Sunday, December 22, 2024

శాంతి యాత్ర

పోదాం పదమంటుంది నా ఆత్మ –

దూరదూర సీమలకు

మనిషి చేతికందని సీమల కెక్కడికో

కొండల ఒడిలోకి

అడవుల గర్భకుహరంలోకి

ఎక్కడికో పదమంటుంది

గాలి రైళ్ళలోకి దూకుతుంది

మేఘాల బిడారుల్లో కలుస్తుంది

దిగంతరేఖ మీద మెరిసే నిశ్శబ్దం కోసం

పెరుగుతున్న తృష్ఢ

తీర్చుకోవాలంటుంది

స్వప్నాల్లో కూడా వెంటాడే

నగ్న వృక్షాల వాడల బారినుంచి

పారిపొమ్మంటుంది

ఒక కలలోకి ప్రయాణం చెయ్యాలని

వెయ్యి కలలు కంటుంది –

ఏ కలలో జీవరాసులు

రెక్కల మీద ఎగురుతుంటాయో

గాలిలో తియ్యటి అక్షరాలు

విదజల్లుతూ

ఏ కలలో రాలుతున్న ఆకు కూడా

నేలమీద పడేముందు

ఒక గీతిక పడవలో తేలుతూ

పడుతుందో

సూర్యుడు ఆకాశపు నీలిహాలు లోకి ప్రవేశించినప్పుడు

కొండలు మేలుకొంటాయో

అడవులు మేలుకుంటాయో

దేశదిమ్మరిలా తిరిగే

సోమరి గాలిలో నుంచి

కలలు పుప్పొడిలా

రాలుతుంటాయో

ఎక్కడ ప్రాణం గుంపుల్ని వీడి

ఒంటరితనంలో ఓలలాడుతుందో

నిశ్వబ్దంతో సోదరత్వం

అనుభవిస్తుందో

ఎక్కడ ఎత్తయిన వృక్షాల బారులు

నిశ్శబ్దాన్ని ఊరేగింపుగా

కదులుతుంటాయో

ఎక్కడ కొండల మండువాలో

భూమ్యాకాశాలు పెళ్ళి చేసుకుంటాయో

ఎక్కడ పేరులేని పక్షి

కొమ్మల్లో కూర్చున్నంత మాత్రాన

పరిసరాలు పద్యాల్లో మారుతాయో

ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు

సంధ్యల్లో స్నానం చేసి ఆకుల కొనల్లో

ఎర్రపూల బిందువులు వ్రేలాడుతుండగా

ముందుకు వస్తుందో

ఎక్కడ ముద్దుగా

ఇంటిమీదకు ఒరిగిన

జాబిల్లి ముద్ద

చేతి కందుతా డనిపిస్తుందో

అక్కడికి

ఆ కల లోయల్లోకి

పోదాం పదమంటుంది ఆత్మ

నగ్న వృక్షాల బారినుండి

తప్పించుకుని

శాంతియాత్ర చేద్దాం

పదమంటుంది —

గుంటూరు శేషేంద్రశర్మ

వచనకవిత్వం ఆకాశంలో తేలే మేఘం వంటిది. మేఘాలకొక స్వరూపం ఉండదు. సోకే గాలిని బట్టి మేఘమాలికల స్వరూపం మారి పోతూ వుంటుంది. శేషేంద్ర ఒక చోట అంటాడు: “గాలి అనే శిల్పి గగనంలో వివిధాకృతుల్లో చెక్కే శిల్పం మేఘం.”

Also read: నా తెలంగాణా

కవిత్వానికి ఛందస్సనే ఆచ్ఛాదన అవసరం అని  యుగయుగాల నుండీ వింటున్న మాట. ఆధునిక విమర్శకులీ ధోరణిని అంగీకరించడం లేదు. సర్ ఫిలిప్ సిడ్నీ ఏమని చెబుతున్నాడో గమనించండి:

“The greatest part of poets have apparelled their poetic inventions on that numerous kind of writing called verse. Indeed verse is an apparel and an ornament. Verse is no cause to poetry since there have been most excellent poets who have never versified and now swarm many versifiers that need never answer to the name of poets.”

Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం

తిలక్, శేషేంద్రలది అగ్రస్థానం

ఆధునికాంధ్ర వచన కవుల్లో తిలక్, శేషేంద్ర అగ్రస్థానాన నిలబడతారన్న విషయం జగద్విదితం. శేషేంద్రలో తిలక్ ఛాయలు వున్నాయని కొందరు నమ్ముతారు. అందుకు  మనస్సు అంగీకరించదు. ఎవరి ఎత్తుగడ, పోకడ, వారిదే. కాకపోతే తిలక్ రచించినది తక్కువ. ఆయన అల్పాయువు. శరీరం ఆయనకు కలిసి రాలేదు. శేషేంద్ర ఆలోచనా పరిధి విస్తృతమైనది. తిలక్ భావుకుడు, అచ్చమైన కవి. శేషేంద్రలో మేధావి, విద్వాంసుడూ ఉన్నారు. ఇరువురూ ఎల్లలు లేని మానవతకు, అభ్యుదయానికీ, ప్రతీకలే.

Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం

తిలక్, శేషేంద్ర, ఇరువురూ చేయి తిరిగిన పద్యకవులే కావడం ఆశ్చర్యకరం. ఒకానొకప్పుడు ఇరువురికి ఛందస్సనే ఆహార్యం ఎంతో  ఇష్టం.  రానురాను కవితాసతి లోలోపలి గుండె చప్పుడు వినడానికే తహతహలాడిన వారే ఇద్దరూ.  Discarding the outer form, both of them yearned for the inner spirit. “శబ్దాలు, అర్థాలు, వట్టి మాటలూ కవిత్వం కావు. కవిత్వానికి కవి సృష్టి కావాలి” అంటాడు శేషేంద్ర. “కవిత్వం, స్థూలమైన భౌతిక స్వరూపం నుండి ద్రష్ట పిండుకునే తాత్త్విక బిందువు” అంటాడాయనే.

Also read: తుం గ భ ద్రా న ది

నేటి కవితలో కవి భౌతిక జగత్తును తృణీకరించి, “దూరదూర సీమలకు, మనిషికి అందని సీమలకెక్కడికో ఎగిరిపోవడమే శాంతి యాత్ర. ఈ క్రమంలో అబ్బురం కలిగించే అనేకానేక భావచిత్రాలు మోసుకొని వస్తున్నాడు కవి.

నేటి  “శాంతి యాత్ర” శేషేంద్ర “మండే సూర్యుడు” సంకలనంలోని ఒక ఖండిక.  “శాంతియాత్ర” కవితకు వచనకవితా పితామహుడన దగిన వాల్ట్ విట్ మన్ ఖండిక Birds of Passage కు పోలికలున్నాయంటారు ఆర్ ఎస్ సుదర్శనం గారు. వారుటంకించిన విట్ మన్ కవిత ఇది. గమనించండి:

విట్ మన్:

“Over the mountain grows disease and sorrow

An un-caught bird is ever hovering, hovering

High in the purer, happier air”

“From imperfection’s murkiest cloud

Darts always forth one ray of perfect light

One flash of heaven’s glory”

“To fashion’s custom’s discard,

To the mad Babel-din, the deafening orgies,

Soothing each lull a strain is heard, just heard,

From some far shore the final chorus sounding”

“O the blest eyes, happy hearts,

That see, that know the guiding thread so fine,

Along the mighty labyrinth”

ఇప్పుడు శేషేంద్ర:

“ఎక్కడ పేరు లేని పక్షి

కొమ్మల్లో కూర్చున్నంత మాత్రాన

పరిసరాలు పద్యాలుగా మారుతాయో”

“ఎక్కడ ఎర్ర యూకలిప్టస్ చెట్టు

సంధ్యల్లో స్నానం చేసి ఆకుల కొసల్లో

ర్ర పూలబిందువులు వ్రేలాడుతుండగా

ముందుకు వస్తుందో”

“ఎక్కడ ముద్దుగా ఇంటి మీదకు ఒరిగిన

జాబిల్లి ముద్ద

చేతికందుతా డనిపిస్తుందో”

“అక్కడకి, ఆ కల లోయల్లోకి

పోదాం పదమంటుంది ఆత్మ

నగ్నవృక్షాల బారినుంచి

తప్పించుకుని

శాంతియాత్ర చేద్దాం

పదమంటుంది–“

కొన్ని కవితలను విశ్లేషించడం దుర్లభం. “To be or not to be that is the question; whether it is nobler in the soul to suffer the slings and arrows of outrageous fortune” అంటూ సాగే హామ్లెట్ స్వగతాన్ని ఎవరు విశ్లేషింపగలరు?

“శాంతియాత్ర” అనుభవించి, ఆనందించ వలసిన కవితల్లో ఒకటి.

Also read: సంధ్య

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles