(Peoples Heroes Are Immortal)
అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం!
ఇంద్రవెల్లి స్థూపం వద్ద స్మృతి చిహ్నం నిర్మాణం కోసం కొత్తగా అధికారం చేపట్టనున్న పాలకుల ఆదేశాల మేరకు హడావుడి నెలకొందని వార్త. ఇంద్రవెల్లి అనగానే ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతాయ్. “పీపుల్స్ వార్” పత్రిక సంపాదకుడిగా శివసాగర్ ఇంద్రవెల్లి వీరుల అమరత్వ సంస్మరణ ప్రత్యేక సంచికలో ఇంగ్లీషులో రాసి, తర్వాత ‘సృజన’ కి పంపిన ఈ నాలుగు వాక్యాల్ని గుర్తుచేస్తోంది ఎందుకో స్పష్టం !
పీడిత కులాల మీదా, శ్రామిక కులాల మీదా, దళితబహుజన ప్రగతిశీల శక్తుల మీదా, సామాజిక కార్యకర్తలు, హక్కుల కార్యకర్తల మీదా ఇష్టానుసారం దాడులు జరిగితే ఏం గతి పడుతుందో దిగిన పాత నాయకులతో పాటు కొత్తగా గద్దెనెక్కిన పాలకులకి కూడా ఈపాటికే అర్ధమై ఉండాలి. ఇంకా కాలేదూ అంటే అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రతీ తరంలోనూ ఏదోమేరకు రాజకీయ చైతన్యం ప్రవహిస్తునే ఉంటుంది !
ఎప్పుడు చూసినా ఇంద్రవెల్లి స్థూపం మీది వాక్యాలు Those mountains red/ And the flowers red/ Oh ! Their death & red/ And our homage red! అనేవి కొత్తగానే కనిపిస్తాయి. నా అభిమాన కవి ‘శివసాగర్’ వాటిని తెలుగులో రాసిన నేపథ్యం గుర్తు కొస్తుంది. ఆ నేపథ్యాన్ని ఇప్పుడు అధికారం చేపట్టనున్న పాలకులకి కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఆ అజరామర విప్లవాత్మక అక్షరాల్ని కార్యక్షేత్రంలో ఉంటూ తెలుగు చేసిన శివసాగర్ స్మృతిలో జీవన పదాలతో కూడిన ఆ కవితా పాదాలు ఇలా,
“కొండగోగులు ఎరుపు
కొండలే ఎరుపు
కొండల్లో అన్నల
అమరత్వమెరుపు
అన్నలకు దండాలు అంతకంటే ఎరుపు !”
(సామాజిక న్యాయంతో కూడిన ప్రజాతంత్ర తెలంగాణ లక్ష్యంగా త్యాగాలు చేసిన రోజుల్ని ప్రజానీకం అంత త్వరగా మర్చిపోదు. ఎందుకంటే మాటిమాటికీ వాడిన మాటే ఐనా తప్పక చెప్పాల్సిన విషయం ఏమిటంటే, చరిత్ర ప్రజలది. చరిత్ర గతి ప్రజలది. పైపై మెరుగుల సంగతి ఎలా ఉన్నా లోపల లోగుట్టు స్మృతిలో నుండి చెరిగిపోకుండా ఉండాలని కోరుకుంటూ ‘ఇంద్రవెల్లి’ త్యాగాన్ని ఈ విధంగా మరోసారి జ్ఞప్తి చేసుకుంటూ చాలా సంవత్సరాల క్రితం తీసిన ఇంద్రవెల్లి ఫొటో, శివసాగర్ ‘ఎరుపు’ పుటలతో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ఆ చారిత్రక అమరత్వపు పుట గురించి ఈ చిన్న రైటప్ !)
– గౌరవ్