బానిసలకు అహంకారమా? తులువ. వివాహభోజనంబూ, వింతైన వంటకంబూ…వీరమాతా ఆశీర్వదింపుము…వీరికి రెండు వీరతాళ్ళు… ఇటువంటి పంచ్ కలిగిన సింగిల్ లైన్ డైలాగులు విన్నప్పుడు ఎస్ వి రంగారావు విధిగా గుర్తుకు వస్తారు. దుర్యోధనుడుగా చాలామంది వేశారు. ఎన్ టి రామారావు కూడా వేశారు. కానీ ఆ కంటి చూపు, ఆ మాట విరుపు, ఆ అభినయం, ఆ వాచకంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతటివారైనా ఎస్వీఆర్ తర్వాతే. ఘటోచ్కచుడి పాత్రలో ఎస్వీయార్ ని తప్ప మరొకరిని ఊహించడం కూడా అసాధ్యం. తనకు ఇష్టమొచ్చినట్టు జీవించడం, నటించడం, వ్యవహరించడం ఆయనకే చెల్లింది. అపారమైన ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి కనుక, అసాధారణమైన ప్రతిభ ఆయన సొంతం కనుక ఆయన షరతులమీదే వేషాలు వేసేవారు. దర్శకులూ, నిర్మాతలూ ఆయనకు వెసులుబాటు ఇచ్చేవారు. క్రమశిక్షణకు భంగం కలిగించినా వారే సర్దుకుపోయేవారు.
సామర్ల వెంటక రంగారావు (ఎస్వీఆర్) 03 జులై 1918 నాడు తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరంలో లక్ష్మినరసాయమ్మ, గొట్టేశ్వరరావు దంపతులకు జన్మించారు. కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్యోగంలో ఉండగా రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమారంగంలో ప్రవేశించారు. తన 12వ ఏటనే రంగస్థల ప్రవేశం చేసిన ఘనుడు ఆయన. పాతాళభైరవీలో నేపాల మాంత్రికుడిగా రక్తికట్టించి అవార్డులూ, రివార్డులూ అందుకున్నారు. 24 జనవరి 1952లో బొంబాయిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాతాళభైరవిలో ఎస్వీఆర్ నటనకు అత్యంత ఆదరణ లభించింది. గొప్ప సన్మానం జరిగింది. పల్లెటూరి పిల్లతో ప్రారంభమైన చలనచిత్రరంగ ప్రస్థానం విజయాపిక్చర్స్ సహకారంతో జోరుగా సాగింది. బాడేటి వెంకటరమణయ్య, కోటేశ్వరమ్మల కుమార్తె లీలావతిని 27 డిసెంబర్ 1947లో పెళ్ళి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు విజయ, ప్రమీల. కుమారుడు కోటేశ్వరరావు. ఫిబ్రవరి 1974లో హైదరాబాద్ లో ఉండగా గుండెనొప్పి వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. వైద్యం తర్వాత నయమై ఆస్పత్రి నుంచి విడుదలైనారు. 18 జులై 1974లో మద్రాసులో ఉండగా తిరిగి గుండెపోటు రావడంతో మృతి చెందారు.
దాదాపు మూడు దశాబ్దాలపాటు మకుటంలేని మహారాజులాగా చలనచిత్ర సీమను ఏలారు. తెలుగు, తమిళ చిత్రాలలో నటించి శెభాష్ అనిపించుకున్నారు. సహజ నటుడిగా పేరున్న ఎస్వీయార్ డైలాగ్ లు చెప్పడంలో తనదైన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అమితంగా మెప్పించారు. సీఎన్ఎస్ – ఐబీఎన్ పోల్ లో గొప్ప చిత్రంగా ఎంపికైన మాయాబజార్ లో ఘటోచ్కచుడి పాత్రలో ఎస్వీయార్ జీవించారు. నర్తనశాలలో కీచక పాత్రకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. నంది అవార్డులూ, ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు ఆయనను వరించాయి. పాండవ వనవాసంలో దుర్యోధనుడిగా, భక్తప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా నటించి నటనలో కొత్త శిఖరాలను అధిరోహించారు. ‘నానుం ఒరు పెన్’ అనే పేరుతో వచ్చిన తమిళ సినిమాలో నటనకు ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు లభించింది. అభిమానులు ఆయన నటనకు పరవశులై విశ్వనటచక్రవర్తి అనే బిరుదు ఇచ్చారు. నటసార్శభౌమ, నట సింహ, నటశేఖర వంటి అనేక బిరుదాలు కూడా ఆయనకు ఉన్నాయి. ఆయనకు ఏ అవార్డు ఇచ్చినా,ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. ఆయన నటనాకౌశలం ముందు దిగదుడుపే.
మనదేశం, పల్లెటూరి పిల్ల వంటి చిత్రాలలోనటించి కేరెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డారు. ఒక రైతుగా, బడిపంతులుగా, జమీందారుగా, పోలీసు అధికారిగా, బందిపోటు నాయకుడిగా అనేక విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. దేవదాసు, రాజు-పేద, చెంచులక్ష్మి, బంగారు పాప, తోడికోడళ్ళు, దసరాబుల్లోడు వంటి అనేక చిత్రాలలో నటించి ప్రజల మన్ననలు పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్వీఆర్ స్మారకార్థం మంచి కేరెక్టర్ నటుడిగా ప్రతిఏటా ఎస్వీఆర్ అవార్డు ప్రదానం చేస్తున్నది.
(జులై 3 ఎస్వీయార్ 103వ జయంతి)