చరిత్రకారుడు మైనాస్వామి
గోరంట్ల, (శ్రీ సత్యసాయి జిల్లా): విజయనగర సామ్రాజ్య మంతటా ఆలయాలను నిర్మించడం -విస్తరించడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ మరియు వ్యాప్తి కోసం విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీక్రిష్ణదేవరాయలు కృషి చేశారని చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. శ్రీక్రిష్ణదేవరాయల వారి 553 వ జయంతి సందర్భంగా గోరంట్ల విజయనగర్ లో “క్రిష్ణదేవరాయల ధర్మతత్వం మరియు ధీరత్వం” అనే అంశంపై మైనాస్వామి మాట్లాడుతూ, సనాతన ధర్మ సంప్రదాయాలను ఆచరించడం ద్వారా ప్రజలు గొప్ప జీవితాలను గడిపారన్నారు. గుడి కేవలం భక్తి మార్గానికి ప్రతీక మాత్రమే కాకుండా పరిపాలన కేంద్రంగా, విద్యాలయంగా, వైద్యాలయంగా ఉపయోగపడినట్లు ఆధారాలతో సహా వివరించారు. రాయలవారు అనుసరించిన ధర్మ తత్వం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయన్నారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న చరిత్రకారుడు మైనాస్వామి
అదేవిధంగా రాయలవారి ధీరత్వం వల్ల విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లినట్టు చరిత్రకారుడు తెలిపారు. ఉదయగిరి రాయచూరు యుద్ధాలు మినహా శ్రీకృష్ణదేవరాయల వారు పెద్దగా యుద్ధాలకు ఆస్కారం ఇవ్వలేదు. రాయల సైన్యాన్ని-రక్షణ పద్ధతులను చూసి తెలుసుకొని శత్రు రాజులు యుద్ధాలను విరమించుకొని, రాయలకు సామంతులైన సంఘటనలను మైనా స్వామి సోదాహరణంగా తెలియచెప్పారు.
ఎస్పీవీఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భక్తవత్సలం మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయల విజయాలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని అభిలాషించారు. రాయలవారి సేవా మార్గం అనితర సాధ్యమని, వారి బాటలో అందరూ పయనించాలని శ్రీక్రిష్ణదేవరాయల సేవా సమితి నాయకుడు లక్ష్మీనారాయణ చెప్పారు. కార్యక్రమంలో పులేరు సోమశేఖర్, నరేష్, నరేంద్ర, బాలాజీ, వేణుగోపాల్ రెడ్డి, జయ రామప్ప తదితరులు మాట్లాడారు.
రాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.