భగవద్గీత – 71
ఒకడు ఒక చిత్రాన్ని అద్భుతంగా గీస్తాడు. ఇంకొకడు రాయిలో అద్భుత సౌందర్యాన్ని దర్శించి మన కళ్ళెదుట సాక్షాత్కరింపచేస్తాడు. మరియొకడు గాలిలో తేలిపోయే దూదిపింజలను దారాలుచేసి ఆ దారాలతో అతి నాజూకైన వస్త్రాన్ని నేస్తాడు. మనము ఈ రోజున ఎన్ని వస్తువులు వాడుతున్నాం… కారు, మోటరు సైకిలు, స్మార్టు ఫోను, వంటింట్లో వాడే సామగ్రి…
ఒకటేమిటి? సమస్త వస్తువులు ఎవరో ఒకరి ఆలోచనలనుండి ఉద్భవించినవే కదా! ఆ వస్తువు కనుక్కున్న ఆ మనిషికే ఆ ఆలోచన వచ్చినదేమిటి? మిగిలినవారికి రాలేదెందుకు?
Also read: పని నేర్చుకున్న తర్వాతనే పర్యవేక్షణ
ఉదాహరణకు ఒక బ్యాంకులో కొందరు పనిచేస్తుంటారు. ఒకరికి డిపాజిట్ల సేకరణ వెన్నతోపెట్టిన విద్య. మరొకరికి ఋణ మంజూరు చేయడమంటే చాలా ఇష్టం. ఖాతాదారులు తీసుకున్న అప్పులను వసూలు చేయడంలో ఒకడు నిష్ణాతుడు. వీరందరికీ ఎవరికి ఏ పని ఇవ్వాలి, ఎవరికి ఏది ఇస్తే పని అద్భుతంగా పూర్తి అవుతుంది అని manage చేయడంలో ఒకడు expert.
ఒక అందమైన పువ్వును చూసి మనసుకు హత్తుకొనే కవిత్వం ఒకడు చెపితే… ఆ పువ్వు నుండి సుగంధ తైలము ఎట్లా తీయాలా అని ఒకడి బుర్ర ఆలోచిస్తుంది.
ప్రకృతి ఒకటే.
సృష్టి ఒకటే.
మనుషుల బాహ్య ఆకృతీ ఒకటే.
Also read: ఎవరి మనస్సు శాంతితో నిండి ఉంటుంది?
కానీ ఆయామనుషుల మేధస్సులలో, ఆలోచించే తీరులో ఎంత వైవిధ్యం ఉన్నదో గమనించండి. ఈ వైవిధ్యాన్నే పరమాత్మ స్వభావము అని అన్నారు…
పై విషయాలను చూస్తే మనకు ఒకటి అర్ధమవుతుంది. ఒకటే ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడ్డది. ఎందువలన? వారివారి స్వభావమువలన.
అందుకే ఆయన ఇలా చెప్పారు
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మ ఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ! (5-14)
భగవంతుడు ఫలానా గ్రూపుకు ఇది, ఫలానా గ్రూపుకు ఇది అని విభజన చేయలేదు ( సామాజికవర్గం). ఎవరికీ ఏ అధికారమూ ఈయలేదు. ఏ కర్మఫలాన్ని ప్రత్యేకించలేదు. సమస్తముకూడా స్వభావము చేతనే ప్రవర్తించుచున్నది.
స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి…!
గీతను అర్ధం చేసుకుని మసలితే కులాల కుంపట్లు ఆరిపోతాయి. తల్లిదండ్రులు పిల్లలను నువ్వుఫలానా చదువే చదవాలనే వత్తిడిపెట్టరు. ఆఫీసులలో ఎవడు ఏ పనిలో నిష్ణాతుడో ఆ పనిలోనే వినియోగించుకుంటారు. అంతేకానీ కోతిని ఈదమని, చేపను చెట్టెక్కమని చెప్పరు.
మన మనస్సు లోతులను స్పృశిస్తూ మనకు సత్యమేదో నిత్యమేదో తెలియచేస్తుంది గీత.
Also read: కనులుమూసినా నీ రూపే