Tuesday, January 21, 2025

మళ్ళీ కస్సుబుస్సు అంటున్న పెగాసెస్

  • సుప్రీంకోర్టు కమిటీ కారణంగా కేంద్రం మౌనం
  • ఐదు రాష్ట్రాలలో పోలింగ్ కు ముందు సంచలనం
  • నిజం నిగ్గు తేల్చకపోతే దేశానికి అప్రతిష్ఠ

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం మళ్ళీ సెగలు కక్కుతోంది. భారత్ లో ఈ వార్తలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ, అధికారపక్షాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాల చేతికి మంచి ఆయుధం దొరికింది. దానికి తోడు మరికొన్ని రోజుల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ అంశంతో బిజెపిని ఇరుకున పెట్టడానికి విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. గతంలో కొంతకాలం హల్ చల్ సృష్టించిన పెగాసస్ కొంతకాలం సద్దుమణిగింది.

Also read: అత్యంత ప్రమాదకరమైన వైరస్ భయం!

‘న్యూయార్క్ టైమ్స్’ తాజా నివేదికతో మళ్ళీ రాజుకుంది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై కూర్చుంది. ఇప్పటికే ఈ అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిపోయింది. నిజానిజాలు తేలి, నిందితుల వివరాలు వెళ్లడవ్వడానికి ఏండ్లుపూండ్లు పడుతుందని కొందరు పెదవి విరిస్తున్నారు. సాక్షాత్తు ప్రభుత్వాలే ఇందులో పాత్రలుగా ఉన్నప్పుడు ఇదెన్నడు తేలేను? అనే నిర్వేదం సర్వత్రా వినిపిస్తోంది. అసలు నిజాలు ఎలా ఉన్నా, ఇది ప్రభుత్వాధినేతలకు చెడ్డపేరు తెచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదనే వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Also read: విజయపథంలో బీజేపీ, ఆప్?

మాయని మచ్చ, ఆరని చిచ్చు

మిగిలిన దేశాల సంగతి ఎట్లా ఉన్నా, మన దేశానికి ఇది మాయనిమచ్చనే మిగిల్చేలా ఉందని మేధావి వర్గాల్లో విమర్శలు మొదలవ్వడం బాధాకరం. భారత్ -ఇజ్రాయల్ మధ్య 2017లో ఒప్పందం కుదిరిందని న్యూయార్క్ టైమ్స్ అంటోంది. రెండు దేశాల మధ్య జరిగిన 15 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్ కూడా భాగమేనని ఆ పత్రిక వెల్లడిస్తోంది.

ఇజ్రాయల్ సంస్థ ఎన్ ఎస్ ఓ అభివృద్ధి చేసిన స్పైవేర్ ను ఉపయోగించి, భారత్ సహా పలు దేశాల ప్రభుత్వాలు విపక్షనేతలు,పాత్రికేయులు, హక్కులనేతలు, న్యాయమూర్తులు మొదలైన ముఖ్యులందరిపైనా నిఘా ఉంచినట్లు తీవ్ర దుమారం రేగే విధంగా ఆ పత్రిక కథనాలు వండివార్చింది. గతంలో వెల్లడించిన విషయాలకు అదనంగా ఇప్పుడు మరికొన్ని వివరాలను జత చేర్చిన న్యూయార్క్ టైమ్స్ కొత్త కాక పుట్టిస్తోంది. ఈ కథనం ప్రకారం చూస్తే,ఎన్ ఎస్ ఓ సంస్థ 2011 నుంచే పెగాసస్ స్పైవేర్ ను ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లోని ఎన్ క్రిప్టెడ్ వ్వవస్థలను కూడా ఈ స్పైవేర్ అత్యంత చాకచక్యంగా వెల్లడించగలదని సమాచారం. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బి ఐ ) కూడా ఈ స్పైవేర్ ను వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫర్ బిడెన్ స్టోరీస్ అనే వార్తా సంస్థల కన్సార్షియం వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ ప్రభావంతో, ఈ సైబర్ ను వినియోగించకూడదని ఎఫ్ బీ ఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది .మొదట్లో నేరస్తులు, ఉగ్రవాదులపై ప్రయోగించిన ఈ స్పైవేర్ తర్వాత కాలంలో దుర్వినియోగం చేయడం పెరిగింది. మెక్సికో, యూ ఏ ఈ, సౌదీ అరేబియా మొదలైన చోట్ల కూడా ఇదే దుర్వినియోగం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ అంటోంది.

Also read: ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!

ఈ విక్రయంపై ఎన్ ఎస్ ఓ సంస్థ ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని, తీవ్ర నేరాలను నియత్రించడం కోసం కేవలం ప్రభుత్వాలకే విక్రయిస్తున్నామని స్పష్టం చేసింది. ఇజ్రాయల్ రక్షణ శాఖ ఆమోదం తెలిపిన తర్వాతే అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. భారత్ -ఇజ్రాయల్ అధినేతల మధ్య 2017లో స్నేహం పెరగడంలో 15వేల కోట్ల రూపాయల రక్షణ ఒప్పందం ప్రధానమైన పాత్ర పోషించిందనీ, అందులో భాగమే ఈ పెగాసస్ అనీ న్యూయార్క్ టైమ్స్ బలంగా చెబుతోంది.

అదొక ‘సుపారీ మీడియా’ అంటూ కేంద్ర సహాయ మంత్రి వి కె సింగ్ కొట్టి పారేస్తున్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోందని,నివేదిక ఇంకా రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గతంలో ‘ ది వైర్ ‘ ప్రచురించిన కథనం అలజడి సృష్టించింది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనాలు ఆజ్యం పోశాయి. మన దేశంలో రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, పాత్రికేయులు మొదలైన 300 ముఖ్యుల ఫోన్లను స్పైవేర్ తో హ్యాక్ చేసినట్లు ‘ ది వైర్ ‘ అప్పట్లో సంచలనం రేపింది. ఈ అంశం పార్లమెంట్ ను కుదిపేసింది. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిద్వంద్వంగా ప్రతిసారీ త్రోసిపుచ్చింది.

Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి

జస్టిస్ రవీంద్రన్ కమిటీ

జస్టిస్ ఆర్ వి రవీంద్రన్ నేత్రుత్వాన సుప్రీంకోర్టు కమిటీని కూడా ఏర్పాటుచేసింది.

ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని ప్రముఖ పాత్రికేయులు ఎన్ రామ్ (ది హిందూ), ప్రముఖ న్యాయవాది ఎం ఎల్ శర్మ రిట్ పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరం. అందునా, సమాజంలో అతి ముఖ్యమైన రంగాలకు చెందినవారిపై ప్రభుత్వ పెద్దలే నిఘా పెట్టారనే మాటలే వినలేకపోతున్నామని సామాన్య ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. సాంకేతికత సద్వినియోగం సంగతి అటుంచి, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా అనుమానంలో పడవేసే ఇటువంటి ఉదంతాలు అత్యంత దురదృష్టకరం.

ఈ స్పైవేర్ వాడకంపై నిగ్గు తేలకపోతే,ఎవరూ స్వేచ్ఛగా వారి వారి బాధ్యతలను నిర్వహించలేరు. పెగాసస్ ముగిసిపోతుందా? ఇంకా  సెగలు రేపుతూనే ఉంటుందా? కాలపరీక్షలోనే తేలాలి. దేశానికి ఇంత చెడ్డపేరును మూటగడుతున్న ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో సరియైన న్యాయం జరుగుతుందని విశ్వసిద్దాం.

Also read: కేజ్రీవాల్ – క్రేజీవాల్?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles