ వర్గానికి అండగా ఉన్నానన్న పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఏది ఏమైనా పార్టీలో అత్యంత ప్రాధాన్యత పొందిన పిల్లి రామచంద్రపురంలో తన కొడుకు కోసం… రాజమహేంద్రవరంలో తన వర్గం కోసం చేస్తున్న రాజకీయాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also read: కొత్త డాక్టర్ వైసిపి రోగం కుదురుస్తారా?!