(4వ భాగం)
సమాజాన్ని పట్టిపీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. రోజులు మారుతున్నా పాలకులు మారుతున్నా అవినీతి, అన్యాయం, ఆశ్రిత పక్షపాతం వంటివి సంఘంలో వేళ్ళూనుకుని ఉన్నాయి. వీటిని నిర్మూలించడానికి ఎప్పటికప్పుడు కొందరు ఆదర్శవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నా వారి ప్రయత్నాలు అంతగా ఫలించక పోవడం విచారకరం. ఎందుకంటే వారి నిస్వార్ధ ప్రయత్నాలకు సహకరించే వారు తక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. మనకెందుకులే అన్న నిరాసక్తతా భావం సమాజంలో కొన్ని వర్గాల వారిలో ఉండటం వల్లనే పైన చెప్పిన అవలక్షణాలు సజీవంగా ఉంటూ వస్తున్నాయి.
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
దీనికి మరో ముఖ్య కారణం రాజకీయాలు. స్వాతంత్ర్యానికి పూర్వం అందరి ధ్యేయం, దేశానికి స్వతంత్రం తీసుకురావడమే అన్నట్టుగా ఉండేది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అంతవరకు ప్రజలలో ఉన్న ఏకోన్ముఖ దృష్టి మారింది అనడంకన్నా అది తెరమరుగైంది. అందువల్ల సమాజంలోకి క్రమంగా అన్ని వర్గాల్లోకి అవినీతి, అక్రమార్జన పట్ల వ్యామోహం, అధికార లాలస వంటి రుగ్మతలు ప్రవేశించాయి. ఇవి క్రమంగా విస్తరిస్తూనే వస్తున్నాయి. పాలకులలో, ప్రభుత్వ యంత్రాంగంలో నీతి నిజాయితీలు లోపించడం వల్లనే సమాజం క్రమంగా నైతిక విలువల విషయంలో పతనావస్ధకు చేరుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ సమాజాన్ని వదలకుండా, తరాలు మారుతున్నా నిత్యహరితంగా ఉంటున్నాయి.
క్షేత్రవాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలు
ఇటువంటి చేదు వాస్తవాలను ప్రతిబింబిస్తూ ప్రబలుతున్న సాంఘిక జాడ్యాలను దృశ్య రూపంలో తీసుకువస్తూ , ప్రేక్షకులను జాగృతం చేసి అటువంటి స్వార్ధపరుల విషయంలో సమాజంలో చైతన్యదీప్తిని రగిలించే చిత్రాల నిర్మాణం మొదలైంది. అంటే సమాజం పట్ల నైతిక బాధ్యతతో ఉండాలని కొందరు దర్శక నిర్మాతలు ఆ కోవలో అలా ప్రగతిశీల భావాలున్న చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
అత్యాశ, అవినీతి, అధికార దాహం, అక్రమార్జనల వల్ల కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఇతివృత్తంతో వచ్చిన చిత్రాలలో ఇప్పటికీ మనం చెప్పుకునే గొప్ప చిత్రాలు కొన్ని ఉన్నాయి!
పెద్ద మనుషులు
వాహినీ వారి ‘‘పెద్ద మనుషులు’’ అలాంటి గొప్ప చిత్రాలలో ఒకటి.
దర్శక శిల్పి శ్రీ కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘‘పెద్ద మనుషులు’’ చిత్రం ఆనాటి సంఘంలోని రాజకీయాల మీద, ముఖ్యంగా గ్రామాలలో అధికార పదవులు నిర్వహిస్తూ పెద్ద మనుషుల ముసుగులో చేస్తున్న వారి అకృత్యాలకు చిత్రరూపం. వ్యంగ్య వైభవంతో నిండిన సంభాషణలు, గీతాలు ఈ చిత్ర విజయానికి కారణమయ్యాయి.
ఆదిలో భక్తిరస చిత్రాల విజయవంతమైన చిత్ర దర్శకుడుగా పేరుపొందిన శ్రీ కె.వి. రెడ్డి, ఆ తరువాతి రోజుల్లో విభిన్న కథా వస్తువులతో ఉన్న చిత్రాలకు దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ముచ్చటించుకుంటున్న ‘‘పెద్దమనుషులు’’ చిత్రంలో ఓ పత్రికా సంపాదకుడు పాత్ర, నీతి నిజాయితీలకు నిలబడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల గళం ఎత్తే పాత్ర. ప్రశ్నించే వ్యక్తి. అభ్యుదయ భావాలకు ప్రతిబింబంగా నిలిచిన ఆ పాత్ర అన్యాయంగా సంచరించే పెద్ద మనుషులకు ఆటంకంగా వారి దారిలో కంటకంగా నిలిచింది. అది సహజం. దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ప్రతిఘటించే వారున్నంత కాలం అసాంఘిక శక్తుల ఆటలు సాగవు. పథకాలు ఫలించవు. అలాగని ప్రశ్నించే గొంతు లేనప్పుడు వ్యవస్ధ కుళ్ళిపోతుంది. మంచికి, మానవత్వానికి సమానత్వానికి విలువ, నిలువ నీడ లేకుండా పోతాయి. అందుకే ఏ కాలమైనా ఏ వ్యవస్ధలో అయినా జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే వ్యక్తి, శక్తి ఉండటం అవసరం.
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
‘‘పెద్దమనుషులు’’ చిత్రంలో చూపిన అసాంఘిక వ్యక్తులు ఇప్పటి సమాజంలో కూడా ఉండటం, అంతకు మించిన దురాగతాలు జరగడం ఒక విషాద పరిణామం. అయితే ప్రగతి కోరుకునే వ్యక్తి ఆశాజీవి! ఆగామి కాలంపై నమ్మకం ఉన్న విశ్వాసి. అందుకే తరాలు మారుతున్నా ప్రగతిపథం వైపు అన్ని రంగాలలో ఉద్యమాలు ఎప్పటికప్పుడు ఊపిరి పోసుకుంటున్నాయి. వ్యవస్ధాపరంగా అభ్యుదయ దృక్పథంతో సమూలంగా మార్పు వచ్చినప్పుడే నవ సమాజం ఏర్పడటానికి దారి ఏర్పడుతుంది అన్నది అక్షర సత్యమే కానీ అతిశయోక్తి కాదు.
అందుకే ‘‘పెద్దమనుషులు’’ చిత్రంలో నాటి (నేటికీ వర్తించే) రాజకీయాల మీద ఆలోచన రేకెత్తించే గీతాలు చిత్రీకరించారు. ఆ గీతాలలోని భావాలు నిత్య సత్యాలని, ఇవాళ వింటున్నా నిజమని అర్ధమవుతుంది.తెలుగు చిత్రాలలో తొలిసారిగా రాజకీయాల మీద ముఖ్యంగా గ్రామీణ రాజకీయాల కథా కథనాలతో వచ్చిన చిత్రం ‘‘పెద్దమనుషులు.’’ అవినీతి నిండిన రాజకీయాలకు, పల్లె పట్నం ఏదైనా రంగస్థలం అవుతుంది అనడం ఆశ్చర్యం కాదు.
అధికార కాంక్ష చేతికందిన అధికారాన్ని నిలుపుకునేందుకు అనుక్షణం చేసే కుటిల ప్రయత్నాలు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు దారులు వెదకడం, అందుకు అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం, ఇలాంటి విషయాను చర్చించిన చిత్రం ‘‘పెద్ద మనుషులు’’.
ఈ చిత్రానికి అంటే ఎంతో నిజాయితీ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ప్రాంతీయ చిత్ర పురస్కారం (రజత పతకం) అందచేయడం విశేషం.
‘‘పెద్దమనుషులు’’ చిత్రం ఆ తరువాతి కాలంలో వచ్చిన అనేక రాజకీయ ఇతివృత్తాలున్న చిత్రాలకు దిక్సూచి అయింది.
వాటిలో నాటి ‘‘ముందడుగు’’, ‘‘ఏంఎల్ఏ ఏడుకొండలు,’’ ‘‘లంచావతారం,’’ ‘‘కథానాయకుడు (ఎన్‌టిఆర్),’’ ‘‘ఈనాడు,’’ ‘‘దేశంలో దొంగలు పడ్డారు,’ ‘‘అంకుశం,’’ ‘నేటి భారతం,’’ ‘‘భారత్‌బంద్,’’ ‘‘ప్రతిఘటన’’ మొదలైనవి. ఇంచుమించుగా ఈ చిత్రాలన్నీ ఘన విజయం సాధించడం విశేషం.
Also read: తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు!
అంకుశం
పైన చెప్పిన చిత్రాలలో `అంకుశం` చిత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాజకీయాలకు, పోలీసు వ్యవస్ధకు గల సంబంధాలను నిర్దిష్టంగా దృశ్యమానం చేసిన ఇతివృత్తం కలది `అంకుశం` చిత్రం. నీతి నిజాయితీలు ఏ రంగంలో అయినా ఎవరికైనా ఉండవలసినవే. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ రెండు వ్యవస్ధలు సక్రమంగా పనిచేయకపోతే లేక ప్రలోభాలకు లొంగిపోతే, స్వార్ధ ప్రయోజనాలకే తమ అధికారాలను ఉపయోగించుకుంటే సమాజానికి ఎలాంటి నష్టం ఏర్పడుతుందో అందువల్ల ప్రజలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారో ఆసక్తికరమైన కథ, కథనాలతో నిర్మించిన ‘‘అంకుశం’’ చిత్రం ఘన విజయం సాధించింది.
ముఖ్యంగా ప్రజా రక్షణకు అంకితమైన పోలీసు వ్యవస్ధ ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆ వ్యవస్ధ ప్రజా క్షేత్రానికి ఏవిధంగా నిజమైన రక్షణ కవచంలా ఉంటుందో తెలియచేసిన చిత్రం ‘‘అంకుశం.’’
అధికార మదం తలకెక్కిన అహంకారపు రాజకీయ నాయకుల వంటి మత్తగజాలకు, ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోరే ఒక పోలీసు అధికారి ‘‘అంకుశం’’ లా మారి సాంఘిక విలువలను కాపాడటమే ఈ చిత్రం ప్రధాన ఇతితృత్తం.
అభ్యుదయ భావాలతో వృత్తికి నిబద్ధుడైన ఒక పోలీసు అధికారి రాజకీయ రంగం నుంచి ప్రతిక్షణం ఎదిరింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నా తన లక్ష్యాన్ని తన విధిని, తన బాధ్యతను ఎలా నెరవేర్చాడో, అందుకు ఎన్ని అడ్డంకులను సమర్ధంగా ఎదుర్కొన్నాడో ఆసక్తికరంగా, ప్రేక్షక జనామోదంగా తెలియచేసిన చిత్రం ‘‘అంకుశం.’’
ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు తమ స్వార్ధానికి, ఎంత నైచ్యానికి ఒడిగడతారో, రక్తసంబంధాలను కూడా రాజకీయ అవసరాలకు ఎలా బలిపెడతారో చూపుతూ, ప్రస్తుత రాజకీయ రంగంలోని డొల్లతనాన్ని, కుహనా రాజకీయ వాదుల నిజ స్వరూపాలను, రాజకీయ రంగంలో నిత్యం జరుగుతున్న ఎత్తుల జిత్తుల కార్యకలాపాలను, ఎండగడుతూ ప్రేక్షకులకు అసలు రాజకీయ రంగం స్వరూప స్వభావాలను సమగ్రంగా తెలియచేసిన చిత్రం ‘‘అంకుశం’’ అంటే అతిశయోక్తి కాదు.
Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు
అభ్యుదయం సిద్ధించాలంటే…
‘అటువంటి రాజకీయ రంగం ప్రక్షాళన కాకపోతే, నీతి నియమాల విలువలను పట్టించుకోని రాజకీయ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాక్షేత్రంలో అభ్యుదయం సిద్ధించదు. ప్రగతి కుంటుపడుతుంది’ అన్న సందేశంతో తెరకెక్కిన ‘‘అంకుశం’’ చిత్రం అందుకే ప్రేక్షకాదరణ పొంది గొప్ప విజయం సొంతం చేసుకుంది.
సాదారణంగా ఓ చిత్రానికి ఉండవలసిన వాణిజ్య సూత్రాలను పక్కనపెట్టి పూర్తిగా సమాజ హితం దృష్టిలో పెట్టుకున్న ఇతివృత్తం ‘‘అంకుశం.’’ అయినా ఆ కథా కథనాలు, ప్రేక్షకులను మెప్పించి, ఒప్పించే విధంగా ఉండటం, దర్శక నిర్మాతల ప్రతిభా పాటవాలను వెల్లడి చేస్తుంది.
కొన్ని చిత్రాలను ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. ఆ చిత్ర కథనం అలా ఉండటం వల్ల సమాజంలోని వాస్తవిక పరిస్ధితులను తెరపై కొన్ని పాత్రలలో చూస్తుండటం వలన ప్రేక్షకులకు తాము ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో తెలిసి వస్తుంది. నిజానికి అటువంటి చిత్రాల పరమార్ధం, ప్రయోజనం అదే. అదే ప్రగతి భావనకు బాటకు సంకేతంగా నిలుస్తుంది.
Also read: అక్షర ‘సిరి వెన్నెల’