- చైనా విదేశాంగ మంత్రితో జై శంకర్ ఫోన్ సంభాషణ
- ద్వైపాక్షిక చర్చలపై ఆతృతగా ఉన్న చైనా
- శాంతియుత వాతావరణంలోనే చర్చలుంటాయని స్పష్టం చేసిన భారత్
చైనాతో దారుణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొన్నపుడే సాధ్యమవుతుందని భారత్ తేల్చిచెప్పింది. తూర్పు లద్దాఖ్ లోని అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంటేనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది. సమస్యను త్వరితంగా పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
Also Read: నమ్మరాని పొరుగుదేశం చైనా
శాంతి స్థాపనే ప్రథమ కర్తవ్యం:
భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు గత వారం పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను, యుద్ధ ట్యాంకులను ఉపసంహరించుకున్నాయి ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ గురువారం సుధీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. ఫోన్ సంభాషణకు సంబంధించి వివరాలను మంత్రి జై శంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని తెలిపారు. కానీ సరిహద్దులో ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు.
Also Read: కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాక్ ల మధ్య కీలక చర్చలు
పాంగాంగ్ సరస్సులో బలగాల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో మిగతా సమస్యలపై దృష్టి సారించాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని కీలక ప్రదేశాల్లో బలగాల ఉపసంహరణ పూర్తయ్యాక సరిహద్దులో గతంలో మాదిరిగా శాంతిని నెలకొల్పాలని జైశంకర్ వాంగ్ యీకి సూచించారు. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సద్దుమణికి శాంతి నెలకొన్న తర్వాతే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జై శంకర్ స్పష్టం చేశారు.