పెగాసస్ రేపుతున్న సెగ అంతాఇంతా కాదు. ఎదుటివారిని గుప్పెట్లో పెట్టుకోడానికీ, ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికీ, వారి ప్రతి కదలిక తెలుసుకోడానికీ, చుట్టూ ఏదో జరుగుతోందనే భయాన్ని కలిగించడానికీ,వ్యూహప్రతి వ్యూహాలను రచించుకోడానికీ, నిత్యం అభద్రతాభావంలో ముంచడానికీ అన్నట్లుగా సాగుతున్న ఈ నిఘాచర్యలు సిగ్గుచేటు. దాని విస్తృతి వింటుంటే దేశమంతా భయపడుతోంది. లోకమంతా వణుకుతోంది. ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్న చందంగా ఈ అక్రమాలకు పాల్పడేవారికి కూడా ఏదో రోజు ముప్పు తప్పదు. కరోనా వైరస్ ను మించిన కలవరం సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ నిగ్గు తేల్చాల్సిందే.
Also read: కరోనాపై పోరాటంలో అవరోధాలు
అందరికీ అపకారమే
రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, మీడియా వ్యక్తులతోనే ఇది ఆగేట్టు కనిపించడం లేదు. సామాన్యుడు కూడా దీని గురించి భయపడే వాతావరణం అలుముకుంటోంది. దీని ద్వారా ఆర్ధికపరమైన సమాచారం కూడా సేకరించి, తస్కరించే పరిస్థితి ఉందంటున్నారు. పడక గది నుంచి పాలన వరకూ సర్వ రహస్యాలను బట్టబయలు చేసే ఈ విషయంలో తాడోపేడో తేల్చాల్సిందే. మన దేశానికి చెందిన ఎందరో ప్రముఖులు, ముఖ్యుల జాతకాలాన్నీ ఇప్పటికే సేకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై మౌనం వహిస్తోంది. ఇజ్రాయల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కూడా చెప్పడం లేదు. ఈ స్పైవేర్ ను వాడుతున్నట్లు వెలువరించడం లేదు. ఈ పెగాసస్ ఇప్పటికిప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది కాదు. చాన్నళ్ల నుంచే ఈ కథ నడుస్తున్నట్లు కథనాలు వచ్చాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (ఐటీ) ఈ నెల 28 వ తేదిన ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ ముందుకు రావడం కూడా ఇదే మొట్టమొదటిసారి కాదు. 2019లో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వ పెద్దలకు ఆన్నీ తెలిసే, వారి కనుసన్నల్లోనే నిఘాతంతు నడుస్తోందని వినపడుతున్న వేళ, నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పాలకులపై ఉంది.
Also read: తొలి రోజు సభ నినాదాలతో సరి
ప్రశ్నార్థకం అవుతోన్న పౌరస్వేచ్ఛ
ఇదంతా నిజమేననే అనుమానాలు ప్రబలుతున్న వేళ, పౌర స్వేచ్ఛ ప్రశ్నార్ధకమవుతోంది. దేశ రక్షణ అభద్రతలోకి వెళ్తోంది. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, తీవ్ర నేరస్తులపై నిఘా కోసం వినియోగించుకోవాల్సిన ఇటువంటి వ్యవస్థలను ఇంత విశృంఖలంగా ప్రతివ్యక్తిపైనా, ప్రతి వ్యవస్థ ప్రతినిధిపైనా వాడుతున్నారనే అంశం సామాన్యమైంది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాగితాలకు, ఉపన్యాసాలకు పరిమితమవుతున్న తరుణంలో, సర్వోన్నత న్యాయస్థానం దీనిపై దృష్టి సారించాలి. సుమోటాగా స్వీకరించాలి. పెగాసస్ నిఘా విషకౌగిలిలో కొందరు న్యాయమూర్తుల సమాచారం కూడా చిక్కుకొని ఉందంటున్న వేళ, పాలకుల ఇచ్చకు వచ్చినట్లుగా విధానాలను రూపకల్పనచేసే తీరుకు సంకెళ్లు వేయాలి. డేటా పరిరక్షణ బిల్లును ప్రజాహితంగా, సర్వరక్షక కవచంగా సంస్కరించాలి. డేటా పరిరక్షణ అధారిటీ స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యంగ వ్యవస్థగా అవతరించాలి.
Also read: చైనా నైజం మారదా?
Congress is family property ,BJP carporate agency