Wednesday, December 25, 2024

27న బైరాన్ పల్లి అమర వీరుల సంస్మరణదినం

ఆనందభాస్కర్, బైరాన్ పల్లి బురుజు

  • అన్ని పార్టీల నాయకులకూ ఆనందభాస్కర్ లేఖలు
  • 73 ఏళ్ళ కిందట రజాకార్లు 118 మంది సాయుధ స్వాతంత్ర్య సమరయోధులను హతమార్చారని గుర్తు చేశారు
  • ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కదిలి హైదరాబాద్ విమోచనకూ, విలీనానికీ చర్యలు  

హైదరాబాద్ : బైరాన్ పల్లి అమరదినం ఆగస్టు 27న జరపాలని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ నిర్ణయించారు. ఆ రోజున బైరాన్ పల్లిలో 73 సంవత్సరాల కిందట 27 ఆగస్టు 1948 నాడు అమరులైన 118 సాయుధ స్వాతంత్ర్య సమర యోధులకూ పితృయజ్ఞం, పిండదానం తన ఆధ్వర్యంలో జరుగనున్నాయని ఒక ప్రకటనలో మంగళవారంనాడు తెలిపారు. బైరాన్ పల్లి సంస్మరణ సభ ఈ సంవత్సరం తొలిసారిగా జరుగుతోంది. ఆ రోజున చలో బైరాన్ పల్లి కార్యక్రమం ఉంటుంది. పాత వరంగల్లు జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్ పల్లిలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన 15 ఆగస్టు 1947నాడు నిజాం సంస్థానంలో జెండాలు ఎగురవేసి చాలామంది విముక్తి, విమోచన, విలీన సాయుధపోరాటాలూ, బలిదానాలూ  చేశారని గుర్తుచేశారు. 27 ఆగస్టు 1948న రజాకార్ మూకలు బైరాన్ పల్లిని చుట్టుముట్టి 118 మంది సమరయోధులను హతమార్చారని చెప్పారు. బైరాన్ పల్లి బలిదానం భారత ప్రభుత్వాన్ని కదిలించి హైదరాబాద్ సంస్థానంపైన సైనిక చర్య తీసుకునేందుకు ప్రేరేపించింది. 20 రోజులపాటు అట్టుడిగిన హైదరాబాద్ 17 సెప్టెంబర్ 1948న భారతదేశంలో విలీనమైంది. ఇందులో బైరాన్ పల్లి అమరవీరుల వీరోచిత బలిదానం ప్రత్యేకంగా స్మరించుకోవలసిన దినమని ఆనంద భాస్కర్ తన ప్రకటనలో అన్నారు. బలిదానం జరిగి 73 ఏళ్ళు గడిచి 74వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. 27 ఆగస్టు శుక్రవారంనాడు రాష్ట్ర వ్యాపితంగా బైరాన్ పల్లి సంస్మరణ దినం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు బైరాన్ పల్లి బురుజు వద్ద అమరులైన 118 మందికి పిండప్రదానం జరుగుతుందనీ, యావత్తు తెలంగాణ సబ్బండ ప్రజానీకం తరఫున వివిధ పార్టీల రాజకీయ నాయకులకు రాసిన ఉత్తరంలో తెలియజేశాననీ ఆనంద భాస్కర్ అన్నారు.

కవాతు చేస్తున్న రజాకార్లు

27 ఆగస్టు నాడు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని పిలుపునిచ్చారు. వీర తెలంగాణ అమర వీరులను ఈ గడ్డ మరువలేదని నిరూపించాలని అన్నారు. సిద్ధాంతాలకూ, రాజకీయాలకూ, సామాజిక, కుల, మత నేపథ్యాలకూ అతీతంగా ఈ సంస్మరణ జరపమని పార్టీలపరంగా నాయకులకూ,పార్టీ శ్రేణులకూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకూ, తెలంగాణ రాష్ట్ర సమితి క్రియాశీలక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికీ, జాతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూ, సంఘటన కార్యదర్శి మంత్రి శ్రినివాసులుకూ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికీ, సీపీఎం (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకీ, తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులుకూ, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు శర్మిలకీ విడివిడిగా లేఖలు పంపినట్లు ఆనంద భాస్కర్ తెలియజేశారు. మజ్లీస్ అధ్యక్షుడికి లేఖ రాయలేదు కానీ బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించానలనీ, మజ్లిస్ సభ్యులూ, కార్యకర్తల చేత కూడా బైరాన్ పల్లి అమరదినం పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలనీ అసదుద్దీన్ ఒవైసీకి ఈ ప్రకటన ద్వారా విన్నపం చేసినట్టు తెలిపారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles