Sunday, December 22, 2024

మానసిక ప్రశాంతతే స్వర్గం

భగవద్గీత86

‘‘పడుకోవడానికి పట్టుపరుపులు… తినటానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన ఆహారం… తిరగడానికి స్వంతవిమానాలు… ఇన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలి, ఏదో కావాలి, ఏదో సాధించాలి, ఎదుటివాడికి లేనిది నా దగ్గరుండాలి. నా దగ్గరే అంతా ఉండాలి.“ ఇలాంటి ఆలోచనలతో ఆ మనిషి మనసు నిలవదు. ఏవో ప్రణాళికలు రచిస్తాడు. ఏవో ఆలోచనలు చేస్తాడు. లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని పరిపాలించాలి. ఎక్కడా తప్పుజరగకూడదు. ప్రతిక్షణం మనసులో ముసురుకునే ఆలోచనలతో అశాంతి. నిద్రకూడా సరిగా పట్టదు. తినే అన్నం కూడా సరిగా తినలేడు.  ఈ అశాంతికి కారణం ‘‘లోభం.’’

Also read: స్వోత్కర్ష అసురీ ప్రవృత్తి

కనపడ్డ ప్రతి స్త్రీని చెరబట్టాడు నరకాసురుడు. వాడిదగ్గర పదహారువేలమంది ఆడవారు బందీగా ఉన్నారు. అయినా కోరిక నిలువనీయలేదు. ఎందరు అందమైన వారున్నా కొత్తముఖాన్ని చూస్తే వెర్రిపుడుతుంది. రావణాసురుడూ అంతే…

మనసులోని ఆ కోరిక నిలువెల్లా దహించివేసి నిలబడనీయకుండా చేస్తుంది. ప్రతిరోజూ ప్రేమ పేరుతో ఘాతుకాలు. కత్తిపట్టుకొని కుత్తుకకోయటాలు, యాసిడ్‌ దాడులు ఏ రోజు పేపర్లో ఇలాంటి వార్త లేదు చెప్పండి. నేటివారికన్నా నరకుడు, రావణుడు ఇంకానయం. కావాలనుకున్నవారిని కడతేర్చలేదు. మరి వీటికి కారణం…. మనసులో పుట్టిన అశాంతి. ఈ అశాంతికి పేరు ‘‘కామం‘‘

కోపంలో తండ్రిలేదు, తల్లిలేదు, గురువులేదు ఎదురుగా ఎవరున్నారనీ లేదు, ఉచితమా అనుచితమా అనే విచక్షణలేదు. మనిషి మెదడుని “క్రోధం“ కప్పివేస్తుంది.

Also read: చనిపోయినప్పుడు గీత వినిపించడం కాదు, బతకాలంటే వినాలి

మంచు కురిసే వేళలో ఎదురుగా రహదారి ఎలా కనపడదో కోపం మనసుమీద దుప్పటిపరిచి ఏమీ తెలియనీయకుండా చేస్తుంది. మనసులో తీవ్రమైన అశాంతి. ‘‘లోభము,’’ ‘‘కామము“ క్రోధము’’ ఈ మూడూ నరక ద్వారాలట.

మనస్సు ప్రశాంతంగా ఉంటే అదే స్వర్గం. ఆలోచనలు ముసిరి అల్లకల్లోలమైన మనసే నరకం.

Heaven is not a place created in SPACE. It is a state of MIND.

కామ, క్రోధ, లోభాలు అనే మూడు దారాలతో నేసిన దుప్పటి కప్పిన మనస్సే నరకం. కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలని భగవానుడు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేత్త్రయం త్యజేత్‌

చాలామంది తల్లిదండ్రులు పిల్లలమీద ఒత్తిడి విపరీతంగాపెట్టి నువ్వు అదికావాలి, ఇదికావాలి అని బలవంతంగా తమ ఇష్టాలు రుద్దిరుద్ది వదిలిపెడతారు. వారు ఏది కావాలనుకున్నారో అది కాలేకపోయారు. కాబట్టి వాళ్ళపిల్లలు అది కావాలని వారిలో ఒత్తిడిపెంచి నరకంలోకి తోసేస్తున్నారు.  కారణం… అదుగో పైన చెప్పబడిన కామం, క్రోధం, లోభం. వారు ఈ మూడు దారాలతో నేసిన దుప్పటి కప్పుకున్నారు గనుక.

మన మనస్సులో అశాంతి రేగినప్పుడల్లా గమనిస్తూ (Observe) వెళితే తెలుస్తుంది కారణమేమిటో. అది కామం వలన గానీ, క్రోధం వలన కానీ, అన్నీనాకే కావాలనుకునే లోభం వలనగానీ అయి ఉంటుంది.

జబ్బుకు కారణం తెలిసినప్పుడు మందువేయడం సులభం కదా. మంచివాడికి చెడ్డవాడికీ తేడా ఆలోచనలో కాదు. ఇద్దరికీ ఒకేరకం ఆలోచనలు పుడతాయి. ప్రతివాడికీ కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభం ఉంటుంది.

 ప్రవచనకారులు, యోగులు, సన్యాసులు, నేరస్తులు అనే తేడా మనసుకు ఉండదు. అందరివీ ఒకటే ఆలోచనలు.

కానీ…

తేడా ఎక్కడ అంటే కారణం గమనించి తనను తాను అదుపులో ఉంచుకునే వాడు మంచివాడు. అది తెలియని వాడు చెడ్డవాడు. అంతే!

Also read: మన ధర్మమె మనకు రక్ష

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles