పెద్దపల్లి : ఇక్కడి జంటహత్యలపై హైకోర్టులో గురువారంనాడు సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. జంట హత్యల కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటిషన్ లో శంకర్ కోరారు. గురువారంనాడే పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరుపుతుంది.
ముఖ్యమంత్రి స్పందించాలి : బండి సంజయ్
న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి పార్థివదేహాలకు పెద్దపల్లి ఆసుపత్రిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అంజలి ఘటించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించాలనీ, లేకపోతే ఆయనను ఈ హత్యోదంతంలో అనుమానించవలసి ఉంటుందనీ సంజయ్ ఘాటుగా ప్రకటన చేశారు. నిందితులను పట్టుకొని వారికి శిక్ష విధించే వరకూ బాధిత కుటుంబీకుల తరఫున పోరాటం చేస్తామని బీజేపీ నాయకుడు ప్రకటించారు. అధికారపార్టీలో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై ఈ హత్య జరిపించారని సంజయ్ ఆరోపించారు. హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చేత ఈ ఉదంతంపైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హతులు లోగడ హైకోర్టును ఆశ్రయించారనీ, తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదనీ, తమకు రక్షణ కల్పించాలనీ కోరారనీ సంజయ్ కుమార్ గుర్తు చేశారు.
Also Read: న్యాయవాదుల హత్యకేసులో టీఆర్ఎస్ నాయకులపై అనుమానం
బీజేపీ నాయకుడూ, అడ్వకేటు, ఎంఎల్ సీ రామచంద్రరావు కూడా జంటహత్యలను ఖండించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్న న్యాయవాద దంపతులను హత్య చేయడం దారుణమంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సీబీఐ విచారణ జరిపించాలి : ఉత్తమ్
పెద్దపల్లి జంటహత్యలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలీసు కస్టడీలో చనిపోయిన శీలం రంగయ్య కుటుంబం తరఫున కూడా ఈ దంపతులు న్యాయపోరాటం చేస్తున్నారనీ, మంథని మాజీ ఎంఎల్ఏ, పెద్దపల్లి జిల్లా పరిషత్తు అధ్యక్షుడు పుట్టా పుట్టా మధుకర్ ను ఈ కేసులో నిందితుడుగా పేర్కొన్నారనీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పోలీసులకు దాడి గురించి తెలిసే ఉంటుంది: శ్రీదర్ బాబు
ఈ దాడి గురించి స్థానిక పోలీసులకు తెలిసే ఉంటుందని మంథని ఎంఎల్ఏ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రక్షణ కోరిన హైకోర్టు న్యాయవాదులను పట్టపగలు హత్య చేస్తే పోలీసులు ఏమి చేస్తున్నారనీ, ఏ రకమైన పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నదనీ ఆయన ప్రశ్నించారు. ఒక మహిళా న్యాయవాదిని రక్షించలేకపోతే పోలీసు వ్యవస్థ ఎందుకు దండగ అంటూ ఆయన విమర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలుసుకొని శ్రీధర్ బాబు పరామర్శించారు. హైకోర్టు లాయర్ల ప్రాణాలు కాపాడలేని పోలీసు వ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాలని టీపీసీసీ ప్రతినిధి ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు.
శత్రువుగా మారిన మిత్రుడు నిందితుడు:
జంటహత్యల కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న కుంట శ్రీనివాసరావు, హతుడు వామనరావు ఒకప్పుడు మంచి మిత్రులు. వారిద్దరి ఇళ్ళకు మధ్య కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇద్దరూ స్థానిక కాంగ్రెస్ నాయకులకు సన్నిహితంగా ఉండేవారు. శ్రీనివాసరావుకు ఎంపీటీసీ టిక్కెట్టు ఇప్పించడంలో వామనరావు పాత్ర ప్రధానమైనది. కొన్ని మాసాల తర్వాత శ్రీను వామనరావుతోనూ, కాంగ్రెస్ పార్టీతోనూ తెగతెంపులు చేసుకొని అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. శ్రీనివాసరావు సోదరుడు రాజు ప్రస్తుతం గ్రామసర్పంచ్ గా ఉన్నారు. ఆయనతో ఇప్పటికీ వామనరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాసరావు టీఆర్ఎస్ మండలి అధ్యక్షుడుగా ఉన్నారు.
Also Read: యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్
దేవాలయ నిర్మాణం:
ఇది ఇలా ఉండగా, గ్రామంలో తన ఇంటిని నిర్మించుకుంటూనే ఒక దేవాలయం నిర్మించే కార్యక్రమంలో శ్రనివాసరావు ఉన్నారు. అందుకు ఒక కంపెనీ సహకారం అందజేస్తున్నది. ప్రభుత్వ భూమిలో దేవాలయం నిర్మిస్తున్నారంటూ వామనరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. కోర్టు జోక్యంతో దేవాలయ నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడే జంటహత్యల వెనుక ఉద్దేశాలు ఏమిటో నిర్దిష్టంగా చెప్పడం కష్టమని పోలీసులు వ్యాఖ్యానించారు.