Sunday, December 22, 2024

పెగాసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ దాపరికం

పెగాసస్ వ్యవహారంలో నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఇదే అంశంపై రెండు మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు వెలువడనున్నాయి. పెగాసస్ స్పైవేర్ ను వినియోగించారా? లేదా? అన్నది సూటి ప్రశ్న. దానికి ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. జాతీయ భద్రత… అనే  ఒకే ఒక మాట చెప్పి, ప్రభుత్వ వర్గాలు తప్పించుకుంటున్నాయానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొత్త అఫిడవిట్ వేయడానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తరుణంలో,పరిణామాలు ఎలా ఉండబోతాయో? అనే ఉత్కంఠ సర్వత్రా పెరుగుతోంది. కమిటీలు వేయడం, నివేదికలు సమర్పించడం అనే విషయంలో ఎవరికీ విశ్వాసం లేదు.

Also read: గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక

ధర్మాసనం ఆగ్రహం

వ్యక్తులపై గూఢచర్యం గురించి తాము అడుగుతుంటే జాతీయ భద్రత గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్న విషయం తెలిసిందే.  ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ టెక్నాలజీని కీలకమైన వ్యవస్థలకు చెందిన వ్యక్తులపై ప్రయోగం చేస్తూ.. సాక్షాత్తు కేంద్రప్రభుత్వం గూఢచర్యం చేస్తోందన్న వార్తలు విని దేశం మొత్తం విస్తుపోయింది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రధాన రంగాలకు చెందిన పెద్దలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు మొదలైన వారు నిత్యం నిఘా నీడల్లో నివసిస్తున్నారన్న మాటలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి సాంకేతికత వల్ల  వ్యక్తిగత స్వేచ్ఛ ప్రశ్నార్ధకమైందని సామాన్య ప్రజలు కూడా తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు.కంచే చేనుమేస్తున్న చందంగా…పెరుగుతున్న సైబర్ క్రైమ్ తో విలవిలలాడుతున్న సమాజాలకు, పాలించి, రక్షించాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి నిఘాను నిర్వహిస్తున్నాయనే విషయం జీర్ణించుకోలేని పరిస్థితిని కల్పిస్తోంది. దేశ రక్షణ విషయంలో  నేరస్తులు, అనుమానితులపై నిఘాను ఎవ్వరూ కాదనరు. అది అత్యంత అవసరం, పరిపాలనలో భాగం, అది చట్టబద్ధం కూడా. దాని గురించి ప్రభుత్వాలను కోర్టులు తప్పుపట్టడం లేదు. తప్పు పట్టవు కూడా. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాల్లో కానీ, బహిరంగంగా గానీ చర్చనీయాంశం కారాదు… అనే సాకు చూపించి కేంద్ర ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది అనే అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం, వ్యక్తిగత రహస్యాల విషయంలో పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. దీనిపై స్పష్టంగా పరిమితమైన అఫిడవిట్ వేయమని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా,స్పష్టంగా అడుగుతోంది. దీనిపై మొట్టమొదటి అఫిడవిట్ లోనే వివరించామని,మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని సోలిసిటర్ జనరల్ తేల్చిచెప్పేశారు. కావాలంటే కమిటీ వేస్తామని ప్రభుత్వం అంటోంది.

Also read: వీగిపోయిన అగ్రరాజ్యహంకారం

ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు నిజం వెల్లడి కాకపోదు

సుప్రీం కోర్టు ఎన్నిసార్లు, ఏ రకంగా అడిగినా, కేంద్రం నుంచి అవే సమాధానాలు వస్తున్నాయి. ఈ వైఖరి వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. సుప్రీం కోర్టు రెండు మూడు రోజుల్లో ఇవ్వబోయే మధ్యంతర ఉత్తర్వులు ఎలా ఉండబోతున్నాయి? వాటి పరిణామాలు ఎలా ఉంటాయి? రాజ్యాంగ సంక్షోభం వస్తుందా? మొదలైన ప్రశ్నలు అనేకుల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈలోపు కేంద్రం సర్దుకోని ఏదైనా అఫిడవిట్ వేస్తుందా అన్నది తేలాల్సి వుంది. పెగాసస్ అంశం కేవలం మన దేశానికే చెందినది కాదు. వివిధ దేశాలు దీని బారిన పడ్డాయని వార్తలు వచ్చాయి. అందులో ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ఎట్లా ఉన్నా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఏదో ఒక రోజు అసలు నిజాలు బయటకు వస్తాయి. బిబిసి వంటి మీడియా నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఆ కథనాలను ప్రసరించి తీరుతాయని, అప్పుడు అందరి బండారాలు బయటపడతాయని మన దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లే, ప్రభుత్వాలు, వాటిని నడిపే ఏలికలు తమకు నచ్చిన విధంగా తాము పని చేసుకుంటూ వెళ్లిపోతారని, ఈ పెగాసస్ వంటి అంశాల్లో కాలయాపనే జరుగుతుందని కొందరు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. పెగాసస్ అంతు తేలిపోతుందా? లేక అంతులేని కథగా సాగిపోతుందా కాలమే సమాధానం చెప్పాలి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు,అనుమానాలు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు తమ విశ్వాసాన్ని చాటుకోవాలి. అప్పుడే పాలకులపై, వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

Also read: అన్నదాత ఉసురు తగులుతుంది, జాగ్రత్త!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles