- ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వల్ల అకాలమరణం
- ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడు
- ప్రజలతో మమేకమైన నాయకుడు
(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరు పదులు నిండకుండానే ఈ లోకం విడిచి వెళ్ళడం దారుణం. అత్యంత సౌమ్యుడూ, నిజాయతీపరుడూ, ప్రజానాయకుడూ అయిన శ్రీనివాస్ తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణకు అన్ని రకాలా వారసుడు. తండ్రి అడుగుజాడలలో నడుస్తూ రాజకీయాలలో పైకి వచ్చిన వ్యక్తి. రాజ్యసభ మాజీ సభ్యుడైన ద్రోణంరాజు సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిన ద్రోణాచార్యుడు. కొన్ని దశాబ్దాలపాటు ఉత్తరాది రాజకీయాలను ఆయన శాసించారు.
రెండు సార్లు ఎంఎల్ ఏ
రెండు విడతల విశాఖపట్టణం దక్షిణం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాంగ్రెస్ టిక్కెట్ పైన ఎన్నికైన శ్రీనివాస్ 2019లో వైఎస్ ఆర్ సీపీ టిక్కెట్టుపైన పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయనగా ఆయన కాంగ్రెస్ వదిలి వైఎస్ ఆర్ సీపీ లో చేరారు. కనీసం రెండు మాసాల ముందుగానైనా పార్టీలో చేరి ఉంటే ఆయన గెలిచి ఉండేవారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి ఆయన చాలా సంకోచించారు. పార్టీ ఫిరాయించారని లోకం అనుకుంటుందేమోనని భయపడేవారు. పార్టీ విధేయత పట్ల, కుటుంబ ప్రతిష్ఠ పట్ల ఆయన అంకితభావం అటువంటిది. చాలా నిరాడంబరంగా జీవించారు. విశాఖపట్టణం మెట్రో రీజియనల్ డెవలప్ మెంట్ అథారిటీ (వైఎండీఏ) అధ్యక్షుడిగా ఉన్నారు. వివాదాలకు అతీతుడు.
వైఎస్ కు సన్నిహితులు
ద్రోణంరాజు కుంటుంబం పట్ల దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డికి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ద్రోణంరాజు శ్రీనివాస్ పట్లల ప్రేమగా ఉండేవారు. ఆయన ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ మంచి పదవి ఇచ్చి ఆదరించారు. పదవి ఉన్నా లేకపోయినా శ్రీనివాస్ ఒకేరకంగా ఉండేవారు. శ్రీనివాస్ కు కొన్ని రోజుల కిందట కోవిద్ పాజిటీవ్ తేలింది. తర్వాత కొన్ని రోజుల వైద్యం తర్వాత నెగెటివ్ వచ్చింది. కానీ ఊపిరితిత్తులలో ఇన్ ఫెక్షన్ పెరగడంతో ఆయన తిరిగి ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది. అవసరమైతే చెన్నై తీసుకొని వెళ్ళి వైద్యం చేయించాలని ముఖ్యమంత్రి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు చైన్నై వెళ్ళడానికి ముందే శ్రీనివాస్ తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ కు పెద్దలంటే భక్తిప్రపత్తులు ఉన్నాయి. చాలా గౌరవంగా మాట్లాడేవారు. చిరునవ్వుతూ, ప్రశాంతంగా కనిపించే ఆయన నియోజకవర్గం ప్రజలతో మమేకమైన ప్రజాప్రతినిధి. శ్రీనివాస్ కు భార్య శేషి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవాత్సవ ఉన్నారు. శ్వేత జాలర్ల సామాజికవర్గానికి చెందిన యువకుడిని కులాంతర వివాహం చేసుకున్నారు. అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. శ్రీనివాస్ మృతితో ఉత్తరాంధ్ర రాజకీయాలలో ద్రోణంరాజు శకం ముగిసిందా లేక కొనసాగుతుందా అన్నది శ్రీనివాస్ కుటుంబ సభ్యుల చొరవపైనా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రోద్బలంపైనా ఆధారపడి ఉంటుంది.