- యథాస్థితి నివేదికను రూపొందించాలి
- లేజర్ షో, థీం పార్క్, పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలి
- అభివృద్ధికి రూ. 300 కోట్లు కేటాయించాలి
పెనుకొండ: ఏప్రిల్18: పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలని చరిత్రకారుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని, పలువురు పురప్రముఖులతో కలిసి ఆయన మంగళవారం నాడు పెనుకొండ కోట మరియు చారిత్రక కట్టడాలను సందర్శించారు. ఆ తర్వాత చరిత్రకారుడు విలేఖరులతో మాట్లాడుతూ…పెనుకొండను సుందర వారసత్వ నగరంగా అభివృద్ధి చేయడానికి కనీసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని మైనాస్వామి కోరారు. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం పర్యాటక-సాంస్కృతిక అభివృద్ధిలో వెనుకబడివుండడం శోచనీయమని ఆయన ఆవేదనచెందారు. ప్రాచీనమైన, పటిష్టమైన, అత్యంత పొడవైన కోటలు ఆంధ్ర ప్రదేశ్ లో మూడు మాత్రమే వున్నాయి. మొదటిది కొండవీడు(గుంటూరు జిల్లా) కాగా, రెండవది పెనుకొండ, మూడవది చంద్రగిరి(తిరుపతి జిల్లా). అయితే పెనుకొండ మినహా మిగిలిన చోట్ల ఎక్కువ కట్టడాలు లేవు. ఏడు ప్రాకారాల కోటలు, అద్భుత శిల్పకళా నిలయాలైన హిందూ మరియు జైన ఆలయాలు, సుందర పుష్కరిణులు, మెట్ల బావులు, రాజ భవనాలు వున్నాయి. పార్శ్వనాథ, అజితనాథ జైన తీర్థంకరుల గుడులు, రామభద్ర, కాశీ విశ్వేశ్వర సన్నిధులు అరుదైన శిల్పశోభతో అలరారుతున్నాయి. వందల సంఖ్యలో శాసనాలున్నాయి. వాటిలో పదులసంఖ్యలో పాడయ్యాయి. వారసత్వ నగరంగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఒక యథాస్థితి నివేదికను రూపొందించడం ద్వారా అభివృద్ధి పనులు అమలు చేయాలని మైనాస్వామి అభిలషించారు. గగనమహల్ వద్ద నుంచి పెద్దకొండకు తీగ మార్గం(రోప్ వే), పెనుకొండచరిత్రను వివరించే లేజర్ షో, థీం పార్క్, అంతర్జాతీయస్థాయి పురావస్తు ప్రదర్శనశాల,కళ-సాంస్కృతిక వేదిక,అందమైన ఉద్యాన వనాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. భారత పర్యాటక పటంలో పెనుకొండను సమున్నత స్థాయిలో నిలపాలని కేంద్ర పర్యాటక శాఖకు చరిత్రకారుడు విన్నవించారు.పుర ప్రముఖులు,చరిత్రకారులు ఢిల్లీ వెళ్ళి మంత్రి శ్రీకిషన్ రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు.విలేఖరుల సమావేశంలో వి.హెచ్.పి. నాయకులు వేదవ్యాస్, రామకృష్ణ, సుధాకర్ గుప్తా, నాగరాజు, త్రినాధ్, యతి తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ కోట-చారిత్రక కట్టడాలు, గుడులను భారతవారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధి చేయవలసిన బాధ్యత కేంద్ర పర్యాటక – సాంస్కృతిక శాఖపై వుంది.